Andhra Pradesh News: డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం

రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై 40 రోజులు పూర్తయినా ఇంత వరకు షెడ్యూల్‌ ఇవ్వలేదు.

Published : 24 May 2024 04:05 IST

ఇంటర్‌ ఫలితాలు విడుదలై 40 రోజులు
కౌన్సెలింగ్‌పై రాని స్పష్టత

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై 40 రోజులు పూర్తయినా ఇంత వరకు షెడ్యూల్‌ ఇవ్వలేదు. పక్కనున్న తెలంగాణలో డిగ్రీ మూడు విడతల ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల చేసి, మొదటి విడత ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో ఇంకా ప్రైవేటు కళాశాలలకు అనుబంధ గుర్తింపు, అనుమతుల పొడిగింపు ప్రక్రియనే పూర్తి చేయలేదు. మరోవైపు కొత్త కళాశాలల ఏర్పాటుకు 53 యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇంతవరకు ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. వీటికి 2024-25 సంవత్సరంలోనే ప్రవేశాలు కల్పిస్తామని నోటిఫికేషన్‌లో ఉన్నత విద్యామండలి ప్రకటించడం గమనార్హం. ప్రైవేటు కళాశాలలు విశ్వవిద్యాలయాల నుంచి ఏటా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ఇది పూర్తి అయితేనే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కళాశాలల జాబితా వస్తుంది.

సగం సీట్లే నిండుతున్నాయి..

డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలు, కోర్సులకు వెళ్లిపోతున్నారని యాజమాన్యాలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిగ్రీ కన్వీనర్‌ కోటాలో 3.19 లక్షలకుపైగా సీట్లు ఉండగా.. గత ఏడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఉన్న వాటిల్లోనే సీట్లు భర్తీ కాకపోయినా అయిన వారి కోసం కొత్త కళాశాలలకు నోటిఫికేషన్‌ ఇచ్చారనే విమర్శలున్నాయి. వైకాపా ప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్‌ కమిటీ నిర్దిష్ట ప్రమాణాలు పాటించని 500 డిగ్రీ కళాశాలలను మూసివేయొచ్చని సూచించింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. శాసనసభ నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో భాగంగా అనేక కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో కొన్ని గత ఏడాదే ప్రవేశాలు పొందగా.. మరికొన్ని ఈ ఏడాది ప్రవేశాలు పొందనున్నాయి. ఒకపక్క కళాశాలలు, సీట్లను పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం.. డిగ్రీ విద్యలో నాణ్యతను పట్టించుకోవడం లేదు. 

బీసీఏ, బీబీఏ కోర్సులపై సందిగ్ధత

రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో బీసీఏ, బీబీఏ, బీఎంఎస్‌ కోర్సులు ఉన్నాయి. గతంలో వీటికి యూజీసీ నుంచి అనుమతులు తీసుకోగా.. ఇప్పుడు వీటిని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి తీసుకొచ్చారు. ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. దీనిపై యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దిల్లీ హైకోర్టు ఈ కేసును జూన్‌ 20కి వాయిదా వేసింది. ఈ సారి కౌన్సెలింగ్‌లో ఈ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారా లేదా అనేదానిపై ఉన్నత విద్యామండలి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని