Polavaram: పరిహారం అందక.. పురుగుమందే శరణ్యమని!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్తులు త్యాగం చేసినా.. ఆయన్ను ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అధికారులు అనర్హుడిగా తేల్చారు. తాను ఏం పాపం చేశానంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. జగన్‌ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు.

Updated : 25 May 2024 07:05 IST

పోలవరం నిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం
ధవళేశ్వరంలోని ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఘటన 
ఏళ్ల తరబడి తిరిగినా..  ఫలితం లేక వేదన చెందిన వృద్ధుడు 
ఒక్క దేవీపట్నం మండలంలోనే 1,100 మందికి పైగా బాధితులు  

ధవళేశ్వరంలోని పోలవరం పరిపాలనాధికారి కార్యాలయ ఆవరణలో పురుగుమందు తాగిన రైతు సీతారామయ్య

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ధవళేశ్వరం, దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్తులు త్యాగం చేసినా.. ఆయన్ను ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అధికారులు అనర్హుడిగా తేల్చారు. తాను ఏం పాపం చేశానంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. జగన్‌ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు. విసిగిపోయిన ఆ వృద్ధ రైతు శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తరువాత అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంకు చెందిన ఉండమట్ల సీతారామయ్య (75)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలవరం నిర్మాణం కోసం వీరి ఇల్లు, భూమి కోల్పోగా పరిహారం వచ్చింది. కొంత భూమికి సంబంధించి నష్టపరిహారం విషయంలో వివాదం తలెత్తడంతో అది న్యాయస్థానంలో ఉంది. మరోవైపు సీతారామయ్య పెద్ద కుమారుడు నాగేశ్వరరావుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ మంజూరైనా.. మరో కుమారుడిని మాత్రం అనర్హుడిగా పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయమని వాపోయినా.. సమాధానం చెప్పేవారు కరవయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సీతారామయ్యకు రూ.6.36 లక్షలు, 5 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణం చేసి అప్పగించాల్సి ఉన్నప్పటికీ అవేవీ దక్కలేదు. రాజమహేంద్రవరంలో కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉన్న సీతారామయ్య శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరి ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడి పరిపాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్‌) సెలవులో ఉండటంతో ఏవో అర్జునరావును కలిసి వినతి అందజేశారు. ఆరేళ్లుగా తిరుగుతున్నా, తమకు న్యాయం జరగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడివారు పునరావాస ప్యాకేజీ ఫైలు రంపచోడవరం సబ్‌ కలెక్టరు వద్ద పెండింగ్‌లో ఉందని కొంత దురుసుగా సమాధానం చెప్పినట్లు సమాచారం. దీంతో సీతారామయ్య మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి బయటకు వెళ్లిన ఆయన అరగంట తర్వాత తిరిగొచ్చి.. ఆ కార్యాలయం గడప మీదే శీతలపానీయంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సిబ్బంది 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలోని పునరావాస విభాగంలో విధులు నిర్వర్తించే డిప్యూటీ తహసీల్దార్లు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. స్పెషల్‌ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు సైతం రాలేదు.  

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు


వాట్సప్‌ గ్రూపులో చూసి తెలుసుకున్నా..

పరిహారం కోసం తన తండ్రి ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని సీతారామయ్య కుమారుడు నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కార్యాలయానికి వెళ్లిన ఆయన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తమ గ్రామ వాట్సప్‌ గ్రూపులో ఎవరో పెడితే తమకు తెలిసిందన్నారు. అక్కడి అధికారులు, సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు తప్ప.. తమకు సమాచారం ఇవ్వలేదని కన్నీటిపర్యంతమయ్యారు. 


ప్యాకేజీ కోసం ఎన్నాళ్లీ పోరాటం?

దేవీపట్నం మండలంలోని 44 ముంపు గ్రామాలకు చెందిన సుమారు 1,100 మందికి పైగా పోలవరం నిర్వాసితులను అనర్హులుగా గుర్తించడంతో పరిహారం కోసం వారు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మూడేళ్ల క్రితం వారిని కట్టుబట్టలతో గ్రామాల నుంచి జగన్‌ ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరావాసం చూపలేదు. ప్యాకేజీ కోసం వారంతా పోరాడుతున్నారు. అధికారుల తప్పిదాల వల్ల ఓ కుటుంబంలో తండ్రికి పరిహారం వస్తే.. కుమారులకు రాకపోవడం, అన్నకు ఇచ్చి తమ్ముడికి మొండిచేయి చూపడం వంటివి ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని తహసీల్దారు కార్యాలయానికి వెళ్తున్న వారిని రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లమని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే ధవళేశ్వరం వెళ్లమంటున్నారని బాధితులు వాపోతున్నారు. తీరా.. ధవళేశ్వరం వస్తే ఫైలు రంపచోడవరంలోనే ఉందన్న సమాధానం వస్తోందంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని