Pinnelli: పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ 13 వరకు పొడిగింపు

ఎన్నికల సందర్భంగా అరాచకం సృష్టించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది.

Updated : 07 Jun 2024 09:20 IST

నాలుగు బెయిలు పిటిషన్లపై హైకోర్టు విచారణ 

ఈనాడు, అమరావతి: ఎన్నికల సందర్భంగా అరాచకం సృష్టించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్‌ పిటిషన్లపై వేసవి సెలవుల బెంచ్‌ ప్రాథమిక విచారణ జరిపింది. రాత్రి 10.20 కావడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరువైపుల న్యాయవాదుల సమ్మతి మేరకు విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. 

నాలుగులో రెండు హత్యాయత్నం కేసులు

ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టిన వ్యవహారంతో పాటు.. మరో రెండు హత్యాయత్నం కేసులు కూడా పిన్నెల్లిపై నమోదయ్యాయి. 

పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేస్తారు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్లపై గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పిటిషనర్‌ ఇంటిచుట్టూ పోలీసులను మోహరించారన్నారు.

  • తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని, పిటిషనర్‌పై నమోదైనవి తీవ్ర కేసులని చెప్పారు. అవి అరెస్టు నుంచి ఉపశమనం కలిగించాల్సిన కేసులు కావన్నారు. పిన్నెల్లి, ఆయన అనుచరుల దాడిలో గాయపడిన కారంపూడి సీఐ నారాయణస్వామి తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. సీఐపై అత్యంత దారుణంగా దాడి చేశారన్నారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లలో కౌంటర్‌ దాఖలు చేశామని తెలిపారు. పిటిషనర్‌పై నమోదు చేసిన నాలుగు కేసులలో రెండు ఏడేళ్లకు పైబడి శిక్ష విధించేందుకు వీలున్నవేనని చెప్పారు.

రాత్రి వరకు ఉత్కంఠ

నరసరావుపేట టౌన్, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారని రాత్రి 10.30 వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బెయిల్‌ పొడిగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠ వీడింది. గురువారం సాయంత్రం 5.15కు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేసి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు