Andhra Pradesh: మేఘా.. మాయ!.. విద్యుత్తు కేబుళ్ల తరలింపునకు అక్టోబరులోనే అనుమతి

అమరావతి నుంచి సీఆర్‌డీఏ అనుమతులు లేకుండా భూగర్భ విద్యుత్తు కేబుళ్లను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి తరలించడంలో మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మాయాజాలం బయటపడింది.

Updated : 27 May 2024 08:54 IST

ఎన్నికల ఫలితాల ముంగిట రవాణా

అచ్యుతాపురం సెజ్‌లో నిర్మించబోయే 400 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రాంతంలో అమరావతి నుంచి తరలించిన విద్యుత్తు కేబుళ్ల బండిళ్లు

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం: అమరావతి నుంచి సీఆర్‌డీఏ అనుమతులు లేకుండా భూగర్భ విద్యుత్తు కేబుళ్లను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి తరలించడంలో మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మాయాజాలం బయటపడింది. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం నుంచి అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్‌) మేఘా సంస్థనిర్మించబోయే 400 కేవీ విద్యుత్తు ఉపకేంద్రానికి 220 కేవీ విద్యుత్తు కేబుళ్ల బండిళ్లను వారం రోజులుగా తరలిస్తున్నారు. ఇవి ఇక్కడికి చేరుకుంటున్నాయి.

ఈ కేబుళ్ల తరలింపునకు సంబంధించి గతేడాది అక్టోబరులోనే ట్రాన్స్‌కో నుంచి అనుమతులు తీసుకుని ఎన్నికల సమయంలో గుట్టుగా తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా సర్కారు కొలువుదీరిన తర్వాత అమరావతిలో పనులన్నీ నిలిచిపోయాయి. అక్కడ నుంచి నిర్మాణ సామగ్రిని ఒక్కొక్కటిగా తరలించేస్తున్నారు. అందులో భాగంగా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ కూడా    భూగర్భ విద్యుత్తు లైన్ల కోసం తెచ్చిన కేబుళ్లను అచ్యుతాపురం సెజ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. గతేడాది అక్టోబర్‌ 11న 35 బండిళ్లను (18.025 కి.మీ 220 కేవీ విద్యుత్తు కేబుళ్లు) తరలించే బాధ్యతను ఓ ట్రాన్స్‌పోర్టు ఏజెంట్కు అప్పగించింది. అయితే ఎన్నికలకు ఆరునెలల ముందు రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రిని తరలిస్తే స్థానికంగా ఓట్లకు వెళ్లేప్పుడు ఇబ్బందులు వస్తాయని ఆ ప్రక్రియను వాయిదా వేశారు.

ఎన్నికలు పూర్తికావడంతో ఇప్పుడు ఆ కేబుళ్లను తరలిస్తున్నారు. ట్రాన్స్‌కో నుంచి అనుమతులు తీసుకుని ఏడు నెలలపాటు ఆగిన మేఘా ఇంజినీరింగ్‌ సంస్థఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడకుండా ఆఘమేఘాల మీద కేబుళ్లను పట్టుకుపోవడం     అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం వస్తే రాజధాని పనులు మరలా జోరందుకోనున్నాయి. అవేవీ ఆలోచించకుండా సామగ్రిని తరలించడం వెనుక వైకాపా పెద్దలున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని