Andhra Pradesh: రూ.100 కోట్ల విలువైన మాన్సాస్‌ భూమిపై కన్ను

విజయనగరం పరిధిలోని దాదాపు రూ.100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి.. దాన్ని అధికారపార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు చూస్తున్నారు.

Updated : 29 May 2024 08:17 IST

నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అర్జీ
రెండేళ్ల క్రితం తిరస్కరించిన దేవాదాయ కమిషనర్‌
అయినా ఆ శాఖ మంత్రి వద్ద ఫిబ్రవరిలో అప్పీలు
ఎలాగైనా ఎన్వోసీ ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు
తెరవెనుక కీలక అమాత్యుడి సహకారం?

ఈనాడు, అమరావతి: విజయనగరం పరిధిలోని దాదాపు రూ.100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి.. దాన్ని అధికారపార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. ఆ భూమి దేవాదాయశాఖ పరిధిలోనిదని గతంలో స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా దస్త్రాన్ని కదుపుతున్నారు. దీనివెనుక ఆ శాఖ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలకమంత్రి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. మాన్సాస్‌ ట్రస్టుకు విజయనగరం పరిధిలోని ధర్మపురిలో సర్వే నంబరు 75/1 నుంచి 46 వరకు.. 212 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలోనివి. ఇందులో 8.96 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజయనగరానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ సంస్థ వసంత్‌ విహార్‌ యజమాని వి.జయప్రకాశ్‌బాబు తొలుత 2021లో దేవాదాయశాఖకు అర్జీ పెట్టుకున్నారు. అక్కడ ఎకరా రూ.10 కోట్లపైనే ఉంది. అప్పట్లో రికార్డులు పరిశీలించిన అధికారులు.. ఇవి మాన్సాస్‌ ట్రస్టు భూములని, నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎన్వోసీ జారీచేయడం కుదరదని 2022 సెప్టెంబరులో పేర్కొన్నారు. ఎన్వోసీ కావాలంటే దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని, దానికే నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఆదేశాల్లో తెలిపారు.

మంత్రిని కలిసి.. దస్త్రం నడిపారు 

కానీ, సదరు అర్జీదారుడు దేవాదాయశాఖ మంత్రి వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పీలు దాఖలుచేశారు. నిజానికి మంత్రి ఆ అప్పీలును తిరస్కరించాలి. కానీ ఆయన అప్పీలును పరిగణనలోకి తీసుకొని, తగిన నిర్ణయం తీసుకోవాలని మళ్లీ అధికారులను ఆదేశించారు. దీంతో దస్త్రం వేగంగా కదులుతోంది. అంతా కలిసి ఎలాగైనా ఎన్వోసీ ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ ఉన్నా.. ఈ దస్త్రం మాత్రం పరుగులు పెడుతోంది. దేవాదాయశాఖలోని ఓ కీలక అధికారి సైతం దీనిపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిసింది.


ధర్మపురి భూముల నేపథ్యమిది..

మాన్సాస్‌ ట్రస్టును తన తండ్రి జ్ఞాపకార్థం పీవీజీ రాజు ఏర్పాటుచేశారు. ఈ ట్రస్టు కింద అనేక విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. పీవీజీ రాజు, ఆయన సోదరుడు పూసపాటి విశ్వేశ్వర గజపతిరాజు, తదితరుల మధ్య ఆస్తి వివాదాలపై కోర్టు కేసులు ఉండగా, తర్వాత రాజీ ఒప్పందానికి వచ్చారు. ఇందులో భాగంగా ధర్మపురి ప్రాంతంలో విశ్వేశ్వర గజపతిరాజు వాటా కింద వచ్చిన భూములను పీవీజీ రాజుకు ఇచ్చి, మరోచోట భూములను ఆయన తీసుకున్నారు. తర్వాత మాన్సాస్‌ ట్రస్టు కిందకు ఈ భూములు వెళ్లాయి. ఈ ట్రస్టు 1987లో దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. దీంతో ధర్మపురిలోని మాన్సాస్‌ భూములు దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్నట్లు అయింది. అయితే చాలాకాలంగా ఆ భూములను సాగుచేసుకుంటున్న కొందరు రైతుల పేరిట కొన్నేళ్ల కిందట పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీకావడంపై.. దేవాదాయశాఖ అధికారులు 2015లో జాయింట్‌ కలెక్టర్‌ వద్ద అప్పీలు చేశారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ భూములన్నింటినీ దేవాదాయశాఖ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు