AP High Court: క్రిమినల్‌ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు

క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా(రెన్యువల్‌) పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

Updated : 23 Mar 2023 08:41 IST

ఈనాడు, అమరావతి: క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా(రెన్యువల్‌) పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. విచారణ కోర్టు ఇచ్చిన ఎన్‌వోసీ/అనుమతి ఉత్తర్వులను సమర్పించాకే పిటిషనర్ల పాస్‌పోర్టును పునరుద్ధరించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది. మరోవైపు న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కోర్టులో క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలని విచారణ కోర్టులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలంటూ పాస్‌ పోర్టులను రెన్యువల్‌ చేయక పోవడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్టు మొదటిసారి జారీచేసే సమయంలోనే క్రిమినల్‌ కేసులను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప రెన్యువల్‌ విషయంలో కాదన్నారు. పాస్‌పోర్టు అధికారుల తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పాస్‌పోర్టు చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉంటే పునరుద్ధరణను తిరస్కరించవచ్చన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అభ్యంతరం లేదని కోర్టు నుంచి ఎన్‌వోసీ తెస్తే పునరుద్ధరణను పరిశీలిస్తారన్నారు. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే పాస్‌పోర్టు రెన్యువల్‌ తిరస్కరణకు గురికాకుండా మినహాయింపు ఉందని తెలిపారు. పాస్‌పోర్టు మొదటిసారి జారీ విషయంలో ఉన్న నిబంధనలే రెన్యువల్‌ విషయంలోనూ ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు