Vizag Drugs Case: విశాఖ పోర్టుకు వచ్చిన ఆ కంటెయినర్‌ కథ కంచికేనా?

విశాఖ పోర్టుకు రెండు నెలల క్రితం ఓ కంటెయినర్‌లో డ్రైడ్‌ ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Updated : 26 May 2024 10:31 IST

బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రైడ్‌ ఈస్ట్‌లో నిషేధిత మాదకద్రవ్యాల గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో 2 నెలలవుతున్నా చర్యల్లేవు!

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ పోర్టుకు రెండు నెలల క్రితం ఓ కంటెయినర్‌లో డ్రైడ్‌ ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో దిల్లీ నుంచి రంగంలోకి దిగిన సీబీఐ బృందం డ్రైడ్‌ ఈస్ట్‌ మాటున నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. న్యాయమూర్తి సమక్షంలో 25వేల కిలోల డ్రైడ్‌ ఈస్ట్‌ బ్యాగ్‌ల నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. కిలో ఈస్ట్‌లో ఎంత పరిమాణంలో మాదక ద్రవ్యాలున్నాయో లెక్క తేల్చేందుకు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)కి నమూనాలు పంపారు. మూడు ప్రయోగశాలలకు పంపిన నమూనాల నివేదికలు మూడువారాల్లో వస్తాయని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ అందలేదు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌తో పాటు, పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై అప్పట్లో సీబీఐ కేసు నమోదు చేసినా ఇప్పటి వరకూ చర్యల్లేకపోవడం చర్చనీయాంశమైంది. 

సీబీఐ విచారణలో ఏం తేలింది?

ఈ ఏడాది మార్చి 16న విశాఖ పోర్టుకు కంటెయినర్‌ రాగా... 19న 49 నమూనాలు పరీక్షించి డ్రగ్స్‌ ఉన్నట్లు తేల్చారు. సంధ్యా ఆక్వాపై కేసు నమోదు చేశాక సీబీఐ బృందాలుగా ఏర్పడి బ్రెజిల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో బృందం సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన కాకినాడ జిల్లా మూలపేట, వజ్రకూటంలోని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కంపెనీ బస్సులో రికార్డులు, చెక్‌బుక్‌లు, ఓచర్లు తరలిస్తుండగా బ్రేక్‌డౌన్‌ అయింది. స్థానిక పోలీసులు వాటిని సీబీఐకి అప్పగించకుండా.. యాజమాన్యానికి ఇవ్వడం అప్పట్లో అనుమానాలకు దారితీసింది. మరోవైపు కంటెయినర్‌ను అన్ని వాతావరణాలు తట్టుకునే ప్రదేశంలో ఉంచాలని సీబీఐ నిర్ణయించింది. కానీ, ఇప్పటికీ విశాఖ కంటెయినర్‌ టెర్మినల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (వీటీసీపీఎల్‌) ఎగ్జామిన్‌ పాయింట్‌లోనే దాన్ని ఉంచారు. 


ఈ ప్రశ్నలకు బదులేది..? 

  • ప్రయోగశాల నివేదికల్లో ఏం వచ్చింది?
  • బ్రెజిల్‌కు వెళ్లిన బృందాలు ఏం తేల్చాయి?
  • డ్రైడ్‌ ఈస్ట్‌లో ఎంత శాతం డ్రగ్స్‌ కలిపారు?
  • కంటెయినర్‌ను టెర్మినల్‌లోనే ఎందుకు వదిలేశారు?
  • ఎన్నికల ఫలితాలొచ్చే వరకూ ఈ వ్యవహారం తేలదా? 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని