రూ.100 కోట్లకు పైగా దోచిపెట్టే పన్నాగం

ప్రైవేటు గుత్తేదారుకు రూ.100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకలశాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పారు.

Updated : 26 May 2024 09:03 IST

 తెరవెనుక చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి, విద్యాశాఖ కీలక అధికారి
‘ఆర్బిట్రేటర్‌’ నిబంధనను సాకుగా చూపి.. గుత్తేదారుకు చెల్లింపులకు చర్యలు
హైకోర్టు సింగిల్‌ జడ్జి, ధర్మాసనం తీర్పులనూ పట్టించుకోకుండా ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రైవేటు గుత్తేదారుకు రూ.100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకలశాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పారు. ఎన్నికల ముందు రహస్యంగా ఈ వ్యవహారం సాగించారు. ట్యాబ్‌ల కాంట్రాక్టుతో ఇప్పటికే ఆ గుత్తేదారుతో అంటకాగుతున్న ప్రభుత్వ సలహాదారు, మంత్రి అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ (ఏడీసీఆర్‌) టీవీల సరఫరాలోనూ ఆయనపై ప్రేమ కురిపించారు. గుత్తేదారు సంస్థ 2వేల ఏడీసీఆర్‌లను సరఫరా చేశామని చెబుతున్నా.. ఒప్పందం ప్రకారం 779 ఏడీసీఆర్‌లకే సొమ్ము చెల్లించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి, సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చాయి. కానీ, ఒప్పందంలో ‘ఆర్బిట్రేటర్‌’ నిబంధనను సాకుగా చూపుతూ గుత్తేదారుకు లబ్ధి చేకూర్చేందుకు పావులు కదిపారు. ఆర్బిట్రేటర్‌ న్యాయశాఖ కార్యదర్శి ద్వారా గుత్తేదారుకు రూ.100కోట్లకు పైగా దక్కేలా వైకాపా ప్రభుత్వ పెద్దలు అవార్డు జారీ చేయించుకోవడం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందరూ ఏకమైన ప్రజాధనాన్ని అప్పనంగా గుత్తేదారు సంస్థకు కట్టబెట్టేలా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఏం జరిగింది?

ఏడీసీఆర్‌ సామగ్రి సరఫరా చేసేందుకు ఏపీ సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ గతంలో రూ.123.83 కోట్ల విలువైన టెండర్‌ ప్రకటన జారీచేశారు. ఈ టెండర్‌లో సెల్‌కాన్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. 90 రోజుల్లో 2వేల ఏడీసీఆర్‌ల సరఫరా పూర్తిచేయాలని ఎస్‌ఎస్‌ఏ వర్క్‌ ఆర్డర్‌ జారీచేసింది. నిర్దిష్ట సమయంలో సరఫరా చేయకపోతే తిరస్కరించే అధికారం ఉంటుందని, జరిమానా విధించొచ్చని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏడీసీఆర్‌ల సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంపిణీని నిలిపేయాలని గుత్తేదారు సంస్థకు అధికారులు ఆదేశించారు. దీంతో గడువులోపు సరఫరా చేసిన 779 ఏడీసీఆర్‌లకూ ప్రభుత్వం సొమ్ము చెల్లించడం లేదని తొలుత గుత్తేదారు సంస్థ 2021 జూన్‌లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. వాటి సొమ్మును చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వమూ ఆ సొమ్ము చెల్లించింది.

ధర్మాసనం ముందు అప్పీల్‌

సింగిల్‌ జడ్జి తీర్పుపై గుత్తేదారు సంస్థ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి 779 ఏడీసీఆర్‌లకే సొమ్ము చెల్లించాలన్నారని, మొత్తం 2,000 యూనిట్లకు చెల్లించేలా ఆదేశించలేదని పేర్కొంది. అప్పీల్‌పై విచారణ జరిపిన హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, అప్పీల్‌ను కొట్టేస్తూ 2023 ఆగస్టు 9న తీర్పు వెల్లడించింది.

మతలబంతా ఇక్కడే

హైకోర్టు సింగిల్‌ జడ్జి, ధర్మాసనం రెండూ 779 ఏడీసీఆర్‌లకే సొమ్ము చెల్లించాలని తీర్పునిచ్చాయి. ఒప్పందంలోని ఆర్బిట్రేషన్‌ క్లాజ్‌ను సాకుగా చూపుతూ గుత్తేదారుతో కుమ్మక్కైన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి తెరవెనుక చక్రం తిప్పారు. దీనికి పాఠశాల విద్యాశాఖ కీలక అధికారి సహకారం అందించారు. గుత్తేదారు సంస్థ సరఫరా చేసినట్లు చెబుతున్న 2వేల ఏడీసీఆర్‌లలో మిగతా 1,221కీ సొమ్ము చెల్లించేలా అవార్డు జారీ చేయాలని కోరుతూ అర్బిట్రేటర్‌ను ఆశ్రయించింది. గుత్తేదారు అభ్యర్థనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు తోడవ్వడంతో రూ.వంద కోట్లకుపైగా డబ్బులు చెల్లించేందుకు ఆర్బిట్రేటర్‌ ద్వారా ఆదేశాలు వెలువడ్డాయి. 

వీటిని పట్టించుకోలేదనే విమర్శలు..

ఏడీసీఆర్‌లు సరఫరా చేసేందుకు కాలపరిమితిని ‘వర్క్‌ ఆర్డర్‌’ తేదీ నుంచి మాత్రమే లెక్కించాల్సి ఉండగా.. ఆ విషయాన్ని ఆర్బిట్రేటర్‌ పరిగణనలోకి తీసుకోలేదని, వడ్డీతో చెల్లించాలనడం ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని నిబంధనల పరిధికి మించి ఆర్బిట్రేటర్‌ వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓ కేసులో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఇందులో ఆర్బిట్రేటర్‌ వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. నిర్వహణ నిబంధనలను గుత్తేదారు ఉల్లంఘించినా, నిర్వహణ కింద రూ.16.95 కోట్లు చెల్లించాలని అవార్డు జారీచేయడం చట్టవిరుద్ధంగా ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


ఆర్బిట్రేటర్‌ అవార్డు ఆదేశాలివే..

  • ఏడీసీఆర్‌లు సరఫరా చేసినందుకు గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం రూ.66.63 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేటర్‌ ఆదేశించారు. 
  • గతంలో 779 ఏడీసీఆర్‌లకు సొమ్ము చెల్లించే క్రమంలో ఆ సంస్థ నుంచి జరిమానా రూపంలో మినహాయించిన రూ.6.61 కోట్లూ తిరిగివ్వాలి. 
  • రూ.66.63 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేసినందుకు గుత్తేదారు సంస్థకు 12% వడ్డీ కట్టాలి. 
  • 2020 సెప్టెంబరు నుంచి 2024 సెప్టెంబరు వరకు నిర్వహణకు రూ.16.95 కోట్ల సొమ్ము ఇవ్వాలి.
  • వడ్డీ కాకుండా ఈ మొత్తమే రూ.90.19 కోట్లు అవుతోంది. అంతా 30 రోజుల్లో చెల్లించాలి. 
  • ఇన్‌స్టాలేషన్‌ పెండింగ్‌లో ఉన్నవాటిని పూర్తి చేసి 30 రోజుల్లో ఆ సొమ్ము కోసం ప్రభుత్వానికి బిల్లులు సమర్పించాలని గుత్తేదారు సంస్థకు సూచించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు