కేజీబీవీ టీచర్లకు 35% పనితీరు ఉంటేనే ఒప్పందం పునరుద్ధరణ

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉపాధ్యాయినుల ఒప్పంద సర్వీసు పొడిగింపుపై గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తాజాగా అమలు చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.

Updated : 11 Jun 2024 06:06 IST

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా ఎస్‌ఎస్‌ఏ ఆదేశాలు
పాత విధానం పాటించాలంటూ ఉపాధ్యాయినుల ఆవేదన

ఈనాడు, అమరావతి: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉపాధ్యాయినుల ఒప్పంద సర్వీసు పొడిగింపుపై గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తాజాగా అమలు చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరకపోయినా సంబంధిత దస్త్రాన్ని పాఠశాల విద్యాశాఖకు పంపి.. అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం రాకుండానే ఒప్పంద సర్వీసుపై ఆదేశాలు ఇచ్చారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినుల ప్రతిభ ఆధారంగా సర్వీసు పొడిగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిభను అంచనా వేసేందుకు కొన్ని పాయింట్లు ఇచ్చి, వాటి ఆధారంగా మార్కులు నిర్ణయించారు. వీటిల్లో 35% కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి సర్వీసు పునరుద్ధరణ నిలిపివేయాలని, వారి విషయంలో కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 

  • రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీలు ఉన్నాయి. ప్రిన్సిపాళ్లు, సీఆర్‌టీలు, పీజీటీలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటా ఏప్రిల్‌ 30న ఒక్క రోజు విరామంతో మే ఒకటో తేదీ నుంచి సేవలను పునరుద్ధరించేవారు. ఈసారి ఏప్రిల్‌లో రెండు రోజుల విరామంతో జూన్‌ 9 వరకు ఒప్పందాన్ని పొడిగించారు. తాజాగా ఈ నెల 11 నుంచి సర్వీసు క్రమబద్ధీకరణకు పనితీరు సూచికలను నిర్ణయించారు. 
  • విద్యార్థుల ప్రవేశాలు, 6-9 తరగతుల్లో వారికి వచ్చిన మార్కులు, పది, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులు, ఉపాధ్యాయిని సెలవులు, విధులకు ఆలస్యంగా రావడం, శిక్షణకు హాజరు కావడం, జాతీయ, రాష్ట్ర అవార్డులు పొందడం, స్థానికంగా నివాసం ఉండటం, క్రమశిక్షణ చర్యలకు కలిపి హోదాల వారీగా వందమార్కులు నిర్ణయించారు. వీరి సర్వీసు పొడిగించాలంటే కనీసం 35% మార్కులు రావాలనే నిబంధన తీసుకొచ్చారు. 

అందరి సర్వీసు పునరుద్ధరించాలి: ఏవీ నాగేశ్వరరావు

పనితీరు ఆధారంగా కేజీబీవీ బోధన సిబ్బంది సర్వీసు పునరుద్ధరించే విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సమగ్ర శిక్షా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సమాఖ్య ఐకాస గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పాత పద్ధతిలో అందరి సర్వీసును పునరుద్ధరించాలని కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని