Pondhuru Khadi: పొట్ట నింపని పొందూరు ఖాదీ!

గాంధీజీ మెచ్చిన ఖద్దరు.. అక్కినేని అంచు పంచెలుగా అలరింపు.. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి ఉన్న గుర్తింపు.

Updated : 26 May 2024 06:14 IST

ప్రోత్సాహం కరవై చేనేత కార్మికుల నిట్టూర్పులు 
ఈ రంగానికి దూరంగా యువతరం
ఆధునికత అందిపుచ్చుకోక అవస్థలు
సాంకేతికత జోడిస్తేనే పూర్వ వైభవం

 పంచె

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పొందూరు: గాంధీజీ మెచ్చిన ఖద్దరు.. అక్కినేని అంచు పంచెలుగా అలరింపు.. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి ఉన్న గుర్తింపు. స్వదేశీ ఉద్యమ కాలంలో తెలుగువారి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన ఈ నేత వస్త్రం ప్రస్తుతం కునారిల్లుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా.. నేత కార్మికులకు ఆదాయం కరవైన దుస్థితి. ప్రభుత్వాల సహకారం లేక వారంతా నిట్టూరుస్తున్నారు. గతంలో పొందూరు ఖాదీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు 8-9 వేల వరకు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 1,100కు చేరింది. ఏడాదికి రూ.15-20 కోట్లుగా ఉన్న టర్నోవర్‌ రూ.5 కోట్లకు తగ్గిపోయింది.

పత్తి శుద్ధి ప్రత్యేకం

పొందూరు వస్త్రం నేత కోసం మొదట వాలుగ చేప దవడ ఎముకతో పత్తిని ఏకుతారు. ఇలా చేయడం వల్ల పత్తిలో ఉండే మలినాలు తొలగి, వస్త్రం దృఢంగా ఉంటుందని చెబుతారు. దూది ఏకిన తర్వాత మగ్గానికి చేరే ముందు మళ్లీ 8 దశల్లో శుద్ధి చేస్తారు. ఇవన్నీ చేతులతో చేసే ప్రక్రియలే. ఇలా సిద్ధం చేసిన దారంతో ఒక పంచె నేయడానికి 20-30, చీరకు 30-35 రోజుల సమయం పడుతుంది. రోజంతా భార్య, భర్తలిద్దరూ కష్టపడి పనిచేస్తే రూ.300 కూడా ఆదాయం రాని పరిస్థితి. ప్రస్తుతం పంచెలు, చీరలు, టవళ్లు, చేతి రుమాళ్లతోపాటు చొక్కాలకు అవసరమైన వస్త్రాలను నేస్తున్నారు.

చీర

ఇదీ చరిత్ర

స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. అందుకు తన కుమారుడు దేవ్‌దాస్‌ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవ్‌దాస్‌ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో వ్యాసం రాశారు. దాన్ని చదివిన అనేకమంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు ఖాదీ వైభవం. 1955లో ఆచార్య వినోభాబావే శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది.

యువతకు శిక్షణ అందిస్తేనే..

ప్రసుత్తం పొందూరు ఖాదీని నేస్తున్న వారంతా 40 ఏళ్ల వయసు పైబడిన వారే. వీరంతా పాత మూస పద్ధతులనే కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఆదాయం ఉండటం లేదు. ఈ కారణంగా యువత నేత వైపు మరలడం లేదు. ప్రత్యామ్నాయంగా ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చి, యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే ఈ రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వం రాయితీపై రుణాలిచ్చి ప్రోత్సహించాలి. మార్కెటింగ్‌ సౌకర్యాన్ని విస్తృతం చేయాలి.


పనికి తగ్గ ఆదాయం లేదు

40 ఏళ్లుగా ఈ వృత్తి చేస్తున్నా. ఎలాంటి పురోగతి లేదు. పనికి తగ్గ ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నాం. రోజంతా భార్యాభర్తలం కష్టపడి పనిచేస్తే రూ.300 కూలి రాని పరిస్థితి. మా ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు.

హేమసుందరరావు, ఖాదీ కార్మికుడు, పొందూరు


మనుగడ కష్టం

ఖాదీ పరిశ్రమ మనుగడ కష్టంగా మారింది. ఉన్న నేత కార్మికులంతా దాదాపు వృద్ధులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆదాయం తక్కువగా ఉండటంతో యువత ఈ రంగం వైపు రావడం లేదు. మా తరంతోనే ఖాదీ పరిశ్రమ ఆగిపోతుందన్న ఆందోళన ఉంది.

ఎం.కళ్యాణి, ఖాదీ కార్మికురాలు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని