Nimmagadda: రాష్ట్రాన్ని ఓటుతో నిలబెట్టిన ప్రజలు

రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి సార్వత్రిక ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా 82 శాతం పోలింగ్‌ నమోదుకావడం సాధారణ విషయం కాదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సెక్రటరీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 11 Jun 2024 04:55 IST

ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం విఫలం
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ

మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. వేదికపై సమరం, పి.వి.రమేశ్‌ తదితరులు

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, విజయవాడ సిటీ: రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి సార్వత్రిక ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా 82 శాతం పోలింగ్‌ నమోదుకావడం సాధారణ విషయం కాదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సెక్రటరీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేలా తమవంతు ప్రయత్నం చేసిన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ బృందానికి ఆత్మీయ అభినందన సభ విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం అగాథంలో పడిపోయిందని, దానిని తిరిగి ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలే పైకి తీసుకొచ్చారని అన్నారు. ‘ఓటర్లు గంటల తరబడి పోలింగ్‌ కేంద్రాల్లో వేచి ఉండేలా చేయడం ఎన్నికల సంఘం వైఫల్యమే. ఎన్నికలకు ముందు, తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు, ఆధారాలు బయటకొచ్చినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు.? పైగా.. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉండే రాయలసీమ, మాచర్ల ప్రాంతాల్లో భద్రతపై దృష్టిపెట్టలేదు. నిర్వహణ విషయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. జగన్‌ ప్రభుత్వం చెప్పిన దానికి ఆయన తల ఊపుతూ వచ్చారు. ఇప్పటికైనా జరిగిన లోటుపాట్లను పరిశీలించుకొని.. ఎక్కడ వైఫల్యం జరిగిందో తెలుసుకుని పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని రమేశ్‌కుమార్‌ సూచించారు.

 వైకాపాది బందిపోటు పాలన..

జగన్‌ హయాంలో బందిపోటు పాలన సాగిందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేశ్‌ మండిపడ్డారు. ప్రజలకు డబ్బులు పంచితే సరిపోతుందని, ఐదేళ్లూ ఓట్లు కొని ఎన్నికల్లో లాభపడొచ్చని భావించిన వైకాపాకు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ‘భూ ఆక్రమణలు, ఇసుక, గనులు సహా అన్నింటినీ ప్రైవేటు పరం చేశారు. 2019 నాటికి ప్రభుత్వానికి రాబడులు రూ.54 వేల కోట్లు వచ్చేది. ఈ ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రజల ఆదాయం పెంచేందుకు ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. ప్రభుత్వ ఆదాయం పెంచకపోగా.. ఖర్చులు భారీగా పెంచేశారు. అభివృద్ధికి అవసరమైన రహదారులు, నీటి ప్రాజెక్టులు ఆపేశారు. ఫలితంగా పూర్తిగా రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అప్పులు చేశారు. చాలా ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా అమ్మేశారు. తాకట్టు పెట్టేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.13 లక్షల కోట్ల వరకు ఉంది. విధ్వంసకర ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పారు. ఇప్పుడు దానంతటినీ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది’ అని పి.వి.రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘విధ్వంసం’ పుస్తక రచయిత ఆలపాటి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించిందని, అన్ని వ్యవస్థలనూ నాశనం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో జి.ఆర్‌.కె- పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, డాక్టర్‌ జి.సమరం, ఎం.సి.దాస్, జంధ్యాల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ‘ఈనాడు’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని