MLC Kavitha: కవిత అరెస్టు

సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది.

Updated : 16 Mar 2024 09:23 IST

దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం
మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ
రూ.100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ
అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలమే కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌ ప్రకటించారు. దిల్లీ నుంచి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటలపాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా.. ఆమె నివాసానికి భారాస శ్రేణులు పెద్దఎత్తున చేరుకొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీస్‌ జారీ చేస్తారా? లేక అరెస్ట్‌ చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్‌ వారెంట్‌ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5.20 గంటల సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు 14 పేజీల నివేదిక ఇచ్చారు. ఆమె నుంచి ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ సమాచారాన్ని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా ఇచ్చారు.

నిందితురాలి సోదరుడినని...

ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ‘సాయంత్రం 6 గంటల సమయంలో నిందితురాలి సోదరుడినని, లాయర్లమని చెబుతూ దాదాపు 20 మంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. మా విధులకు ఆటంకం కలిగించారు’ అని  పంచనామాలో పేర్కొన్నారు.

కేటీఆర్‌ వాగ్వాదం..

అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం ఆరు గంటల సమయంలో భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు వేసి ఉండటంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు. అప్పటికే పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో భారాస శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. తర్వాత వారిని లోనికి అనుమతించారు. ఈడీ అధికారులతో కవిత సోదరుడు కూడా అయిన కేటీఆర్‌ వాగ్వాదానికి దిగారు. ‘అరెస్ట్‌ చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్‌టేకింగ్‌ ఇచ్చి ఇప్పుడెలా అరెస్ట్‌ చేస్తారు? మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది’ అని ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియా మీనాకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాన్సిట్‌ వారంట్‌ లేకుండా దిల్లీ ఎలా తరలిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. కావాలనే శుక్రవారం వచ్చారని ఆక్షేపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి ఎందుకు రానివ్వరని ఈడీ అధికారులపై ఆయన మండిపడ్డారు. అనంతరం బయటికి వచ్చిన కేటీఆర్‌, హరీశ్‌రావు... కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించారు. కవితను తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెల్లుబికాయి. మెట్లు దిగి వస్తూ ఆమె తన కుమారుడిని హత్తుకున్నారు. భర్త అనిల్‌ ఆమెను ఓదార్చారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, కుటుంబసభ్యులు, పార్టీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్న అభిమానులకు చేయి ఊపుతూ కారులో వెళ్లిపోయారు.

సొంత కార్లోనే

కవితను దిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్‌ చేసుకున్నారు. కవితను అరెస్టు చేసి దిల్లీ తీసుకెళుతున్నామని, ఇందుకు సహకరించాలని బంజారాహిల్స్‌ పోలీసులకు ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు.

ఇంటి వద్ద ఉద్రిక్తత

అరెస్టు సందర్భంగా కవిత ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి 1.30 గంటల సమయంలోనే ఈడీ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నప్పటికీ చాలాసేపటి వరకూ ఈ విషయం బయటకు పొక్కలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత కార్యకర్తలు రావడం మొదలుపెట్టారు. అరెస్టయినట్లు టీవీలో ప్రసారం కాగానే భారాస నాయకులు ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌, కేకే తదితరులు వచ్చారు. అప్పటి వరకూ నలుగురైదుగురు పోలీసులు మాత్రమే అక్కడ విధుల్లో ఉన్నారు. కానీ కార్యకర్తలు పెరుగుతుండటం, వచ్చిన వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. దాంతో బంజారాహిల్స్‌ ఏసీపీ వెంకటరెడ్డి అక్కడకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో పోలీసులను, రోప్‌ పార్టీని పిలిపించారు. నేతలు ఒక్కొక్కరు వస్తుండటంతో కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. 7 గంటల సమయంలో డీసీపీ విజయ్‌కుమార్‌ కూడా వచ్చారు. కవితను అరెస్టు చేసి బయటకు తీసుకొస్తున్న సమయంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వాహనాలను ముందుకు కదలనీయకుండా చేయడంతో పోలీసులు అందర్నీ పక్కకు నెట్టేశారు. స్వల్పంగా లాఠీఛార్జి చేయడంతో చాలామంది కింద పడిపోయారు. చివరకు 7.30 గంటల ప్రాంతంలో కవితను అక్కడ నుంచి తరలించారు.
శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె భర్త అనిల్‌, పలువురు కార్యకర్తలు కూడా విమానాశ్రయానికి వెళ్లారు.

ఇదీ నేపథ్యం

దిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్‌ లాబీ తరఫున రూ.కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్‌ రామచంద్రపిళ్లై రిమాండ్‌ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్‌ గ్రూప్‌ ద్వారా రూ.100కోట్ల ముడుపులు ఆప్‌కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్‌ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది.

కోర్టులోనే తేల్చుకుంటాం: కవిత న్యాయవాదులు

కవితపై కఠిన చర్యలు తీసుకోమని స్వయంగా ఈడీనే న్యాయస్థానంలో అఫిడవిట్‌ ఇచ్చి, ఇప్పుడు అదే దాన్ని ఉల్లంఘించిందని కవిత న్యాయవాదులు చెబుతున్నారు. ఈడీ అధికారులు మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. అప్పట్లో సమన్లు వాయిదా వేస్తామని మాత్రమే చెప్పామని, అందులో అరెస్టు ప్రస్తావన లేదన్నది వారి వాదన. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని కవిత న్యాయవాదులు చెబుతున్నారు.


అణచివేతలను ఎదుర్కొంటాం: కవిత

భారాస శ్రేణులు మనోధైర్యంతో ఉండాలి. ఇలాంటి అణచివేతలను, దొంగ కేసులను, రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొంటాం. చట్టంపై నమ్మకం ఉంది.


కవిత కేసు విచారణ 19కి వాయిదా

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలుచేసిన కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈనెల 19కి వాయిదా పడింది. ఈమేరకు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కేసుతోపాటు ఇది కూడా లిస్ట్‌ అయింది. విచారణ ప్రారంభమైన వెంటనే కవిత తరఫున హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ విక్రమ్‌ చౌధరి వాదనలు ప్రారంభిస్తూ... విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది ఈనెల 19వ తేదీకి వాయిదా వేయగా.. న్యాయవాది 20వ తేదీకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఆయన పదేపదే అదే విజ్ఞప్తిచేయడంతో న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది తీవ్రంగా స్పందించారు. అలాగైతే మీకిచ్చిన మధ్యంతర ఉపశమనాలను ఉపసంహరిస్తామని హెచ్చరించారు. వాస్తవంగా ఈకేసు ఈనెల 13న రావాల్సి ఉందని, అయితే ఆరోజు మీరు (జస్టిస్‌ బేలా త్రివేది) ప్రత్యేక ధర్మాసనంలో ఉన్నందున అది విచారణకు రాలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈరోజు విచారిస్తే తేడా ఏమొస్తుందని న్యాయమూర్తి జస్టిస్‌ బేలా త్రివేది ప్రశ్నించగా... అందుకు న్యాయవాది బదులిస్తూ దీన్ని నాన్‌మిసిలేనియస్‌డేన (సుదీర్ఘ వాదనలు వినిపించే అవకాశం ఉన్న రోజున) లిస్ట్‌ చేశారని, అందువల్ల 20కి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీరాజు స్పందిస్తూ ఇలా వాయిదాలు కోరడం సరికాదన్నారు. విచారణకు పిలిచే ముందు పదిరోజుల సమయం ఇస్తామని ఇదివరకు చెప్పామని, పదేపదే వాయిదాలు కోరితే దాన్ని ఉపసంహరించుకుంటామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అలాగే వారికి ఎలాంటి ఉపశమనాలు లేవని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని