YSRCP: పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated : 20 May 2024 06:14 IST

డబ్బుల కోసం గొడవపడ్డవారిని తీసుకొచ్చి.. హత్యాయత్నం కేసులో ఇరికించారంటున్న బాధితులు

విలేకర్లతో మాట్లాడుతున్న బాధిత కుటుంబసభ్యులు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల కోసం గొడవపడ్డవారిని తీసుకొచ్చి ఈ కేసులో ఇరికించినట్లు బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ‘తిరుమల బాలాజీనగర్‌కు చెందిన ఎ.సుధాకర్‌రెడ్డి, పి.హరికృష్ణ, పసుపులేటి రాము, గోగుల కోటయ్య.. ఈ నెల 10న తిరుమలకు చెందిన శ్రీనివాసులు నుంచి రావాల్సిన డబ్బు కోసం గొడవపడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. ఈ కేసులో రాజీ చేసుకోవాలంటూ తిరుమల టూటౌన్‌ సీఐ సత్యనారాయణ ఈ నెల 15న నలుగురిని స్టేషన్‌కు పిలిపించారు. విచారించి పంపిస్తామని చెప్పి, మర్నాటి ఉదయం పులివర్తి నాని హత్యాయత్నం కేసులో నిందితులుగా తిరుపతి కోర్టులో ప్రవేశపెట్టారు. నానిపై దాడిచేసిన పి.సుధాకర్‌రెడ్డి కనిపించలేదని.. అదే పేరున్న ఎ.సుధాకర్‌రెడ్డితో పాటు మిగిలిన వారిని ఈ కేసులో ఇరికించారు’ అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిట్‌ అధికారులను కలవడానికి ఎ.సుధాకర్‌రెడ్డి భార్య మహేశ్వరి, హరికృష్ణ తల్లి భువనేశ్వరి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్దకు వచ్చారు. అయితే వారిని కలిసేందుకు పోలీసులు అవకాశం ఇవ్వకపోవడంతో విలేకర్లతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు