Polavaram Rehabilitation: ‘పోలవరం నిర్వాసితుల బాధలు చూడలేకే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డా’

‘పోలవరం నిర్మాణానికి భూములు, ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వాసితులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated : 26 May 2024 07:09 IST

కట్టుబట్టలతో బయటకు వచ్చాం
ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి పట్టలేదు
‘ఈనాడు-ఈటీవీ’తో దేవీపట్నం నిర్వాసిత రైతు సీతారామయ్య ఆవేదన

ఆసుపత్రిలో సీతారామయ్య

ఈనాడు, రాజమహేంద్రవరం: ‘పోలవరం నిర్మాణానికి భూములు, ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వాసితులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ గ్రామపెద్దగా అక్కడి వారందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం గ్రామానికి చెందిన నిర్వాసితుడు, రైతు ఉండమట్ల సీతారామయ్య(75) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం వద్ద శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ.. తన ఆవేదన వెల్లడించారు.

తిండి లేక ఇబ్బంది పడుతున్నారు

దేవీపట్నంలోని పోలవరం నిర్వాసితుల్లో నూటికి 90 మంది తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని సీతారామయ్య అన్నారు. న్యాయం చేయాలని కార్యాలయాల వద్ద ధర్నాలు, ఆందోళనలు చేసినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదని.. అక్కడ, ఇక్కడంటూ తిప్పిస్తున్నారే తప్ప సమస్య పరిష్కరించలేదని వాపోయారు. రాజమహేంద్రవరంలోని కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉన్న తాను శుక్రవారం ఉదయం ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయానికి వెళ్లానని తెలిపారు. అక్కడ ఉన్నతాధికారులు లేరని, వినతిపత్రం తీసుకుని వారికి పంపిస్తామంటూ సిబ్బంది చెప్పారని అన్నారు. గతంలో పదుల సార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేయాలని కోరానని పేర్కొన్నారు. దీనావస్థలో ఉన్న నిర్వాసితుల బాధలు చూడలేక.. చివరి ప్రయత్నంగా తాను ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నానని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘నేను దేవీపట్నంలో పుట్టి పెరిగాను. మా భూమి తీసుకుని మాకే అన్యాయం చేశారు. కాలనీలు కట్టలేదు. స్థలాలు లేవు. ప్యాకేజీలు లేవు. అందరినీ ఉన్నపళంగా కట్టుబట్టలతో పంపించేసి ఏడిపిస్తారా? నిలువ నీడ, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

డబ్బులొస్తే మనవళ్లను చదివించుకోవాలని ఉంది..

‘‘నాకు దేవీపట్నంలో భూమి, ఇల్లు ఉండేవి. 15 ఎకరాల రైతును. ఐదెకరాలకు పరిహారం తీసుకుంటే, ఏడెకరాలకు సంబంధించి న్యాయస్థానంలో పెండింగ్‌ ఉంది. ఎనిమిదేళ్లవుతున్నా సమస్య పరిష్కరించలేదు. నాతోపాటు చాలామందికి ఇదే ఇబ్బంది. ప్రభుత్వమో, అధికారులో ఎవరు మోసం చేస్తున్నారో తెలియడం లేదు. దరఖాస్తులిస్తే చెత్తబుట్టలో పడేస్తున్నారు. నా కుమారులు ఎలాగో బతుకుతారు. నా చేతికి డబ్బులు వస్తే మనవళ్లను చదివించుకోవాలని ఉంది’ అని సీతారామయ్య ఆవేదనతో చెప్పారు. ఆయనను ఆసుపత్రిలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. ఒక నిర్వాసితుడు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. ఇప్పటికీ అధికారులు ఆసుపత్రికి రాకపోవడాన్ని తప్పుపట్టారు. సీతారామయ్యను చూసేందుకు గ్రామస్థులు వచ్చారు. ఆసుపత్రిలో ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు ఉంచారు. నిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు పికెట్‌ ఏర్పాటుచేశారు.


పోలవరం నిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం బాధాకరం: సీపీఎం

ఈనాడు, అమరావతి: ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన పోలవరం నిర్వాసిత రైతు సీతారామయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని, వెంటనే ఆ రైతుకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘‘ఇలాంటివి మరిన్ని ఘటనలు జరగకముందే రాష్ట్రప్రభుత్వం పునరావాస పరిహారం బాధితులకు ఇప్పించాలి. భూమి, ఇళ్లు తన మొత్తం ఆస్తిని ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన సీతారామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానా ఇది. పునరావాస బాధితులకు 20% పరిహారం సైతం అందకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’’ అని విమర్శించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని