Jawahar Reddy: ఓడింది జగన్‌రెడ్డే కాదు.. జవహర్‌రెడ్డి కూడా..!

ఈ ఎన్నికల్లో వైకాపాకు ఎదురైన ఘోర పరాభవం కేవలం జగన్‌దే అనుకుంటే పొరపాటు! ఆయన సహచరుడు.. కాదు కాదు.. ఆయనకు పూర్తిస్థాయి అనుచరుడిగా మారిపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిది కూడా!

Updated : 05 Jun 2024 09:49 IST

ఈనాడు, అమరావతి: ఈ ఎన్నికల్లో వైకాపాకు ఎదురైన ఘోర పరాభవం కేవలం జగన్‌దే అనుకుంటే పొరపాటు! ఆయన సహచరుడు.. కాదు కాదు.. ఆయనకు పూర్తిస్థాయి అనుచరుడిగా మారిపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిది కూడా! రాష్ట్ర చరిత్రలోనే ఇంతగా వివాదాస్పదమైన, ఆరోపణలకుగురైన, అధికార పార్టీతో అంటకాగిన అధికారి మరొకరు లేరు. మొత్తం అధికార యంత్రాంగానికి సారథినని మర్చిపోయి.. జగన్‌కు ఆంతరంగికుడిగా మారిపోయిన జవహర్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే! ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా ఆయన తీరు మారలేదు. ఈ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులుగా ఏరికోరి వైకాపాకు అనుకూలంగా ఉండే సబ్‌కలెక్టర్లను నియమించడం మొదలు.. అధికారుల నియామకాలు, బదిలీలు వంటివన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే చేశారు. ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్లను వినియోగించవద్దని ఎన్నికల సంఘం చెబితే..లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడాన్ని నిలిపేసి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసేందుకు సీఎస్‌ ప్రయత్నించారు.

పండుటాకుల్లాంటి వృద్ధులను మండుటెండల్లో ఊరేగిస్తూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తే ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మరుసటి నెలలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి స్వస్తిచెప్పి..వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పించారు. ముందు వచ్చిన వారికి ముందు అనే విధానాన్ని తుంగలో తొక్కి వైకాపా అనుకూల గుత్తేదారులకు మొదట బిల్లులు చెల్లించడంలో కీలకంగా వ్యవహరించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ కక్షసాధింపునకు.. సీఎస్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాల్సిందిగా కోర్టు చెప్పినా పెడచెవిన పెట్టారు. ఎన్నికల వేళ కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలుగా వైకాపా అనుకూల అధికారులను నియమించడం, ఈసీ జోక్యం చేసుకుని వారిని తొలగించాక కూడా... మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లే ఈసీకి పంపడం వంటి చర్యలకు పాల్పడ్డారు. విశాఖ చుట్టుపక్కల ఎసైన్డ్‌ భూముల వ్యవహారంలో వ్యక్తిగతంగాను ఆయన ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఐదేళ్లూ అరాచక పాలనతో ప్రజల్ని పీడించుకు తిన్న జగన్‌ కథ ఇప్పుడు ముగిసింది. ఆంతరంగికుడిగా ఆయన అడుగులకు మడుగులొత్తిన జవహర్‌రెడ్డి కథ కూడా మరికొన్ని గంటల్లో ముగియబోతోంది..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని