Indosol Solar: ఇండోసోల్‌పై ఎందుకంత ప్రేమ?

‘పావలా కోడికి.. ముప్పావలా మసాలా’ అనే సామెత షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Updated : 27 May 2024 07:01 IST

సంస్థ పెట్టుబడి రూ.25 వేల కోట్లు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు రూ.50 వేల కోట్లు
భవిష్యత్తు అవసరాల్ని తీర్చేందుకూ అంగీకారం
పీఎల్‌ఐ కింద కేంద్రం నుంచీ రాయితీలు పొందనున్న సంస్థ
ఈనాడు - అమరావతి

‘పావలా కోడికి.. ముప్పావలా మసాలా’ అనే సామెత షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకూ ఇవ్వని విధంగా ఇండోసోల్‌పై ప్రోత్సాహకాల్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర రూ.25 వేల కోట్ల పెట్టుబడితో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమను ఇండోసోల్‌ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీనికి భారీ మొత్తంలో ప్రోత్సాహకాల్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. విద్యుత్‌.. రిజిస్ట్రేషన్‌ ఫీజులు.. గనుల లీజులు.. చిన్న నీటి చెరువులు.. ఇలా అవకాశం ఉన్నంత మేర ఇండోసోల్‌కు కట్టబెట్టింది. భౌతిక, ఆర్థిక ప్రోత్సాహకాలు రూ.50 వేల కోట్ల వరకు ఉంటాయని పారిశ్రామిక వర్గాల అంచనా. ఇదే సంస్థ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం కింద.. విక్రయించిన ప్యానళ్ల ఆధారంగా కేంద్రం నుంచీ రాయితీలు పొందనుంది.

అంత తొందరెందుకో? 

ఇండోసోల్‌ సంస్థ డీపీఆర్‌ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అనుమతించిన 5,148 ఎకరాల కేటాయింపుతో పాటు.. అదనంగా 3,200 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూములను కాస్ట్‌ బేసిస్‌ విధానంలో సేకరించి అప్పగించాలని ఏపీఐఐసీని ఆదేశించింది. లీజు ప్రాతిపదికన భూములను కేటాయించే విధానాన్ని సవరించి.. ఔట్‌రైట్‌ సేల్స్‌(ఓఆర్‌ఎస్‌) విధానంలో నేరుగా రిజిస్ట్రేషన్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు 2,959.61 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 407 ఎకరాలకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారాన్ని చెల్లించి... ఆ భూములను ఏపీ మ్యారిటైం బోర్డుకు రెవెన్యూ శాఖ అప్పగించింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 8,348 ఎకరాల్లో.. 4.87 శాతం భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూసేకరణ పూర్తయ్యాక.. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇండోసోల్‌ మాత్రం భూ సేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో ఒక షెడ్డు ఏర్పాటు చేసి.. 500 గిగావాట్ల ప్యానళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావుడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల తర్వాతి పరిణామాల దృష్ట్యా ఇలా చేస్తోందా? అనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

ఆర్థిక ప్రోత్సాహకాలు..

ఒక పరిశ్రమ ఏర్పాటుకు ముందే ప్రోత్సాహకాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. అందుకు అంగీకరించాక ఒప్పందం కుదురుతుంది. ఇండోసోల్‌కు మాత్రం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరమైనా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పడం గమనార్హం. ఆ సంస్థకు విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, మైనింగ్‌ సంబంధిత మినహాయింపులు.. ప్రాజెక్టు ఏర్పాటుకు మద్దతు, ఫిజికల్‌ ఇన్సెంటివ్స్‌ ఇచ్చేందుకూ అంగీకరించింది.

  • ఇండోసోల్‌కు రాబోయే 15 ఏళ్ల పాటు రాయితీపై విద్యుత్‌ ఇచ్చేలా నిర్ణయించింది. ఉత్పత్తిలోకి వచ్చిన మొదటి ఏడేళ్ల పాటు యూనిట్‌ రూ.4 చొప్పున, తర్వాత ఎనిమిదేళ్లు రూ.4.5 చొప్పున వినియోగించిన విద్యుత్‌కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్‌ ప్రకారం యూనిట్‌కు సగటును రూ.12 చొప్పున లెక్కిస్తే.. ఇండోసోల్‌ సంస్థ వినియోగించబోయే విద్యుత్‌కు సుమారు రూ.47,809 కోట్ల రాయితీని భరించాల్సి వస్తుంది.
  • ఇండోసోల్‌కు విద్యుత్‌ సరఫరా చేసేందుకు 220 కె.వి. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు రూ.70 కోట్లు, 30 కి.మీ. లైన్ల ఏర్పాటుకు రూ.30 కోట్ల భారాన్ని ఇండోసోల్‌పై వేయకుండా ట్రాన్స్‌కో భరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డిస్కం నుంచి విద్యుత్‌ సరఫరా పొందడానికి డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌లు, ఇతర పర్యవేక్షక ఛార్జీలకూ మినహాయింపు ఇచ్చింది. 
  • పరిశ్రమల కోసం సేకరించిన భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని మినహాయించడం వల్ల రూ.90 కోట్లు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రూ.4.5 కోట్లు సంస్థకు లబ్ధి చేకూరుతుంది. పరిశ్రమ కోసం సేకరించే భూముల విలువ రిజిస్ట్రేషన్‌ శాఖ నిబంధన ప్రకారం సుమారు రూ.1,200 కోట్లు అవుతుందని అంచనా. దీనిపై చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ 7.5 శాతాన్ని ప్రభుత్వం మినహాయించింది.
  • ఆ భూములను ఎస్పీవీలు/అనుబంధ యూనిట్లకు భూములను బదిలీ చేసే సమయంలో చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయించడంతో మరో రూ.100 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా. 
  • కేటాయించిన భూములకు ల్యాండ్‌ కన్వర్షన్‌ ఛార్జీలు(నాలా), బిడ్డింగ్‌ పర్మిషన్, ప్రాసెసింగ్‌ ఛార్జీలు, సైట్‌ జోనింగ్‌ ఛార్జీలు, ప్రాపర్టీ/మున్సిపల్‌/పంచాయతీ పన్నులు, అభివృద్ధి ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరో రూ.100 కోట్లు  ప్రయోజనం పొందుతుంది.
  • భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, రోడ్‌ మెటల్, రఫ్‌ స్టోన్, బౌల్డర్స్, ఇతర చిన్న ఖనిజాలకు రాయల్టీ/సీనరేజి రుసుము మినహాయింపు వల్ల కనీసం రూ.50 కోట్ల లబ్ధి ఉంటుందని అంచనా.

గనులు కట్టబెట్టేశారు

సంస్థకు అవసరమైన క్వార్ట్జ్‌ గనులను కట్టబెట్టడానికి వీలుగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మైనింగ్‌ లీజు, తవ్వకాలకు సంబంధించి ప్రీమియం ఎమౌంట్, సీనరేజి ఫీజు, జిలా ఖనిజ నిధి, కన్సిడరేషన్‌ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా, మిగిలిన 8 లీజులు ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలో 157.75 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 119.1 ఎకరాల్లో కలిపి ఆరు లీజుల కేటాయింపునకు గనుల శాఖ ఎన్‌వోసీ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ శాఖ ఇచ్చే రాయల్టీ, ఇతర ఫీజుల మినహాయింపుల ద్వారా పొందే లబ్ధి అదనం.


చెరువుల్నీ రాసిచ్చేస్తారా?

కనిగిరి జలాశయం/సంగం బ్యారేజి/సోమశిల నుంచి 115 ఎంఎల్‌డీల నీటిని పరిశ్రమ కోసం అందించాలని పేర్కొంటూనే.. దీనికి సమీపంలో ఉన్న (రావూరు చెరువు, చేవూరు మినీ ట్యాంకు, చెన్నాయపాలెం చెరువు) చెరువుల్లో నీటిని నిల్వ చేసుకోవడానికి, ప్రాజెక్టు నీటి నిల్వ అవసరాలు తీర్చడానికి కేటాయించే అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న మూడు చెరువులను ఇండోసోల్‌ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలొస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని