ICMR: కత్తిగాటు లేకుండా శవపరీక్ష

ప్రమాదాల్లో, నేర ఘటనల్లో చనిపోయిన వారి మృతదేహాలకు శవపరీక్షలు చేయించడం కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన కలిగించే పరిణామం.

Updated : 10 Jun 2024 06:55 IST

వర్చువల్‌ అటాప్సీకి ఐసీఎంఆర్‌ ప్రోత్సాహం
త్రీడీ కన్వర్షన్, ఫొటోగ్రామ్మెట్రీ సాంకేతికత వినియోగం
కర్నూలు, గుంటూరు, విశాఖలో అమలుకు ప్రతిపాదనలు

ఈనాడు, అమరావతి: ప్రమాదాల్లో, నేర ఘటనల్లో చనిపోయిన వారి మృతదేహాలకు శవపరీక్షలు చేయించడం కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన కలిగించే పరిణామం. అసలే ఆప్తులను కోల్పోయామన్న విషాదంలో ఉంటే, శవపరీక్ష పేరిట వారి శరీర భాగాలను కోయడం, సుత్తెతో పుర్రె పగలగొట్టడం జీర్ణించుకోలేనివి. కొన్నివర్గాల వారు మెడికో లీగల్‌ కేసుల్లోనూ శవపరీక్షలకు ముందుకు రాకుండా రాజీకి యత్నించడానికి కారణమిదే. ఈ తరుణంలో, కత్తిగాట్లు లేకుండా వర్చువల్‌ అటాప్సీ విధానంలో శవపరీక్షలు చేసే వైద్యపరమైన సాంకేతికత త్వరలోనే రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. త్వరగా పోస్టుమార్టం పూర్తిచేసి శవాన్ని పంపించడంతో పాటు ఈ నివేదికలు న్యాయపరంగానూ చెల్లుబాటు కావడం ఈ విధానంలోని అదనపు సౌలభ్యాలు.

వర్చువల్‌ అటాప్సీ లేదా డిజిటల్‌ అటాప్సీ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు బోధనాసుపత్రులకు అత్యాధునిక స్కానింగ్‌ యంత్రాలను గ్రాంట్స్‌ రూపంలో ఇవ్వనుంది. ఇందుకు సుమారు రూ.2 కోట్ల ఖర్చవుతుంది. ఏపీలో కర్నూలు, గుంటూరు బోధనాసుపత్రులు, విశాఖ కేజీహెచ్‌లో ఈ విధానం అమలుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దిల్లీ, రిషికేశ్, నాగ్‌పుర్‌ ఎయిమ్స్‌ల్లో ఈ విధానం అమలవుతోంది. ఐదేళ్లుగా వర్చువల్‌ అటాప్సీ విస్తృతికి ఐసీఎంఆర్‌ చర్యలు తీసుకుంటోంది. రిషికేశ్‌ ఎయిమ్స్‌లో డీఎం-ఫోరెన్సిక్‌ రేడియాలజీ అండ్‌ వర్చువల్‌ అటాప్సీ కోర్సు (సూపర్‌ స్పెషాల్టీ)లో ఫోరెన్సిక్‌లో ఎండీ చేసిన వారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ కోర్సును మరిన్ని ఆసుపత్రుల్లో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఏటా గుంటూరు, విశాఖ బోధనాసుపత్రుల్లో 2 వేలు, మిగిలిన బోధనాసుపత్రుల్లో 1,000-1,500 వరకు శవపరీక్షలు జరుగుతున్నాయి.

ప్రస్తుత విధానంలో మూణ్నాలుగు గంటలు!

అసహజ మరణం చెందిన వారి మృతదేహాలకు బోధనాసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల్లో పోస్టుమార్టం చేస్తుంటారు. మృతుల వివరాలను పోలీసులు ఆసుపత్రిలో అందించాక, వైద్యులు అందుబాటులో ఉండి వెంటనే పోస్టుమార్టం ప్రారంభిస్తే పూర్తి కావడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది. ఈ ప్రక్రియలో వైద్యులు వివిధ పరికరాలతో మృతదేహం ఛాతీ, కడుపు, మెడ, పుర్రెను తెరుస్తారు. మృతదేహంపై ఎక్కడ గాయాలున్నా ఈ నాలుగు భాగాల పరిశీలన ద్వారా మరణానికి కారణాలు 90% వరకు నిర్ధారణ అవుతాయి.

వర్చువల్‌ అటాప్సీలో.. అరగంటే

సీటీ, ఎమ్మారై, త్రీడీ ఫొటోగ్రామ్మెట్రీ సాంకేతికత గల యంత్రం ద్వారా చేసే వర్చువల్‌ అటాప్సీ ప్రక్రియ అరగంటలో పూర్తవుతుంది. శవాన్ని బ్యాగుల్లో చుట్టి సాధారణ సీటీ, ఎమ్మారై స్కానింగ్‌ మాదిరిగానే ఇందులోనూ పరీక్షిస్తారు. శవంతో కూడిన బ్యాగ్‌ మిషన్‌ లోపలికి పంపిస్తుండగా, శరీర అవయవాలను అన్ని కోణాల్లోంచి పరిశీలించేలా ఇమేజెస్‌ జనరేట్‌ అవుతాయి. వాటి ఆధారంగా కండరాలు, కాలేయం, కిడ్నీ, ఇతర అవయవాల్లోని గాయాలను గుర్తిస్తారు. అంతర్గత రక్తస్రావం, అవయవ లోపాలు, అసాధారణ గాయాలతో పాటు కంటితో చూడలేని సూక్ష్మ తేడాలను వర్చువల్‌ అటాప్సీలో పరిశీలిస్తారు. ఇమేజెస్‌ను బట్టి మరణం ఎలా జరిగిందో వైద్యులు నిర్ధారిస్తారు. పోస్టుమార్టం గదిలోకి మృతదేహం వచ్చినప్పటి నుంచి అర గంటలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని విశాఖ కేజీహెచ్‌ ఫోరెన్సిక్‌ వైద్యుడు కట్టంరెడ్డి అనంత రూపేశ్‌ తెలిపారు. రోడ్డు ప్రమాద మృతులకు ఇది అనువైన విధానమని పేర్కొన్నారు. ‘సాధారణ శవపరీక్ష నివేదికలకు, డిజిటల్‌ అటాప్సీ నివేదికలకు వ్యత్యాసం లేదు. సెక్షన్‌ 65ఏ, 65బీ ఆఫ్‌ ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ ప్రకారం న్యాయస్థానాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వర్చువల్‌ అటాప్సీలో పారదర్శకత ఉంటుంది. ఎన్నేళ్లయినా ఫిల్మ్‌లు చెడిపోకుండా భద్రంగా ఉంటాయి. కత్తిగాట్లు వద్దనుకునే వారి సంప్రదాయాలను కూడా గౌరవించినట్లవుతుంది’ అని వివరించారు.


అన్ని కేసులకూ సరిపోతుందా?

వర్చువల్‌ అటాప్సీ విధానం 80-90% అసహజ మరణ కేసులకు అనుకూలం కాగా, కొన్నింటికి సంప్రదాయ (కత్తిగాటు) శవపరీక్ష తప్పదు. విషప్రయోగం జరిగిన కేసుల్లో కారణాలు తేల్చాలంటే పొట్టభాగంలో కత్తిగాట్లు తప్పనిసరి. మరికొన్ని కేసుల్లో అనుమానిత శరీర భాగంలోని కణజాలాన్ని సేకరించి, మైక్రోస్కోపిక్‌ అబ్జర్వేషన్‌ (హిస్టో పాథాలజీ పరీక్ష) ద్వారా మరణ కారణాలు ధ్రువీకరించాలి. మలం, మూత్రం, ఫ్లూయిడ్స్‌ పరీక్షలు చేయాల్సిన కేసుల్లో వాటి నమూనాలు సేకరించేందుకు ఆయా భాగాల్లో కత్తిగాట్లు తప్పవు. ప్రత్యేక సందర్భాల్లో ఇమేజెస్‌ ద్వారా సీనియర్‌ వైద్య నిపుణుల అభిప్రాయాలను స్థానిక వైద్యులు తెలుసుకోవడానికి దీంతో వీలుందని విజయవాడ జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ విభాగం డాక్టర్‌ మహేశ్‌ తెలిపారు. ఈ విధానంలో ఇమేజింగ్‌ టెక్నాలజీ సాయంతో మృతదేహంలోని అన్ని భాగాలను నిశితంగా పరిశీలించి, మరణ కారణాన్ని (కాజ్‌ ఆఫ్‌ డెత్‌) ధ్రువీకరిస్తారని వివరించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని