Andhra Pradesh: ఏపీలో జూన్‌లోనూ పింఛనుదార్లకు తిప్పలే!

వచ్చే నెలలోనూ రాష్ట్రంలో సామాజిక పింఛను లబ్ధిదారులకు అవస్థలు తప్పేలా లేవు. జూన్‌ 1న 47.74 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో సామాజిక భద్రత పింఛన్ల నగదును జమ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు.

Published : 30 May 2024 04:19 IST

47.74 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లోనే పింఛను నగదు జమ 
17.56 లక్షల మందికి ఇంటి వద్ద ఇస్తామన్న ప్రభుత్వం 

ఈనాడు, అమరావతి: వచ్చే నెలలోనూ రాష్ట్రంలో సామాజిక పింఛను లబ్ధిదారులకు అవస్థలు తప్పేలా లేవు. జూన్‌ 1న 47.74 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో సామాజిక భద్రత పింఛన్ల నగదును జమ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు. మిగతా 17.56 లక్షల మందికి ఇళ్ల దగ్గరే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా అందిస్తామని వెల్లడించారు. ఇళ్ల వద్ద పంపిణీ చేసేవారికి సంబంధించిన నగదును ఈ నెల 31న బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విత్‌డ్రా చేసి జూన్‌ 1 నుంచి 5వ తేదీలోపు పంపిణీ చేస్తారని చెప్పారు. మే 1న బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాని 74,399 మందికి, 80 ఏళ్లు పైబడిన 35,576 మంది వృద్ధులకు జూన్‌ 1న ఇళ్ల వద్దనే పింఛను అందిస్తామని తెలిపారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సరిపడా ఉద్యోగులున్నా.. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏప్రిల్‌ నెలలో పింఛనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాలకు రప్పించి అక్కడ పింఛను డబ్బు అందజేసింది. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి, మరింత ముప్పుతిప్పలు పెట్టింది. ఏ బ్యాంకులో నగదు జమైందో తెలుసుకునేందుకు సచివాలయాలకు, అక్కడి నుంచి మళ్లీ బ్యాంకులకు వెళ్లి మండుటెండల్లో గంటల తరబడి పడిగాపులు కాసేలా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పటికీ తన ధోరణిని మార్చుకోకుండా జూన్‌లోనూ మెజారిటీ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని