Malika Garg: పల్నాడు పేరు చెడగొట్టారు

‘పల్నాడు పేరు చెడగొట్టారు.. ఇక్కడ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్లపైన తిరుగుతుంటారని దేశమంతటా ప్రచారమైంది.

Updated : 31 May 2024 07:28 IST

ఇక్కడ కర్రలు, రాడ్లతో తిరుగుతారని దేశమంతా ప్రచారమైంది
పది రోజుల్లో 160 కేసులు నమోదయ్యాయి
1,300 మందిని అరెస్టు చేశాం.. ఇక్కడ జైళ్లు చాలక రాజమహేంద్రవరం పంపిస్తున్నాం
వినుకొండలో ఎస్పీ మలికా గార్గ్‌ ఆవేదన

సభలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌

వినుకొండ, న్యూస్‌టుడే: ‘పల్నాడు పేరు చెడగొట్టారు.. ఇక్కడ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్లపైన తిరుగుతుంటారని దేశమంతటా ప్రచారమైంది. మాచర్ల, నరసరావుపేట పేర్లు ఇండియా అంతటా మార్మోగుతున్నాయి’ అని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గురువారం స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నా బ్యాచ్‌మేట్స్, కుటుంబసభ్యులు, మిత్రులు పల్నాడులో అంత ఫ్యాక్షన్‌ ఉందా అని అడుగుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పల్నాడు అత్యంత దారుణం (వరెస్ట్‌)గా ఉందని, పది రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదవడం తాము కోరుకోని రికార్డు అని చెప్పారు. రెండో స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయంటే పల్నాడులో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో గ్రహించాలన్నారు. ఆయా కేసుల్లో 1300 మందిని అరెస్టు చేశామని, వారిలో 400 మందిపై రౌడీషీట్లు తెరిచామని ఎస్పీ వెల్లడించారు. ఇక్కడ జైళ్లు పట్టక రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపిస్తున్నట్లు వివరించారు.

సామాన్యులే బలవుతున్నారు..

‘నాయకులు బాగానే ఉన్నారు.. వారికి డబ్బు, తెలివి ఉన్నందున బెయిల్‌ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు.. ఈ గొడవల్లో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారు’ అని  ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ జిల్లా ప్రజల్లో పౌరుషం ఎక్కువని, ఇక్కడివారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తనకు తెలుసన్నారు. ఎస్పీగా ఈ జిల్లాకు మంచిపేరు తెచ్చేందుకు మీ అందరి సహకారం కోరుతున్నానన్నారు. పట్టణ సీఐ సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో అదనపు ఎస్పీ రాజశేఖర్,  డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని