CEO Mukesh kumar meena: పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 23 May 2024 07:29 IST

ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలినచర్యగా పేర్కొన్న ఈసీఐ
తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు, అమరావతి: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన సెక్షన్ల ప్రకారం ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈ ఘటనలను వైఫల్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అభ్యర్థే ఈవీఎంను పగలగొట్టడంపై ఈసీ సీరియస్‌ అయింది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని మంగళవారం రాత్రే ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ చేశారా లేదా అని అడిగింది. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లి అరెస్టు కోసం మంగళవారం నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిని పోలీసులు సోదా చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో లేరు. ఈవీఎం ధ్వంసం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు పోలింగ్‌ జరిగిన మరుసటి రోజే అందించాం. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో సిట్‌ వచ్చింది. ఈ నెల 20న కోర్టులో రెంటచింతల ఎస్సై మెమో దాఖలు చేశారు. ఇందులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మొదట గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత 20న కోర్టులో 10సెక్షన్లతో మెమో సమర్పించారు. పిన్నెల్లి పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో నెల 21న బయటకు వచ్చింది. దీనికి ముందే కోర్టులో మెమో సమర్పించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి’ అని వెల్లడించారు.

సిట్‌ నివేదికను ఈసీకి పంపించాం.. 

‘ఈవీఎం ధ్వంసం, అల్లర్లు, దాడులపై సిట్‌ ప్రాథమిక విచారణ నివేదికను ఈసీకి పంపించాం. దీని ఆధారంగా ఈసీ ఏం ఆదేశాలిస్తుందోనని ఎదురుచూస్తున్నాం. సరైన సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎంత కఠినంగా చర్యలు ఉంటాయనడానికి నమూనాగా ఉండాలని ఈసీ పేర్కొంది. మాచర్ల నియోజకవర్గంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందనే సమాచారం ఉండడంతో సీసీ కెమెరాలతో వందశాతం వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాం. దీంతో గొడవలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. విచారణ కొనసాగుతోంది. పోలింగ్‌ రోజున గొడవల తరవాత  పోలింగ్‌ కొనసాగించవచ్చా? ఈవీఎంను ఎవరు పగలగొట్టారు? అనే అంశాలను ఎన్నికల సంఘం పరిశీలించింది. బెల్‌ ఇంజినీర్‌ వచ్చి ఈవీఎంను పరిశీలించి, డేటా భద్రంగా ఉందని చెప్పడంతో పోలింగ్‌ను కొనసాగించాం. చర్యల కోసం సీసీ ఫుటేజీని పోలీసులకు అందించారు. ఎన్నికల సంఘం ఎవ్వరినీ వదలదు. రెండేళ్లకుపైబడి శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 20 కంపెనీల బలగాలను అదనంగా ఇచ్చింది. అల్లర్లు జరిగేందుకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఇప్పటికే పోలీసులు గుర్తించారు. పికెట్లు ఏర్పాటు చేశారు’ అని మీనా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని