Bhogapuram: భోగాపురంలో భూములు కొన్న ఐఏఎస్‌లు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామ పంచాయతీ పరిధిలో కొందరు ఐఏఎస్‌ అధికారులు    5.33 ఎకరాలను కొద్ది నెలల కిందట కొనుగోలు చేశారు.

Updated : 31 May 2024 07:30 IST

అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఆ స్థలాలు
ఇటీవల లేఅవుట్‌ అనుమతికి ప్రతిపాదన!

ఈనాడు, విశాఖపట్నం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామ పంచాయతీ పరిధిలో కొందరు ఐఏఎస్‌ అధికారులు 5.33 ఎకరాలను కొద్ది నెలల కిందట కొనుగోలు చేశారు. కొందరు అధికారులు బృందంగా ఏర్పడి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతం విశాఖకు 40 కి.మీ, విజయనగరానికి 30 కి.మీ.దూరంలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడు కి.మీ. దూరంలో ఉంది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)- 2041 బృహత్తర ప్రణాళిక అమల్లోకి రావడంతోపాటు విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో ఇక్కడి భూములకు మరింత విలువ పెరగనుంది. ఈ నేపథ్యంలోనే స్థానికుల నుంచి జిరాయితీ భూములు కొనుగోలు చేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో ఈ స్థలాలను సేకరించి కొనుగోలు చేసినట్లు సమాచారం.   

లేఅవుట్‌కు అనుమతి కోరుతూ..

ఐఏఎస్‌లు కొనుగోలు చేసిన స్థలాలు విమానాశ్రయానికి సమీపంలో వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక మిశ్రమ వినియోగ జోన్‌-3లో ఉన్నాయి. దీంతో ఇక్కడ నచ్చిన నిర్మాణాలు చేపట్టవచ్చు. పర్యాటక, వాణిజ్య, నివాస ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ లేఅవుట్‌ అనుమతి (ఎల్‌పీ) కోసం వీఎంఆర్‌డీఏకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఆధునిక వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 85 ప్లాట్ల వరకు ఉండే విధంగా ప్రణాళిక చేసినట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వారితో పాటు ఇతర చోట్ల విధులు నిర్వహించే అధికారులు ఇక్కడ కొనుగోలు చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని