Palnadu: ఓటు.. వారికి జీవన్మరణ సమస్య!

పట్టణాల్లో కొందరికి పోలింగ్‌ అంటే సెలవు దినం.. ఓటేయడానికి అరగంట కూడా లైన్లో నిల్చోలేనంత బద్ధకం.. నేనొక్కణ్నే ఓటేయకపోతే ఏమవుతుందనేంత నిర్లక్ష్యం.. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వారికి మాత్రం ఓటేయడం అంటే జీవితాల్ని పణంగా పెట్టడమే. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు వినియోగించుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి.

Updated : 30 May 2024 07:56 IST

పల్నాట కొన్ని పల్లెల్లో ఓటేయడం ఓ యజ్ఞమే  
వర్గపోరుతో దాడులు, దౌర్జన్యాలు.. అరాచకాలతో ఊరొదిలే పరిస్థితి 

ఈనాడు, అమరావతి: పట్టణాల్లో కొందరికి పోలింగ్‌ అంటే సెలవు దినం.. ఓటేయడానికి అరగంట కూడా లైన్లో నిల్చోలేనంత బద్ధకం.. నేనొక్కణ్నే ఓటేయకపోతే ఏమవుతుందనేంత నిర్లక్ష్యం.. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వారికి మాత్రం ఓటేయడం అంటే జీవితాల్ని పణంగా పెట్టడమే. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు వినియోగించుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి. ప్రాణాలకు ఎదురొడ్డి నిలవాలి. ఇది మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల పరిస్థితి! అక్కడ ఫ్యాక్షన్‌ మూకల అరాచకాల్ని ప్రశ్నించి, వారి దాడులకు, వేధింపులకు తట్టుకోలేక అవతలి వర్గం ఊరొదిలి పారిపోవాల్సి వస్తుంది. అలాంటి వారంతా ఎక్కడెక్కడో శరణార్థుల్లా బతికి.. మళ్లీ ఎన్నికలప్పుడు ఓటేయడానికి ఊళ్లోకి వస్తారు. అప్పుడూ మళ్లీ గొడవలు.. కేసుల్లో ఇరుక్కుంటారు. ఎన్నికల్లో తమ వర్గం మద్దతిచ్చే పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యర్థి వర్గీయులపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రత్యర్థి  వర్గీయుల పార్టీ పైచేయి సాధిస్తే.. మళ్లీ పారిపోతారు. గెలిచే పార్టీలకు అనుగుణంగా గ్రామాల్లో బాధితులు మారతారంతే. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, ఊరు నుంచి పారిపోవడాలు మాత్రం ఆగవు. కాష్ఠం రగులుతూనే ఉంటుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసులు, రాజకీయ నేతలు వస్తుంటారు. పోతుంటారు. వారెవరూ వీరి గోడు పట్టించుకోరు. రాజీ చేద్దామనే ఆలోచనే చేయరు. కక్షలు కార్పణ్యాలతో నిత్యం రగిలిపోయే ఈ వ్యవస్థ మారేదెన్నడు? అరాచకాలకు ముగింపు పలికేదెప్పుడు? 

ఊరంటే ఏదో ఒక వర్గంలో చేరాల్సిందే

పల్నాడులో చాలా పల్లెల్లో ప్రజలు స్థానిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ఏదో ఒక వర్గంలో ఉండక తప్పని పరిస్థితి. తటస్థంగా ఉంటామన్నా కుదరదు. రాజకీయ పార్టీలు కూడా తమ అవసరాల కోసం ఈ వర్గాలను చేరదీసి విభేదాలను ప్రోత్సహిస్తాయి. ఎన్నికల్లో తమ గ్రామం నుంచి ఇంత మెజారిటీ తెచ్చామని చూపిస్తేనే ఎమ్మెల్యే, ఎంపీల దగ్గర వర్గ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది. అందుకే ఓటు కోసం అంత పట్టుదలగా తలపడుతుంటారు. ప్రత్యర్థుల్ని ఓటేయనివ్వకుండా దాడులకు పాల్పడుతుంటారు. ఫ్యాక్షన్‌ కక్షలకు బలవుతున్న పల్లెలన్నింటిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఈవీఎం పగలగొడుతుంటే.. తెదేపా ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేషగిరిరావు ముందుకు దూకి ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరమేంటి? తమ వర్గం మద్దతిచ్చే పార్టీ గెలిచినా ఆయనకేం అధికారం రాదు. ఇప్పటి మాదిరిగానే ఆయనో సాధారణ రైతుగానే మిగులుతారు. గతంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దాచేపల్లి మండలం రామాపురంలో రెండు వర్గాల ఘర్షణలో ఒకరి తల పగిలింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఒకే వర్గానికి చెందిన 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసి జైలుకు పంపారు. వారు 30 రోజులు అక్కడే గడిపారు. అధికారపక్షం వారిపై మాత్రం సెక్షన్‌ 324 కేసు నమోదు చేసి, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి గంటలోనే ఇంటికి పంపేశారు. మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, గురజాల, మాచవరం తదితర మండలాల్లోని పదులకొద్దీ గ్రామాల్లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమే. చిన్న గొడవ జరిగినా.. దానికి రాజకీయ రంగు పులిమేసి ప్రత్యర్థులను కట్టడి చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటారు.  

గొడవలు జరుగుతాయని తెలిసినా.. ఓటు కోసమే

ఊరొదిలి వెళ్లి హైదరాబాద్‌లో మెస్‌ పెట్టుకుని జీవిస్తున్న మంజుల.. మళ్లీ రెంటాల వెళ్లి గొడవల్లో ఇరుక్కోవడం ఎందుకు? ప్రత్యర్థులు దాడి చేస్తారని తెలిసినప్పుడైనా ఆగిపోవచ్చుగా? అయినా ఆమె అలా ఆలోచించలేదు. తానే ఏజెంట్‌గా నిలబడేందుకు సిద్ధమై.. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత కూడా ఆ కుటుంబసభ్యులు వెనక్కి తగ్గకుండా ఏజెంటుగా బాధ్యతలు నిర్వహించి.. రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. ఆ కుటుంబానికి గతంలో ఎదురైన పరిస్థితులే దీనంతటికీ కారణం. వర్గపోరు అధికంగా ఉండే గ్రామాల్లో ఒక పార్టీ అధికారంలోకి వస్తే ‘దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్లు అవతలి వర్గం అనుక్షణం భయపడుతూ బతకాల్సి వస్తోంది. అధికారులు, పోలీసులను కూడా వాడుకుని వెంటపడి వేధిస్తారు. వాళ్లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు. అప్పులపాలై ఆస్తులమ్ముకుని ఊరొదిలి పోయేలా చేస్తారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరు ఎన్నికల్లో ఓటేయడం కోసమే ఊరొచ్చారు. అక్కడ జరిగిన ఘర్షణలో తమ ప్రమేయం లేకున్నా జైలు పాలయ్యారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారాలు చేస్తూ, హోటళ్లు నడుపుతూ, కూలి పనులు చేసుకుంటూ బతికేవారు.. ఇలా అందరూ ఓటేసేందుకు ఊళ్లకు తిరిగొస్తున్నారు. గొడవల్లో ఇరుక్కుంటే పోలీసు కేసులవుతాయనే భయమున్నా.. అది తమ భవిష్యత్తుకు ఇబ్బందికరమని తెలిసినా వెనకాడటం లేదు. విదేశాల్లో ఉండేవారు సైతం రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకుని ఓటేసేందుకు వస్తున్నారు. తీరా గ్రామంలోకి వచ్చాక.. అక్కడ జరిగే గొడవల్లో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా ఉద్రిక్త పరిస్థితుల నడుమ జైలుపాలవుతున్నారు. 

దుర్గి మండలం ఆత్మకూరులో స్వల్ప వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీయడంతో 65 కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల, జంగమహేశ్వరపాడులో దాడులు తట్టుకోలేక సుమారు 50 కుటుంబాలు ఊరొదిలాయి. గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలోనూ పనికెళ్లి వస్తున్న ఒక వర్గం వారిపై ప్రత్యర్థులు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేసి బీభత్సం సృష్టించి, 300 కుటుంబాలను ఊరు నుంచి తరిమేశారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఒక పార్టీ సానుభూతిపరుణ్ని హత్య చేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చాక.. బాధిత కుటుంబాల్ని వేధించి, అడవుల్లోకి తరిమేశారు. ఎన్నికల నేపథ్యంలో వీరంతా సొంతూళ్లకు తిరిగొచ్చినా ఇళ్ల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నారు. వంతులవారీ కాపలా కాస్తున్నారు. ఒకేచోట నిద్రపోతున్నారు. ఏ పనికైనా మహిళలే వెళ్లాల్సి వస్తోంది. 


పొలాలు బీళ్లు.. కేసులు, వాయిదాలు.. భారీగా ఖర్చులు

గొడవలు మొదలయ్యాయంటే.. హత్యలు, దాడులతో గ్రామం అట్టుడికిపోతుంది. ప్రత్యర్థులను ఎదిరించే క్రమంలో అందరిపైనా కేసులు నమోదవుతాయి. పోలీస్‌స్టేషన్లు, బైండోవర్లు, కోర్టు వాయిదాలకు తిరుగుతూ వ్యవసాయం చేసేవాళ్లు లేక పొలాలు బీళ్లవుతాయి. మహా అయితే రాజకీయ పార్టీ నాయకులు వచ్చి పరామర్శిస్తారు. మాటసాయమే తప్ప ఆర్థికంగా ఆదుకోరు. బాధితులే సొంతంగానో, చందాలేసుకునో భరించాల్సిందే. కేసులు తేలేసరికి ఆస్తులు కరిగిపోతున్నాయి. అయినా ఎక్కడెక్కడో ఉండే ఇలాంటి వారంతా ధైర్యం కూడగట్టుకుని ఎన్నికల సమయానికి ఊరు చేరుతున్నారు. నచ్చిన పార్టీకి ఓటేయడం ద్వారా ప్రభుత్వం మారితే తమపై వేధింపులకు తెరపడుతుందన్న ఆశే వారిని ఇక్కడి వరకూ తీసుకొస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు