Polavaram: పోలవరమా ఇక పరుగులు పెట్టు..

మహిష్మతి సామ్రాజ్యమా... ఊపిరి పీల్చుకో అన్నట్లు తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి వెలవెలబోయింది.

Updated : 05 Jun 2024 09:41 IST

ఈనాడు, అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా... ఊపిరి పీల్చుకో అన్నట్లు తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి వెలవెలబోయింది. మరోవైపు రాష్ట్ర జీవనాడి పోలవరం సైతం విషమ సమస్యల్లో చిక్కుకుంది. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు పరుగులు తీసిన ఈ రెండు కీలక ప్రాజెక్టుల పనులు మళ్లీ గాడిన పడబోతున్నాయి.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు తమ సొంత భూములైన 34 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. ఇదో మహత్తర ప్రాజెక్టు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు సాగింది. అనేక సంస్థలు ఇందులో పాలు పంచుకునేందుకు ఆసక్తిగా ముందుకొచ్చాయి. రాజధానిలో మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.పది వేల కోట్లను వెచ్చించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాలన సాగుతున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు చంద్రబాబు హయాంలో నిర్మించినవే. శాశ్వత ప్రణాళిక ప్రకారం వీటికి పూర్తిస్థాయిలో భవనాలు ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం కూడా చంద్రబాబు ప్రభుత్వం భవనాలను నిర్మించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కాల్సి ఉంది. భూములిచ్చిన రైతులు గత ఐదేళ్లుగా పడని ఇబ్బందులు లేవు. వారి ఉద్యమమూ చరిత్రాత్మకమైంది. వారి ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూటమి సర్కారుపైనే ఉన్నాయి.

జలాశయం చుట్టూ సమస్యల వలయం

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ‘‘వారం వారం పోలవరం’’ పేరిట సమీక్షలు నిర్వహించి, అన్ని సమస్యలనూ స్వయంగా పరిష్కరిస్తూ పనులన్నీ వేగంగా జరిగేందుకు కృషి చేశారు. ఆయన హయాంలో కీలక నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చాయి. ప్రధాన డ్యాం సైతం 64.22% పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే 2014కు ముందు పోలవరం ప్రాజెక్టుపై రూ.4,730.71 కోట్లను ఖర్చు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో రూ.10,649.40 కోట్లు వెచ్చించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రూ.5,877 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇవన్నీ జగన్‌ ప్రభుత్వం తేల్చిన లెక్కలే. వైకాపా సర్కారు పనులను ఆలస్యం చేయడంతో పోలవరం చుట్టూ అనేక సమస్యలు ముసురుకున్నాయి. డయాఫ్రం వాల్‌ కొత్తది నిర్మించాలా, ఇప్పటికే ఉన్నదానికి మరమ్మతు చేస్తే సరిపోతుందా అన్నది నిపుణులు తేల్చాల్సి ఉంది. ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల సీపేజీని పరిష్కరించాలి. కేంద్రంతో మాట్లాడి రెండో డీపీఆర్‌ సాధించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు వేగంగా అడుగులు వేస్తే రాష్ట్ర వ్యవసాయ రంగం రూపురేఖలు మారతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు