Andhra Pradesh News: రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు

పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి.

Updated : 18 May 2024 05:31 IST

సొంత గుత్తేదారులకు పెద్దపీట!
నామమాత్రంగా రెండు సంక్షేమ పథకాలకే జమ 
పేదల పథకాల సొమ్ములకు మోక్షమేదీ?
చెల్లింపులకు ఏవీ విధివిధానాలు? 
ఫిఫో ఎందుకు పాటించరు? 
మరో రూ.2,000 కోట్ల అప్పులకు..

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. క్విడ్‌ప్రోకో విధానాలకు అలవాటుపడ్డ అధికారులు పోలింగ్‌ తర్వాతా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. గత బుధ, గురువారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు రూ.4,000 కోట్ల మేర చెల్లింపులు చేసింది. ఇందులో రూ.1,480 కోట్ల ఆసరా సొమ్ములు, రూ.502 కోట్ల విద్యాదీవెన సొమ్ములు మాత్రమే లబ్ధిదారులకు చెల్లించారు. ఎప్పుడో బటన్‌ నొక్కిన ఈ పథకాలకు తాజాగా చెల్లింపులయ్యాయి. ఇదే సమయంలో రూ.2,000 కోట్ల వరకు అనుయాయులకు చెల్లించేశారు.

పోలింగ్‌కు ముందు రోజు మొత్తం రూ.14,165 కోట్లు పేదలకు చెల్లించాలంటూ నానా హంగామా చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రస్తుతం ఆ చెల్లింపులపై పెద్దగా దృష్టి పెట్టలేదనేందుకు తాజా పరిణామాలు తార్కాణంగా నిలిచాయి. ఆసరా, విద్యాదీవెన పథకాల కింద మరికొంత సొమ్ము ఇంతకుముందే చెల్లించినట్లు సమాచారం. ఇవికాకుండా వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా, రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ములు జమ చేయాల్సి ఉంది. శుక్రవారంనాటి పరిస్థితుల ప్రకారం ప్రస్తుతం చేతిలో రూ.200 కోట్ల నగదు ఉన్నట్లు సమాచారం. అంటే వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద తీసుకున్న చెల్లింపులు కూడా రిజర్వుబ్యాంకుకు పూర్తి చేసినట్లే. మరోవైపు వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ రూపేణా రూ.2,000 కోట్లు తీసుకురానున్నారు. ఆ నిధులు బుధవారం ఖజానాకు చేరుతాయి. మరోవైపు ప్రతి రోజూ వివిధ రూపాల్లో వచ్చే నిధులూ కలిపి చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుత్తేదారుల ఆందోళన

పథకాలకు అంతంతమాత్రంగా చెల్లిస్తున్న అధికారులు మరో వైపు అనుయాయ గుత్తేదారులకు మాత్రం బిల్లులను చెల్లిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ ఆర్థిక సంవత్సరానికీ బదిలీ చేస్తూ బడ్జెట్‌ సమయంలోనే నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడింది. ఎన్నికల తర్వాత కూడా అనుయాయులకు బిల్లులిచ్చే క్రమంలోనే అప్పట్లో బడ్జెట్‌ విడుదల మార్గదర్శకాల్లో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక తమ వారికే బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యమిస్తున్నారు. మరో వైపు అనేక మంది గుత్తేదారులు, సరఫరాదారులు ఈ చివరి నిమిషంలోనూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం పాలనలో రాష్ట్ర ఉన్నతాధికారులదే కీలక పాత్ర. ఖజానా చెల్లింపుల్లో స్క్రీనింగు కమిటీ నిర్ణయాలే ముఖ్యం. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు అప్పటి ఉన్నతాధికారులు ఫిఫో విధానం పక్కాగా పాటించారు. తొలుత వచ్చిన బిల్లును తొలుత చెల్లించాలనే ఈ విధానాన్ని అనుసరిస్తే ఎవరినుంచీ విమర్శలు ఉండవు. ఇందుకు భిన్నంగా వైకాపా ప్రభుత్వంలో ఆర్థికశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఫిఫోను విస్మరించి పెద్దల మాటలకే పెద్ద పీట వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని