JEE Advanced Exam: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-2 కఠినమే

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మధ్యస్తం నుంచి కఠినంగా ఉందని, పేపర్‌-1 కంటే పేపర్‌-2 మరికొంత కఠినంగా ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

Updated : 27 May 2024 08:30 IST

నాలుగో ఏడాదీ 360 మార్కులకు పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మధ్యస్తం నుంచి కఠినంగా ఉందని, పేపర్‌-1 కంటే పేపర్‌-2 మరికొంత కఠినంగా ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒక్కో పేపర్‌లో మూడు సబ్జెక్టులు కలిపి నాలుగు సెక్షన్లలో మొత్తం 51 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు 17 ప్రశ్నలు కేటాయించారు. పేపర్‌-1లో రసాయనశాస్త్రం ప్రశ్నలు కొంత ఇబ్బంది పెట్టాయని, జేఈఈ మెయిన్స్‌లో లేని సిలబస్‌ అడ్వాన్స్‌డ్‌లో ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. గణితం, భౌతికశాస్త్రంలో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని శ్రీచైతన్య ఐఐటీ జాతీయ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్‌ చెప్పారు. గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కుల 360కు 86 ఉండగా.. ఈసారీ అలానే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కటాఫ్‌పై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంత మంది పరీక్ష రాశారన్నది ఐఐటీ మద్రాస్‌ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనా. ప్రశ్నపత్రం మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుందనేది విద్యార్థులకు ముందుగా తెలియదు. ఒక్కో సబ్జెక్టులో ఎన్ని సెక్షన్లు ఉంటాయి... ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ఏ సెక్షన్‌కు రుణాత్మక మార్కులు ఉంటాయి? తదితర వివరాలు కూడా వారికి తెలియదు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రత్యేకత ఇదే. కాకపోతే గత మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా రెండు పేపర్లకు కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష జరపడం విశేషం. దీన్ని ఐఐటీలు నిర్ణయించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా జూన్‌ 2న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి, 9న ర్యాంకులు వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని