Pulichintala project: పులిచింతల ఖాళీ

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని డాక్టర్‌ కె.ఎల్‌.రావు సాగర్‌ పులిచింతల జలాశయంలో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి.

Published : 28 May 2024 04:48 IST

కృష్ణా డెల్టాకు తప్పని కష్టాలు 
న్యూస్‌టుడే - అచ్చంపేట

ల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని డాక్టర్‌ కె.ఎల్‌.రావు సాగర్‌ పులిచింతల జలాశయంలో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. గతేడాది ఆశించిన మేర వర్షాలు పడలేదు. మరోవైపు కృష్ణానదికి వరద తక్కువ రావడంతో జలాశయానికి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. ప్రాజెక్టు రేడియల్‌ గేట్లు, రివర్‌స్లూయిజ్‌ గేట్ల మరమ్మతులు, తాగునీటి అవసరాల నిమిత్తం ఉన్న కొద్దిపాటి నీటిని దిగువకు వదిలేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. 2014 నుంచి జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. గతంలో నాలుగేళ్లు పూర్తిస్థాయిలో నీరు చేరింది. 2023 జూన్‌ నుంచి ప్రాజెక్టు ఎగువ భాగంలో ఆశించిన మేర వర్షాలు, కృష్ణానదికి వరదలు లేకపోవడంతో జలాశయం ఖాళీ అయింది. 2021 ఆగస్టు 5న ప్రాజెక్టుకు చేరిన వరద నీటిని విడుదల చేస్తున్న క్రమంలో 16వ గేటు కొట్టుకుపోయింది. ఆ ఏడాది మొత్తం నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. తెదేపా హయాంలో పట్టిసీమ ద్వారా ఏడాదికి 80 టీఎంసీల చొప్పున మూడేళ్లు నీటిని అందించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పులిచింతల ప్రాజెక్టుపై ఆధారపడి కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో 10.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. జూన్‌లో వరినారు పెంచి, జులైలో నాట్లు వేస్తారు. కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో 5.71 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు సాగవుతాయి. ఏటా జూన్‌ మొదటి పక్షంలోనే డెల్టా కాలువకు నీరు విడుదల చేస్తారు. ఈసారి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో వరినాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఖరీఫ్‌ సీజనుకు సుమారు 145 టీఎంసీల నీరు అవసరం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని