Vijayawada: ‘నాడు యోగక్షేమాలు...’ నేడు అమ్మచేతి రుచులు

ఆప్యాయత అనురాగాల్ని కలిపి స్వదేశంలో అమ్మ సిద్ధం చేసిన ఆవకాయను... ఎంచెక్కా విదేశాల్లో ఉన్న వారు తినేస్తున్నారు... నాన్న ఎంతో ప్రేమతో కొనుగోలు చేసిన దుస్తుల్ని పుట్టినరోజు నాడో ఇతరత్రా వేడుక రోజునో ఖండాంతరాల్లో ఉన్నవారు తొడిగేస్తున్నారు.

Published : 25 May 2024 04:52 IST

ప్రవాసాంధ్రుల సేవలో తపాలా కార్యాలయం
విదేశాలకు ఆహార పదార్థాలు, దుస్తులు
53 దేశాలకు పార్సిళ్లు పంపించే సదుపాయం

విజయవాడ గొల్లపూడిలోని విదేశీ తపాలా కార్యాలయం

ఈనాడు, అమరావతి: ఆప్యాయత అనురాగాల్ని కలిపి స్వదేశంలో అమ్మ సిద్ధం చేసిన ఆవకాయను... ఎంచెక్కా విదేశాల్లో ఉన్న వారు తినేస్తున్నారు... నాన్న ఎంతో ప్రేమతో కొనుగోలు చేసిన దుస్తుల్ని పుట్టినరోజు నాడో ఇతరత్రా వేడుక రోజునో ఖండాంతరాల్లో ఉన్నవారు తొడిగేస్తున్నారు. దేశంకాని దేశంలో ఉంటున్న మన తెలుగువారితో మాతృభూమి బంధాన్ని మరింత పెనవేస్తూ వారిలో సంతోషాల్ని మరింతగా పెంచుతూ అయినవారు పంపే ఆహార పదార్థాల్ని, దుస్తులు, ఇతరత్రా పార్సిళ్లను ఇక్కడి నుంచి వారికి అందేలా చేస్తోంది విజయవాడలోని విదేశీ తపాలా కార్యాలయం. ఒకప్పుడు యోగక్షేమాల సమాచారాన్ని పంపిన తపాలాశాఖ ఇప్పుడు విదేశాల్లో ఉంటున్న మన వాళ్లకు ఇంటి రుచుల్ని అందిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత విజయవాడలో ఏర్పడిన రాష్ట్ర స్థాయి విదేశీ తపాలా కార్యాలయం క్రమంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ప్రజలకు చేరువవుతోంది. 53 దేశాలకు పార్సిళ్లను పంపే ఏర్పాట్లున్నాయిక్కడ. నగర శివారు గొల్లపూడిలో విశాలమైన సొంత భవనంలోకి కొద్ది నెలల క్రితం కార్యాలయం మారింది. అందులోనే కస్టమ్స్‌ విభాగమూ ఏర్పాటైంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు విదేశాల్లోని తమ వారి కోసం పంపే పార్సిళ్లను తీసుకురావడమే తడవుగా కస్టమ్స్‌ అధికారుల పరిశీలన క్షణాల్లో జరిగిపోతుంది. ఆ పార్సిళ్లను  చెన్నై అంతర్జాతీయ   విమానాశ్రయం నుంచి విదేశాలకు పంపుతున్నారు. 

విదేశాలకు పంపేందుకు సిద్ధం చేసిన పార్సిళ్లు

ఏడాదికి రూ.కోటికి పైగా... 

2018 డిసెంబరు 31న విదేశీ తపాలా కార్యాలయం ప్రారంభమైంది. తొలి మూడు నెలల్లో రూ.65 వేలకు పైగా వ్యాపారం జరిగింది. 2022-23 నాటికి వ్యాపారం ఏడాదికి రూ.కోటికి పైనే. ప్రస్తుతం ఇక్కడి నుంచి రోజుకు 10 నుంచి 15 పైగా పార్సిళ్లను విదేశాలకు పంపుతున్నారు. నెలకు రూ.10 లక్షలకు పైగా వ్యాపారం అవుతోంది. 

పార్సిల్‌ను స్కాన్‌ చేస్తున్న కార్యాలయ సిబ్బంది

పచ్చళ్లు... మిఠాయిలు... దుస్తులు 

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్‌తోపాటు గల్ఫ్‌ దేశాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల నుంచి అత్యధికంగా ఆహార పదార్థాలు, దుస్తులు... విదేశీ తపాలా కార్యాలయం నుంచి వెళ్తున్నాయి. ఆహార పదార్థాల్లో పచ్చళ్లు, మిఠాయిలదే అగ్రస్థానం. ఆస్ట్రేలియాలో దుస్తుల ధరలు భారీగా ఉంటున్నందున అక్కడ నివసిస్తున్న మనవారి కోసం ఇక్కడి నుంచే కొని పంపిస్తున్నారు. ఆ దేశానికి పంపుతున్న ప్రతి పార్సిల్‌లోనూ దుస్తులు ఉంటున్నాయి. అమెరికాకు ఎక్కువగా పచ్చళ్లు వెళ్తున్నాయి. కొంతమంది ఔషధాలనూ పంపిస్తున్నారు. ఔషధాలకు డ్రగ్స్‌ అధికారి నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

శ్రీలంకకు బిస్కెట్లు... ఎండు ఫలాలు

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్‌ సంస్థలో శ్రీలంకకు చెందిన వారు పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. వారు తమ దేశంలోని కుటుంబసభ్యుల కోసం ఇక్కడ నుంచి పలు వస్తువులతోపాటు బిస్కెట్లు, ఎండు ఫలాల్ని ఎక్కువగా పంపుతున్నారు. శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అక్కడ దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలూ భారీగా పెరిగాయి. బ్రాండెక్స్‌లో పని చేస్తున్న శ్రీలంకేయులు వారి కుటుంబసభ్యులకు విదేశీ తపాలా కార్యాలయం ద్వారా ఆహార పదార్థాల్ని పంపుతున్నారు. 


రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా...

విదేశాలకు పంపించాలనుకుంటున్న పార్సిల్‌ను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బుక్‌ చేసుకోవచ్చు. అన్ని ప్రధాన, సబ్‌ తపాలా కార్యాలయాల్లో ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశాం. వీటికి ఇక్కడ వెంటనే కస్టమ్స్‌ అనుమతి తీసుకుని చెన్నై పంపుతున్నాం. ప్రపంచంలో 53 దేశాలకు పార్సిళ్లు, మరో 46 దేశాలకు స్పీడ్‌ పోస్ట్‌ సేవల్ని అందిస్తున్నాం. 

ఎం.నర్సింహస్వామి, తపాలాశాఖ సీనియర్‌ సూపరింటెండెంట్, విజయవాడ


సకాలంలో అందుతున్నాయి

విదేశీ తపాలా కార్యాలయం ద్వారా బుక్‌ చేసిన పార్సిళ్లు విదేశాల్లోని కుటుంబసభ్యులకు సకాలంలో అందుతున్నాయి. ఆలస్యమవుతుందన్న మాటేలేదు.

యు.వంశీకృష్ణ, వినియోగదారుడు, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు