Ramoji Rao: పత్రికారంగంపై చెరగని సంతకం

ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేమిటి.. ‘ఈనాడు’ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు.

Updated : 09 Jun 2024 08:58 IST

‘ఈనాడు’కు దశ.. దిశ రామోజీ..
ఆరంభం నుంచీ కొత్త పుంతలే..
ప్రజల గొంతుకగా అలుపెరగని ప్రస్థానం
ఈనాడు - హైదరాబాద్‌

నాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేమిటి.. ‘ఈనాడు’ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు. దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూసే పరిస్థితులున్న 70వ దశకంలో.. సూర్యోదయం కాక ముందే ఇంటి గుమ్మం ముందు పత్రికను అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు. నాటి నుంచి నేటి వరకు ‘ఈనాడు’ వేసిన ప్రతి అడుగూ సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను ‘మీడియా మొఘల్‌’ అని కీర్తిస్తారు.

ఆరంభమే సంచలనం

‘సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్‌ బాయ్‌ వీధుల్లో కనిపించకూడదు’.. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. రాష్ట్రానికి ఓ మూలన.. మరే పత్రికా లేని ప్రదేశమైన విశాఖపట్నంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడిన తొలి అడుగు.. నేటికీ అనంతమై నిరంతరంగా, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. ప్రారంభించిన నాలుగేళ్లకే అప్పటి అగ్రగామి పత్రిక ఆంధ్రప్రభ సర్క్యులేషన్‌ను దాటేసింది ఈనాడు! దినపత్రికల పంపిణీ వ్యవస్థకు ‘ఈనాడు’ వేసిన బాటే మిగిలిన పత్రికలకు దారిచూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి చరమగీతం పాడింది ఈనాడే. అంతకుముందు పత్రికలకు పల్లెల్లో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను ఈనాడు చెరిపేసింది. గిరులు, ఝరులు దాటి అడవులు, మారుమూల పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రికా ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో ఐదారు వేల కాపీలతో ప్రారంభమై.. ఆ తర్వాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన దినపత్రికగా అగ్రస్థానానికి చేరింది. యాభయ్యో పడిలోనూ ‘అగ్ర మకుటాన్ని’ సగర్వంగా నిలబెట్టుకోవడం వెనుక.. రామోజీరావు కొన్ని దశాబ్దాలపాటు శ్రమించి వేసిన పునాది రాళ్లున్నాయి.

రాజకీయ శక్తిగానూ..

‘ఈనాడు’ అంటే కేవలం వార్తలే కాదు.. తెలుగువారి ఆత్మగౌరవ పతాకగా నిలిచింది. 1978-83 మధ్య నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన కాంగ్రెస్‌ అధిష్ఠానం ఐదేళ్లలో నలుగురు ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సమయంలో తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ‘ఈనాడు’ హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే ‘ఈనాడు’ అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే ఎన్టీఆర్‌ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ‘ఈనాడు’ అక్షర యుద్ధం చేసింది. 2003లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజి ఇచ్చింది. తర్వాత కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాల్నీ బహిర్గతం చేసింది. 2019లో జగన్‌ పాదయాత్రకూ ‘ఈనాడు’ కవరేజి ఇచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చాక జరిగిన అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తనవంతు కృషి చేసింది.

మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పేజీలు

మహిళల కోసం ప్రత్యేక పేజీ ఉండాలన్న ఉద్దేశంతో 1992 సెప్టెంబరు 24న ‘వసుంధర’ను ప్రారంభించింది ఈనాడు. ఆ తరువాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలూ మహిళా అనుబంధాల్ని ప్రారంభించాయి. 2002 జులై 17న ఈనాడు ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. తెలుగు పాఠకులకు వరంగా ఇంధ్ర ధనుస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీలు ప్రారంభమయ్యాయి. విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో ఏడు ప్రత్యేక పేజీలుగా ఇవ్వడం ఈనాడు సృష్టించిన వినూత్న సమాచార విప్లవం. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్‌బుజ్జీ పేజీలకు ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది. ఇతర పత్రికలకు స్ఫూర్తిగా నిలిచింది.

అక్షరాలే అస్త్రాలై..

‘ఈనాడు’ అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల ఆయుధంగా ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి. అభాగ్యులకు ఆర్థికసాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్నీ ముందుకు నడిపింది ఈనాడు. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిన ఉద్యమానికి ఊతమిచ్చింది. 1995లో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది. తుపానుల సమయంలో సంస్థ రిలీఫ్‌ ఫండ్‌ ప్రకటించడం, పాఠకులు కూడా బాధితులకు ఆపన్నహస్తం అందించేలా ప్రోత్సహించడం, ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా.. తుపాను బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో ‘ఈనాడు’ కీలక భూమిక పోషించింది.

సాంకేతికంగానూ..

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ఈనాడు ముందుంది. తెలుగు దినపత్రికలన్నింటికన్నా ముందే 1999లో ఈనాడు.నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠకులకు చేరువైంది. ఈటీవీ రూపంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ అడుగుపెట్టిన రామోజీరావు..  ‘ఈటీవీ2’ పేరుతో 24 గంటల వార్తా ప్రసారాలకూ శ్రీకారం చుట్టారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్లను ప్రారంభించారు. 2000 ఏప్రిల్‌లో ఈటీవీ బంగ్లా, మూడు నెలల్లోనే మరాఠీ ఛానళ్లు మొగ్గతొడిగాయి. మరో ఐదు నెలలకు ఈటీవీ కన్నడకస్తూరి పరిమళాలు వ్యాపించాయి. 2001 ఆగస్టు నుంచి ఈటీవీ ఉర్దూ ప్రసారాలూ మొదలయ్యాయి. 2002 జనవరిలో ఒకేరోజు ఆరు ఛానళ్లను ప్రారంభించి సంచలనం సృష్టించారు. డిజిటల్‌ రంగంలో ఈటీవీ భారత్‌ను ఆరంభించారు. ఈటీవీ విన్‌ ఓటీటీ యాప్‌ ద్వారా ఉత్కంఠ రేపే వెబ్‌సిరీస్‌లు, అనేక చిత్రరాజాలు అందిస్తున్నారు.


కార్మికుడితో స్విచ్‌ ఆన్‌..

హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడే స్విచ్‌ఆన్‌ చేసి ‘ఈనాడు’ను ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్తల రచన, ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని మొదటి నుంచీ ఈనాడు పాటించటంతో ప్రజా బాహుళ్యంలో విశేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ, స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా ‘ఈనాడు’ రూపాంతరం చెందింది. వ్యవసాయ వార్తలకు ప్రాధాన్యమిచ్చి ప్రచురించడంతో ‘ఈనాడు’ను రైతు పక్షపాతిగా ప్రజలు ఆదరించారు. డెయిలీ సీరియల్స్‌ను పత్రికలో ప్రచురించడం ప్రవేశపెట్టిందీ ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపట్టుగా మారడమే కాదు. ప్రజల అవసరాలకు విలేకరులే వెళ్లి వార్తా సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పిందీ ఈనాడు మాత్రమే. 


అవార్డులు

జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు, ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బి.డి.గోయెంకా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ వరించాయి. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా కూడా రామోజీరావు పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని