Andhra news: బలహీనంగా కరకట్టలు.. భయం భయంగా బతుకులు!

మరో నెల రోజుల్లో గోదావరికి మళ్లీ వరద రోజులు ప్రారంభం కానున్నాయి. జులై నుంచి అక్టోబరు వరకు నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.

Published : 23 May 2024 05:37 IST

వరద రోజుల్లో గోదారి తీరాన కష్టాలు తప్పవా
37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు
మూడేళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కారు
నిపుణుల నివేదికలు బుట్టదాఖలు
ఈనాడు - అమరావతి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా కె.గంగవరం మండలం సుందరపల్లి గ్రామంవద్ద ప్రమాదకరంగా ఉన్న గోదావరి ఎడమ గట్టు

మరో నెల రోజుల్లో గోదావరికి మళ్లీ వరద రోజులు ప్రారంభం కానున్నాయి. జులై నుంచి అక్టోబరు వరకు నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. జూన్‌లోనే భారీ వరదలు వచ్చిన అనుభవాలూ ఉన్నాయి. ఈ రోజుల్లో వందల కిలోమీటర్ల మేర గోదావరి తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అనేక పల్లెలు బితుకు బితుకుమంటూ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. నదీ తీర ప్రాంతం పొడవునా చాలాచోట్ల కరకట్టలు బలహీనమయ్యాయి. డ్రెయిన్లు గోదావరిలో కలిసే చోట్ల వరద సమయంలో ప్రవాహాలు వెనక్కు తన్ని.. ఊళ్లకు ఊళ్లే ముంపులో చిక్కుకుంటున్నాయి. దీంతో వేలమంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి జలవనరుల శాఖ నియమించిన నిపుణుల బృందం కరకట్టల పొడవునా.. అన్ని ప్రాంతాలూ సందర్శించి సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. ఎక్కడెక్కడ కరకట్టలు బలహీనంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత సర్కారులో ఈ నివేదికను పట్టించుకున్న నాథుడు లేరు. కరకట్టలు పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు. ఆ నివేదికలన్నీ గోదావరికి అర్పించినట్లయింది. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా ఉన్న నది.. ఆ తర్వాత అనేక పాయలుగా చీలిపోయింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దిగువన అఖండ గోదావరి గౌతమి, వశిష్ట పాయలుగా చీలింది. గౌతమి మళ్లీ గౌతమి, వృద్ధగౌతమి, కోరంగి పాయలుగా విడిపోయింది. వశిష్ట రెండు పాయలుగా.. వశిష్ట, వైనతేయలు పాయలుగా సముద్రంలో కలుస్తోంది. అఖండ గోదావరికి 83.73 కిలోమీటర్లు, గౌతమికి 204.70 కి.మీ., వశిష్టకు 246.30 కి.మీ. మేర గట్లు ఉంటాయి. వీటికి సంబంధించి దాదాపు 37 చోట్ల అత్యంత బలహీనంగా, ప్రమాదకరంగా కరకట్టలు ఉన్నాయని జలవనరుల శాఖ నిపుణుల కమిటీ నివేదించింది. 2020, 2022, 2023లలో గోదావరి పెద్ద వరదలను ఎదుర్కొంది. కట్టలు బలహీనంగా ఉండటంతో ఈ మూడు సందర్భాల్లోనూ ప్రజలు భయాందోళనలు చెందారు. అధికారులు ఆ కరకట్టలను రక్షించేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. అప్పట్లోనే అక్కడ పనిచేసిన చీఫ్‌ ఇంజినీరు కరకట్టల పటిష్ఠానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దాని ఫలితంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విశ్రాంత ఇంజినీరింగు నిపుణులు, గోదావరి డెల్టా చీఫ్‌ ఇంజినీరు, ఆకృతుల సంస్థ చీఫ్‌ ఇంజినీరు బృందంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీయే వెంటనే కరకట్టలు పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సమగ్ర నివేదిక అందించింది. కరకట్టలను ఆనుకొని గోదావరిలో ఇసుక తవ్వకాలు భారీగా చేపట్టడం వల్ల కూడా గట్టు దెబ్బతింటోందని పేర్కొంది. గతంలో పనులు చేసిన చోట కూడా కరకట్టలు బలహీనమవుతున్నట్లు గుర్తించారు. గ్రోయిన్ల నిర్మాణ శైలిని మార్చుకోవాలని సూచించడంతో పాటు పుదుచ్చేరి ప్రభుత్వ పరిధి యానాం పరిసర ప్రాంతాల్లో గోదావరి కరకట్టల పటిష్ఠానికి తీసుకున్న చర్యల తరహాలోనే నిర్మాణాలూ ఉండాలని సిఫార్సు చేశారు.

86 వరద స్థాయికి తగ్గట్టుగా పనులు ఏవీ?

1986లో గోదావరికి అతి భారీ వరద వచ్చింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ వరదగా రికార్డయింది. నాడు 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పోటెత్తడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ, ఏరూ ఏకమైనట్లుగా పరిస్థితి మారింది. అంతకుముంద]ు 15 లక్షల క్యూసెక్కుల వరదకు తగ్గట్టుగా గోదావరి గట్లు ఉండేవి. 1953లో 30,03,100 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా.. 14 చోట్ల నదికి గండ్లు పడి కోనసీమ ప్రాంతం ధ్వంసమైంది. ఆ తర్వాత అదే ప్రమాణ స్థాయిగా కరకట్టల ఎత్తు పెంచారు. 1986 తర్వాత అప్పటి వరదను ప్రమాణస్థాయిగా తీసుకొని గట్లు ఎత్తు పెంచారు. అయితే ఇప్పటికీ 56 కిలోమీటర్ల మేర ఆ స్థాయి ఎత్తులో కరకట్టల నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి తోడు గట్లు చాలాచోట్ల బలహీనపడ్డాయి. అప్పట్లో చీఫ్‌ ఇంజినీరు రూ.150 కోట్లతో ప్రతిపాదనలు పంపినా, ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. గడిచిన మూడేళ్లలో ఒక్క పైసా కూడా గోదావరి కరకట్టల పటిష్ఠానికి ఖర్చు చేయలేదని సర్కారు లెక్కలే చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని