చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి: స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి

సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు.

Published : 11 Jun 2024 05:54 IST

మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి. చిత్రంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి 

విశాఖపట్నం (చినముషిడివాడ, డాబాగార్డెన్స్‌)- న్యూస్‌టుడే: సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో గెలుపొందిన ఎన్డీయేకు అభినందనలు తెలిపారు. విశాఖ నగరం చినముషిడివాడలోని పీఠంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సింహలగ్న ముహూర్తం అద్భుతమైనది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌లు ప్రజలు మెచ్చే పాలన చేయాలని ఆశీర్వదిస్తున్నాం. అమరావతి రాజధాని ప్రకటన తర్వాత ఆ ప్రాంతంలో పీఠం నిర్మాణానికి స్థలం కొనుగోలు చేశాం. త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్వరూపానందేంద్ర అన్నారు. మాఘమాసంలో శ్రీశైలంలో కుంభాభిషేకం వద్దని చెప్పినా వైకాపా పాలకులు కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుని చేశారన్నారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పాల్గొన్నారు.

స్వరూపానందేంద్రను కర్మ వదిలిపెట్టదు: శ్రీనివాసానంద సరస్వతీ స్వామి 

వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు జరిగినా ఖండించని స్వరూపానందేంద్ర స్వామిని కర్మ వదిలిపెట్టదని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతీ స్వామి అన్నారు. విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వైకాపా ఓడిపోగానే స్వరూపానందేంద్ర ప్లేటు ఫిరాయించి చంద్రబాబును, మోదీని పొగుడుతున్నారన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్‌ భజన చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని