Death: తల్లడిల్లిన కన్న పేగు

తొమ్మిది నెలల పాటు తన కడుపులో పెరిగిన శిశువు మృతి చెందడాన్ని ఆ కన్నతల్లి తట్టుకోలేకపోయింది. ఆ వార్త విన్న వెంటనే అపస్మారక స్థితికి చేరుకుని వెంటనే తానూ కన్నుమూసింది.

Updated : 28 May 2024 07:00 IST

పురిటి బిడ్డ మరణ వార్త విని ఆసుపత్రిలోనే బాలింత కన్నుమూత

రమ్యప్రియ 

పాడేరు, పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: తొమ్మిది నెలల పాటు తన కడుపులో పెరిగిన శిశువు మృతి చెందడాన్ని ఆ కన్నతల్లి తట్టుకోలేకపోయింది. ఆ వార్త విన్న వెంటనే అపస్మారక స్థితికి చేరుకుని వెంటనే తానూ కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన రమ్యప్రియ (25) పెదబయలు మండలం గోమంగి సచివాలయ పరిధిలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణి అయిన ఆమెకు నెలలు నిండి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో సోమవారం వేకువజామున 4 గంటల సమయంలో కుటుంబసభ్యులు పాడేరు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో విధుల్లో ఉన్న నర్సులు శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీశారు. అప్పటికే ఆ శిశువు మృతి చెందింది. స్పృహ కోల్పోయిన రమ్యప్రియను వేరొక గదిలో ఉంచగా.. కొద్ది గంటలకు బిడ్డ మరణవార్త ఆమె చెవిలో పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌తో కేకలు వేసి కుప్పకూలి మృతి చెందారు. తాము రాగానే నర్సులు వైద్యులకు సమాచారం ఇచ్చారని, వారు వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బంధువులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని