AP news: గనులశాఖ, ఏపీఎండీసీ కార్యాలయాలు సీజ్‌

గనులశాఖ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో గత నాలుగేళ్లుగా భారీ దోపిడీకి ద్వారాలు తెరిచి, ప్రభుత్వ పెద్దలకు అడ్డగోలు మేలు చేసిన.. గనులశాఖ సంచాలకుడు, ఏపీఎండీసీ ఇన్‌ఛార్జి ఎండీ విజీ వెంకటరెడ్డి బదిలీ కాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published : 09 Jun 2024 05:33 IST

సంచాలకుడు వెంకటరెడ్డి బదిలీకాగానే అప్రమత్తమైన ఏపీఎస్పీ
రాత్రివేళ రెండు కార్యాలయాలకు చేరుకొని తాళాలు
దస్త్రాలు, హార్డ్‌ కాపీలు మాయం చేయకుండా జాగ్రత్తలు

ఏపీఎండీసీ కార్యాలయం గేట్‌కు వేసిన తాళాలు

ఈనాడు-అమరావతి: గనులశాఖ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో గత నాలుగేళ్లుగా భారీ దోపిడీకి ద్వారాలు తెరిచి, ప్రభుత్వ పెద్దలకు అడ్డగోలు మేలు చేసిన.. గనులశాఖ సంచాలకుడు, ఏపీఎండీసీ ఇన్‌ఛార్జి ఎండీ విజీ వెంకటరెడ్డి బదిలీ కాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఇబ్రహీంపట్నంలోని గనులశాఖ సంచాలకుడి కార్యాలయం, తాడిగడప సమీపంలోని ఏపీఎండీసీ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొని సీజ్‌ చేశారు. లీజుల కేటాయింపుల్లో అక్రమాలు, వైకాపా ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలు దోపిడీకి అవకాశం కల్పించడం, ఇష్టానుసారం వివిధ ఖనిజాల్లో తవ్వకాలు, బీచ్‌  శాండ్‌ , ఇనుప ఖనిజ లీజుల టెండర్లు.. తదితరాల్లో వైకాపా ముఖ్యులకు వెంకటరెడ్డి భారీ లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను బదిలీచేసి, సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్‌ చేయాలని శుక్రవారం రాత్రి 11 గంటలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏపీ స్టేట్‌ బెవరేజేస్‌ కార్పొరేషన్‌  లిమిటెట్‌  మాజీ ఎండీ వాసుదేవరెడ్డి.. ఆ సంస్థ దస్త్రాలు, కంప్యూటర్  పరికరాలను రాత్రివేళ తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సీఐడీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది. ఇప్పుడు వెంకటరెడ్డి బదిలీ కావడంతో వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్‌ కు చెందిన పోలీసుల్లో కొందరు అటు గనులశాఖ సంచాలకుడి కార్యాలయానికి, ఇటు ఏపీఎండీసీ ఎండీ కార్యాలయానికి శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. అన్ని ఛాంబర్లకూ వెళ్లి.. దస్త్రాలు, హార్డ్‌కాపీలు తదితరాలు అన్నీ ఉన్నాయా? లేదా అని పరిశీలించారు. అనంతరం రెండు కార్యాలయాలకు తాళాలు వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం కొందరు ఉద్యోగులు ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరయ్యేందుకు వస్తే.. ఆఫీసు సీజ్‌ చేశామని, లోపలికి ఎవరూ వెళ్లేందుకు వీలులేదంటూ పోలీసులు వారిని వెనక్కి పంపేశారు.

ఏపీఎండీసీ కార్యాలయ ప్రాంగణంలో పోలీసులు

సంచాలకుడిగా..  యువరాజ్‌ బాధ్యతలు

గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీ ఎండీగా.. పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. వెంకటరెడ్డి స్థానంలో ఆయన్ను నియమించారు. దీంతో గనులశాఖ, ఏపీఎండీసీ అధికారులు..మంగళగిరిలోనీ ఏపీఐఐసీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయన అక్కడే రెండింటి బాధ్యతలూ తీసుకున్నారు. రెండు కార్యాలయాలకు పోలీసులు తాళాలు వేశారని, సోమవారం విధులు నిర్వహించడం ఎలా అని అధికారులు యువరాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తాళాలు తెరిచాకే విధులకు హాజరు కావాలని ఆయన వారికి సూచించారు. మరోవైపు ఏపీఎండీసీలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు..వాటి పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని