Ramoji Rao: అవిశ్రాంత యోధుడి మహాభినిష్క్రమణం

అక్షర సూరీడు అస్తమించాడు.. పాత్రికేయానికి నడక నేర్పిన మార్గదర్శి దివికేగారు.. నిత్యస్ఫూర్తిని నింపే తెలుగు తేజం సెలవు తీసుకుంది. తెలుగు తనానికి నిలువెత్తు రూపం నింగికేగింది. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన ఉషోదయం.. ఇక సెలవంటూ భువి నుంచి దివికి సాగింది.

Updated : 09 Jun 2024 08:53 IST

తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు ఇక లేరు
అనారోగ్యంతో ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున 4.50కి అస్తమయం
తరలివచ్చిన అభిమానులు... రాజకీయ, సినీ ప్రముఖులు
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం
వెంకయ్య, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, నిర్మలాసీతారామన్, భట్టి, చంద్రబాబు, పవన్‌ ఘన నివాళులు
నేటి ఉదయం ఫిల్మ్‌సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రెండురోజులు సంతాపదినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

పత్రిక అంటే సమాచార స్రవంతి కాదని... ప్రజాప్రయోజనాల తురుపు ముక్కని చాటిన పాత్రికేయ మహర్షి

వ్యాపారం అంటే కొనుగోళ్లు, అమ్మకాలు మాత్రమే కాదు... సామాజిక బాధ్యత ఉండాలని నమ్మి ఆచరించిన వాణిజ్య మేరునగం...

అనితరసాధ్యమైన సంకల్పంతో... రాతిగుట్టలను ప్రపంచం మెచ్చిన ఫిల్మ్‌సిటీగా చెక్కిన అపర విశ్వకర్మ

ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి.. అవినీతి, అరాచకాలపై పోరాటాలకు ఊపిరులూదిన ప్రజాబంధువు

అలరించే కళలోనూ ఆదర్శం ఉండాలని తపించి సామాజిక చైతన్యం ఉన్న చిత్రాలను సృజించిన సినీ స్రష్ట

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌.. ఈటీవీ ఛానళ్లు.... ప్రియా ఫుడ్స్‌... రంగమేదైనా ప్రత్యేక ముద్ర వేసి... కృషితో నాస్తి దుర్భిక్షం అని చాటిన నిత్యకృషీవలుడు... ధీరోదాత్తుడు

నిత్యం ఉషోదయంతో సత్యం నినదించాలని తపించిన తపస్వి... పనిచేస్తూనే ఒరిగిపోవాలనుకున్న యశస్వి... తెలుగు వెలుగులు పంచిన మహామనీషి రామోజీరావు...

భౌతికంగా మనందరినీ వదిలి... మహాభినిష్క్రమణం చెందారు..శనివారం... తనకిష్టమైన ఉషోదయ సమయాన... 4 గంటల 50 నిమిషాలకు... గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో  తుదిశ్వాస విడిచారు.


అస్తమించిన అక్షర సూరీడు

రామోజీరావు పార్థివదేహం వద్ద సతీమణి రమాదేవి, కోడళ్లు విజయేశ్వరి, శైలజా కిరణ్‌

క్షర సూరీడు అస్తమించాడు.. పాత్రికేయానికి నడక నేర్పిన మార్గదర్శి దివికేగారు.. నిత్యస్ఫూర్తిని నింపే తెలుగు తేజం సెలవు తీసుకుంది. తెలుగు తనానికి నిలువెత్తు రూపం నింగికేగింది. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన ఉషోదయం.. ఇక సెలవంటూ భువి నుంచి దివికి సాగింది. తెలుగు నేలపై వేలమంది పాత్రికేయులకు అవకాశం కల్పించి పత్రికా ప్రపంచంపై తనదైన ముద్రవేసిన అక్షర యోధుడు విశ్రమించాడు. నిత్య శ్రామికుడు.. అపజయం ఎరుగని ఆదర్శ మూర్తి.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ‘స్టార్‌’ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. 

‘ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం రామోజీరావు ఈ నెల 5న చేరారు. ఆ సమయంలో గుండె వైఫల్యంతోపాటు తక్కువ రక్తపోటు ఉంది. వెంటనే అత్యవసర విభాగానికి తరలించి వెంటిలేటర్, ఇంట్రా అయోటిక్‌ బెలూన్‌ పంప్‌తో లైఫ్‌ సపోర్టు అందించడంతో పాటు అత్యవసరంగా యాంజియోగ్రామ్‌ చేసి స్టంట్‌ వేశాం. నిపుణులైన కార్డియాలజిస్టులు, క్రిటికల్‌ కేర్‌ బృందం ఆధ్వర్యంలో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించి శనివారం తెల్లవారుజామున  4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు’ అని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. అనంతరం పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ప్రజల సందర్శన కోసం రామోజీ గ్రూపు కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఉంచారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ఏర్పాట్లు చేశారు.

తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

రామోజీ మరణ వార్త తెలుసుకొని రాజకీయ, సినీ, వ్యాపార ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి అనేక మంది ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తంచేశారు. ఫేస్‌బుక్, ఎక్స్‌.. ఇలా అనేక సోషల్‌ మీడియా వేదికల ద్వారా లక్షలమంది తమ నివాళులర్పించారు. తెలుగు నేల ఒక మహా యోధుడిని కోల్పోయిందని కొనియాడారు. రామోజీరావు మృతిపట్ల దేశ ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. విషయం తెలుసుకున్న వెంటనే రామోజీరావు కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌కు ఫోన్‌ చేసి సముదాయించారు. ఆయన మృతికి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఏర్పాట్ల కోసం అధికారులను ఆదేశించారు. రామోజీరావు మరణించారన్న సమాచారం తెలుసుకొని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్‌ విమానాశ్రయం చేరుకొని అక్కడినుంచి నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చారు. సతీమణి భువనేశ్వరితో కలిసి రామోజీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామోజీరావు సతీమణి రమాదేవి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినిధిగా.. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యేకంగా వచ్చారు. కుటుంబ సభ్యులు ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరిలను ఓదార్చారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భాజపా ఎంపీ జి.కిషన్‌రెడ్డిలు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, సిబ్బందితో పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు, అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు చివరి చూపు కోసం ఫిల్మ్‌సిటీ చేరుకొని నివాళులు అర్పించారు. తమకు బతుకు బాట చూపిన తమ అధినేత ఇక లేరని తెలుసుకొని రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, త్రిదండి చినజీయర్‌స్వామి, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల, మైహోమ్‌ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఎం.వి.రావు, పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్, ప్రముఖ దర్శకులు రాజమౌళి, కథా రచయిత విజయేంద్రప్రసాద్, సంగీత సందర్శకులు కీరవాణి, తెదేపా నాయకులు పరిటాల సునీత, గొట్టిపాటి రవికుమార్, పరిటాల శ్రీరామ్, సినీ దర్శకుడు శ్రీనువైట్ల, తెరాస ముఖ్యనేతలు హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్,ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, దానం నాగేందర్, టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ఎం.మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎంపీలుగా ఎన్నికైన రామ్మోహన్‌ నాయుడు, బీకే పార్థసారథి, పెమ్మసాని చంద్రశేఖర్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎం.భరత్, లావు కృష్ణదేవరాయలు, ఏపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గాలి భానుప్రకాశ్, వసంత కృష్ణప్రసాద్, కామినేని శ్రీనివాస్, రెడ్డిగారి మాధవీరెడ్డి దంపతులు, తెదేపా అధికార ప్రతినిధి జీవీరెడ్డి, నేతలు టీడీ జనార్దన్, కంభంపాటి రామ్మోహన్‌రావు, సీపీఎం ముఖ్యనేత పువ్వాడ నాగేశ్వర్‌రావు, సీపీఎం నాయకుడు వెంకట్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, బాజిరెడ్డి గోవర్ధన్, కోదండరెడ్డి, మాజీమంత్రి దేవినేని ఉమ, తెలంగాణ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, వి.హనుమంతరావు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ,  విశ్రాంత ఐపీఎస్‌లు ఏబీ వెంకటేశ్వరరావు, జేవీరాముడు, ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, జగపతిబాబు, నిర్మాత సురేష్‌బాబు, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, క్రిష్, బోయపాటి శ్రీనివాస్, గాయకురాలు సునీత, గేయ రచయిత చంద్రబోస్, సుచిత్ర,  నటులు కల్యాణ్‌రామ్, నరేష్, పవిత్రాలోకేష్, పరుచూరి గోపాలకృష్ణ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సాయికుమార్, శివాజీ, ఆది, గాయని ఉష, మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, నందమూరి రామకృష్ణ, బండ్ల గణేశ్, ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి, సీపీఎం నాయకులు మధు, వీరయ్య, ఆస్కీ ఛైర్మన్‌ పద్మనాభయ్య, ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి, ఐ.వెంకట్రావు, తెలంగాణ పెన్షనర్ల ఐకాస ఛైర్మన్‌ లక్ష్మయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రామోజీరావు పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మండలి బుద్ధప్రసాద్, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, పత్తిపాటి పుల్లారావు, యార్లగడ్డ వెంకట్రావ్, ఏలూరి సాంబశివరావు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, కొండ్రు మురళీ మోహన్, దూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఏపీ విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, రమేష్‌ హాస్పిటల్స్‌ ఎండీ రమేష్, స్వాతి ఎండీ వేమూరి బలరాం, విజయవాడ ఏరియా కస్టమ్స్‌ కమిషనర్‌ వెంకయ్య చౌదరి, ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావు, ఏపీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌జైన్, ఐఏఎస్‌ అధికారులు కాటమనేని భాస్కర్, చెరుకూరి శ్రీధర్, బి.సృజన తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.

రామోజీరావుకు నివాళిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. నేడు, రేపు(ఆది, సోమ) సంతాప దినాలుగా ప్రకటించింది. రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌.. నేడు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించింది.


కదలి వచ్చిన అభిమానం

స్వగ్రామం పెదపారుపూడి నుంచి చివరి చూపు చూసేందుకు అనేక మంది వచ్చారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినీదర్శకుడు రాఘవేంద్రరావు బోరున విలపించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ఉద్యోగులు, ఆయన సొంత గ్రామం ప్రజలు ఆయన మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. అన్నింటా తనకు వెన్నుదన్నుగా నిలిచిన రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. భద్రాచలంలోని మానవసేవ వృద్ధాశ్రమవాసులు రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. రూ.80 లక్షలతో ఆశ్రమానికి సకల హంగులతో శాశ్వత భవనం నిర్మించి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. గతంలో ఇరుకైన గదుల్లో రేకుల షెడ్డులో నడుస్తుండగా, తమ కష్టాలు చూసి చలించి పక్కా భవనం సమకూర్చారని కొనియాడారు.


స్థానికుల భావోద్వేగం

రామోజీరావు మరణవార్త ఉదయమే తెలుసుకున్న రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి రామోజీరావు మృతికి అశ్రునయనాలతో అంజలి ఘటించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం మండలాల మధ్య ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీకి రూపమిచ్చి.. ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఇక్కడికి తీసుకురావడంతో పాటు దేశవిదేశాల పర్యాటకులకు స్వర్గధామమైన సుందర ప్రదేశంగా ఫిల్మ్‌సిటీని తీర్చిదిద్దారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటుతో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి అండగా నిలిచారని.. గుర్తుచేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని