MLA Pinnelli Case:: హమ్మయ్య.. అనుకున్న పోలీసులు!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేట్రేగిపోవడం, సింహం సింగిల్‌గానే వస్తుందని సినిమా డైలాగులు చెప్పడం... పరిస్థితులు ఎదురు తిరగ్గానే పిల్లిలా పారిపోవడం కొందరు వైకాపా నాయకుల నైజం..!

Updated : 24 May 2024 06:53 IST

ప్రస్తుతానికి పిన్నెల్లిని అరెస్టు చేయక్కర్లేదని ఊరట
పది రోజులుగా ఆయనను అరెస్టు చేయకుండా హైడ్రామా
ఇప్పటికీ పరారీలోనే పిన్నెల్లి..!

ఈనాడు, అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేట్రేగిపోవడం, సింహం సింగిల్‌గానే వస్తుందని సినిమా డైలాగులు చెప్పడం... పరిస్థితులు ఎదురు తిరగ్గానే పిల్లిలా పారిపోవడం కొందరు వైకాపా నాయకుల నైజం..! మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారిలో ఒకరు..! వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లూ కన్నూ మిన్నూ కానకుండా నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఆయన... పోలీసులు తనవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా వ్యవస్థలను నియంత్రించారు. ఇప్పుడు అదే పోలీసులకు దొరక్కుండా కలుగులో దాక్కున్నారు. ‘‘పారిపోవాల్సిన అవసరం నాకేంటి? నేను ఎక్కడికీ పారిపోలేదు. కావాలంటే రెండు గంటల్లో మాచర్లకు రాగలను’’ అని బీరాలు పలికిన పిన్నెల్లి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. పల్నాడు పులి అంటూ అనుచరులిచ్చే బిల్డప్‌లతో తెగ రెచ్చిపోతూ... ఎన్నికల తర్వాత అందరికీ ‘సినిమా చూపిస్తా’నని హెచ్చరించిన ఆయన పోలీసులకు దొరక్కుండా దాగుడుమూతలు ఆడారు. పిల్లిలా ఒక చోటు నుంచి మరో చోటుకు మకాం మార్చారు.

పోలీసులు గురువారం కూడా పిన్నెల్లి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాష్ట్రంలో డీజీపీ మారినా పోలీసుల తీరు మారలేదనడానికి పిన్నెల్లి పరారీ ఉదంతమే నిదర్శనం. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసులు నిజంగానే గాలిస్తున్నారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లి పోలీసుల అదుపులో ఉన్నారని కాసేపు, అరెస్టు చేయలేదని కాసేపు బుధవారం అర్ధరాత్రి వరకు ఊహాగానాలు కొనసాగాయి. ఆయన నరసరరావుపేట కోర్టులో లొంగిపోతున్నారంటూ గురువారం ప్రచారం జరిగింది. దాంతో నరసరావుపేట, గురజాల కోర్టుల వద్ద కొందరు పోలీసుల్ని మోహరించారు. అంతకుమించి పిన్నెల్లిపై కేసుల దర్యాప్తులో గానీ, ఆయన ఆచూకీ కనిపెట్టడంలో గానీ పోలీసులు గురువారం ఎలాంటి పురోగతి సాధించలేదు. మరోపక్క ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఆయనపై జూన్‌ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించింది. పోలీసులకు కావలసిందీ అదే..! హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే... పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి..! ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు ఇది నిజంగా ఊరటే..! 

పోలీసులు నిజంగానే అరెస్టు చేయలేకపోయారా?

పోలింగ్‌ మర్నాడు కారంపూడి, మాచర్లలో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని విధ్వంసం సృష్టించడం, తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల విధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఎమ్మెల్యేను ఈ నెల 15న పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై పోలీసులు కేసులు నమోదుచేయడంతో అరెస్టు తప్పదన్న భయంతో... ఆయన మర్నాడు రాత్రి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పారిపోయారని ప్రచారం జరగడంతో, అక్కడ శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకే హైదరాబాద్‌ వచ్చాను తప్ప, తాను పారిపోలేదని, కావాలంటే రెండు గంటల్లో మాచర్లకు రాగలనని ఆయన టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇలా బహిరంగంగా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రతిపక్ష నాయకులకు సవాళ్లు విసురుతున్నా... పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదు.

ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో... విధిలేని పరిస్థితుల్లో పోలీసుల్లో కదలిక వచ్చింది. పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని పిన్నెల్లి ఇంటికి సమీపంలో వేచి ఉండటం.. కాసేపటికి ఆయన ఇంటినుంచి బయటకు వచ్చిన కారును వెంబడించడం.. కొంత దూరం వెళ్లాక నిలిచిపోయిన ఆ కారులో పిన్నెల్లి లేకపోవడం.. ఆయన కారు దిగి రోడ్డు దాటి మరో కారులో హైదరాబాద్‌ వైపు వెళ్లిపోయారని ఎమ్మెల్యే కారు డ్రైవర్, గన్‌మెన్‌ చెప్పడంతో పోలీసులు అవాక్కై వట్టి చేతులతో వెనుదిరగడం వంటి పరిణామాలు బుధవారం జరిగాయి. ఇదంతా నిజంగానే జరిగిందా? పోలీసులు పండించిన హైడ్రామానా? అన్న విషయంలోనూ సందేహాలున్నాయి. మరోపక్క ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి విదేశాలకు పారిపోయారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. 

ఇది పోలీసుల చేతగానితనం కాదా?   

పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు గురువారం రాత్రి వచ్చాయి. అంతకుముందు పోలీసులు ఏం చేశారు? పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసినప్పుడు... ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళుతున్న ఎమ్మెల్యేను అడ్డుకోలేదు సరే... ఆ తర్వాతైనా ఉన్నతాధికారులకు చెప్పలేదా? అలాగైతే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్నికల అక్రమాల్ని అడ్డుకోనందుకు రెంటచింతల ఎస్‌ఐని సస్పెండ్‌ చేసినప్పుడే ఎమ్మెల్యేని ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన పొరుగు రాష్ట్రానికి పారిపోయే వరకూ ఎందుకు ఊరుకున్నారు? ఎమ్మెల్యేతోపాటు ఉన్న గన్‌మెన్‌ పోలీసులే కదా? వారిని సంప్రదించి ఎమ్మెల్యే ఆచూకీ ఎందుకు తెలుసుకోలేదు? హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికే వెళ్లామని చెబుతున్న పోలీసులు... ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండటమేంటి? ఆయన కారు ఇంట్లోంచి బయటకు వెళుతుంటే అక్కడే అడ్డుకోకుండా వెంబడించడమేంటి? చివరకు కారులో ఎమ్మెల్యే లేరని, పారిపోయారని చెప్పడమేంటి? ఇదంతా పోలీసుల చేతగానితనం కాదా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని