Andhra Pradesh News: రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్‌ సభ్యులు!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్‌లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated : 19 May 2024 07:39 IST

13 మందిలో 9 మంది ఏసీబీ నుంచే...
ఆయన హయాంలో నియమితులైన అధికారులపై నిష్పక్షపాత నివేదిక ఇవ్వగలరా?
ప్రతిపక్షాల్లో సంశయం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్‌లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారు తమ బాస్‌ నియమించిన అధికారుల తప్పుల్ని ఎత్తిచూపుతూ, చర్యలకు సిఫార్సు చేస్తూ నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వగలరా అనే సంశయం కలుగుతోంది. ఎన్నికల సందర్భంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తును సమీక్షించేందుకు తాజాగా ఏర్పాటుచేసిన సిట్‌లోని 13 మంది సభ్యుల్లో 9 మంది ఏసీబీలో పనిచేస్తున్నవారే. వీరిలో ఎస్పీ స్థాయి అధికారి మొదలుకుని ఇన్‌స్పెక్టర్ల వరకూ ఉన్నారు. వీరందరినీ రాజేంద్రనాథరెడ్డే ఏసీబీలో నియమించారు. ప్రస్తుతం వీరు సిట్‌లో సభ్యులైనా.. ఆ తర్వాత మళ్లీ ఏసీబీలో రాజేంద్రనాథరెడ్డి నేతృత్వంలోనే పనిచేయాలి. అలాంటప్పుడు సిట్‌ సభ్యులు వాస్తవాలను వెలికితీసి, ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా అనే సందేహం ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.

అందరూ ఏసీబీ నుంచే ఎందుకు?

వైకాపాతో అంటకాగుతూ.. ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపైనే పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఎన్నికల సంఘం రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ పోస్టు నుంచి తప్పించింది. తర్వాత ఆయన ఏసీబీ డీజీ పోస్టులో కొనసాగుతున్నారు. అలాంటి ఆరోపణలున్న అధికారి కింద పనిచేస్తున్న బృందాన్నే సిట్‌లో ఎలా నియమిస్తారు? వేర్వేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 

రెండు రోజుల్లో ఎలా సాధ్యం?

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. సిట్‌ బృందాలు విచారణ మొదలుపెట్టడానికే రెండు రోజులు సరిపోదు. అలాంటిది ఇంత తక్కువ వ్యవధిలో వాస్తవాల్ని ఎలా వెలికితీయగలరు? కేసుల దర్యాప్తును సమీక్షించడం, సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోతే.. సంబంధిత సెక్షన్లు వర్తింపజేయడం, కొత్తగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఆ వివరాల్ని నివేదికలో పొందుపరచడం వంటివి సిట్‌ ప్రధాన బాధ్యతలు. ఈ కొద్దిసమయంలో క్షేత్రస్థాయిలో నుంచి సమాచారం సేకరించి, బాధితులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం వీలుకాదు. హడావుడిగా నివేదిక సమర్పిస్తే అసలు దోషుల్ని గుర్తించటం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విశ్రాంత న్యాయమూర్తి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉంటే!

సిట్‌ అధిపతిగా ఐపీఎస్‌ అధికారి, ఎస్‌ఐబీ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఉన్నారు. బృందంలోని మిగతా 13 మంది సభ్యులూ పోలీసు అధికారులే. ఇదే బృందంలో పర్యవేక్షణ కోసం ఒక విశ్రాంత న్యాయమూర్తిని, ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించి ఉంటే.. ఎక్కడికక్కడ చెక్స్‌కు వీలుండేది. పూర్తిస్థాయి వాస్తవాలను వెలికితీసే అవకాశం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేయగలరా?

హింసకు తెగబడి ఎన్నికల్లో పైచేయి సాధించాలనే కుట్రలో భాగంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ రావడానికి కొన్ని నెలల ముందే వైకాపా వీరభక్తులైన అధికారులను డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలుగా కీలక స్థానాల్లో వైకాపా ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్వ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి వీరిని నియమించారు. వారిలో ఎక్కువమంది జిల్లా ఎస్పీలకు సహకరించకుండా.. వైకాపా ఎమ్మెల్యేలు చెప్పినట్లు పనిచేశారు. వారికి వేగుల్లా వ్యవహరించారు. ఎస్పీకే అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టించారు. పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి అయితే అరాచక శక్తుల్ని బైండోవర్‌ చేయనివ్వకుండా అడ్డుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపాకు కొమ్ముకాస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎస్పీ విన్నవించినా పట్టించుకోలేదనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. వీటన్నింటి ఫలితంగానే పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపైన దాడులు జరిగాయి.

  • తాడిపత్రిలోనూ డీఎస్పీ గంగయ్యను రాజేంద్రనాథరెడ్డే నియమించారు. గంగయ్యతో పాటు మరికొందరు అధికారులు వైకాపా నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. తిరుపతి డీఎస్పీ సరేందర్‌ రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి, తిరుపతి ఎస్‌బీ సీఐ రాజశేఖర్‌... వీరంతా వైకాపా వీరవిధేయులైన అధికారులు. తిరుపతిలో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద తెదేపా అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం జరగడానికి, హింస చెలరేగడానికి వీరితోపాటు మరికొంతమంది బాధ్యులు. ఈ అధికారులంతా రాజేంద్రనాథరెడ్డి హయాంలో నియమితులైనవారే.
  • ఎన్నికల రోజున, ఆ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండకు రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ సిట్‌ నివేదిక ఇవ్వగలదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని