Ramoji Rao: పెదపారుపూడి అభివృద్ధిపై చెరగని ముద్ర

కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లి దేశం గర్వించే స్థాయికి చేరుకున్న రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated : 09 Jun 2024 08:57 IST

దత్తత తీసుకుని.. సమస్యలన్నీ పరిష్కరించిన రామోజీరావు
పాఠశాలలు, రహదారులు సహా ఎన్నో వసతుల ఏర్పాటు
ఆయన లేరనే వార్తతో శోకసంద్రంలో సొంతూరు
ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- పెదపారుపూడి

పెదపారుపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులు

కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లి దేశం గర్వించే స్థాయికి చేరుకున్న రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడున్నా.. అనుక్షణం పుట్టిన గడ్డ కోసం తపించే మహోన్నత వ్యక్తిత్వం అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుందని, అలాంటివారిలో తమ రామోజీ ఒకరంటూ గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. గ్రామానికి ఆయన చేసిన సేవలు తాము జీవితంలో మరచిపోలేమంటూ కొనియాడారు. గ్రామంలోని అన్ని కూడళ్లలో ‘జోహార్‌ రామోజీరావు’ అంటూ ఆయన చిత్రపటానికి ప్రజలు నివాళులర్పించారు. సర్పంచి చప్పిడి సమీర, రామోజీరావు స్నేహితులు పాలడుగు చంద్రశేఖర్, గ్రామస్థులు గారపాటి బాబూరావు, రత్నప్రసాద్‌(నాని), కనగాల పార్వతి, నాగబోయిన శ్రీనివాసరావు, పాలడుగు సంధ్యారాణి, లావణ్య, నాగబోయిన రమణ, తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 2015లో పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో సమస్యలన్నింటినీ పరిష్కరించారు. విద్య, వైద్యంతో పాటు రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని మౌలిక సౌకర్యాలపైనా దృష్టి సారించారు. 2015 మే 2న దత్తత తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో నెలకొన్న సమస్యలను.. ఊరి పెద్దలను అడిగి తెలుసుకుని అన్నింటినీ పరిష్కరిస్తూ వచ్చారు. సొంతూరు అంటే రామోజీరావుకు అమితమైన అభిమానం. అందుకే తన ఊరి ప్రజలు ఏ ఇబ్బందీ పడకుండా ఉండేందుకు.. ఏమేం కావాలో అన్ని సౌకర్యాలను సమకూర్చారు. అందుకే గ్రామంలో ఎటుచూసినా రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్‌ రహదారులు, నూతన భవనాలే దర్శనమిస్తున్నాయి.


రూ.16.5 కోట్లతో అభివృద్ధి పనులు

పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ రూ.16.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించారు. మంచి నీటి సరఫరా కోసం ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేశారు. గ్రామంలో అన్ని దారులను సీసీ రోడ్లుగా మార్చారు. ఒకప్పుడు తాము మట్టి రోడ్లపై బురదలో తిరిగేవాళ్లమని, ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు తమ ఊరిలో రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయంటే ఆ ఘనత రామోజీరావుకే దక్కుతుందంటూ గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. విద్యుత్తు స్తంభాలు వేసి, వీధి దీపాలు వెలిగించారు. పశువుల ఆసుపత్రి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలకు రెండు అధునాతన భవనాలను నిర్మించారు. గ్రామంలోని రెండు శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు. వీఆర్వో కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దారు. విజయవాడ-గుడివాడ ప్రధాన రహదారితో గ్రామాన్ని అనుసంధానించేలా సీసీ రోడ్డు వేశారు. రహదారులకు ఇరువైపులా ఉద్యానాల మాదిరిగా మొక్కలు నాటించారు. చిన్నప్పటి నుంచి తమతో కలిసి ఆడుకున్న వ్యక్తి ప్రపంచం మెచ్చే స్థాయికి చేరుకోవడం చూసి తాము ఎంతో గర్వించేవాళ్లమని, ఈ రోజు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామంటూ బాల్యమిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత డబ్బులతో ఊరి కోసం రామోజీరావు ఎంతో చేశారని, ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లు చాలా అరుదుగా ఉన్నారంటూ కొనియాడారు.


నా మిత్రుడు లేడంటే నమ్మలేకపోతున్నా..

- పాలడుగు చంద్రశేఖర్, బాల్య స్నేహితుడు, పెదపారుపూడి

నా మిత్రుడు రామోజీరావు లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన మృతి నన్నెంతో కలిచివేసింది. మా ఊరి బడిలోనే కలిసి చదువుకున్నాం. ఆయనకు చదువంటే చాలా ఇష్టం. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరిని మరచిపోలేదు. గ్రామాన్ని ఆయన సొంత డబ్బులతో తీర్చిదిద్దారు. ఇంటింటికీ కుళాయిలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. రోడ్లు, పాఠశాల భవనాలు నిర్మించారు. వాటన్నింటినీ ప్రజలకు అంకితమిచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ వాటన్నింటిపై పర్యవేక్షణ ఉంచి.. ఎప్పుడు ఏ అవసరమొచ్చినా తీరుస్తున్నారు. అలాంటి రామోజీరావు మృతి మా గ్రామానికి తీర్చలేని లోటే.


రామోజీరావు మహా పురుషుడు 

- చెరుకూరి వెంకటరత్న గిరిబాబు, బంధువు, పెరిశేపల్లి

మా సోదరుడు రామోజీరావు మహా పురుషుడు. అలాంటివారు ఈ భూమిపై అరుదుగా ఉంటారు. క్రమశిక్షణ ఆయన నైజం. మా తాతయ్య బుజ్జియ్య, వారి తాతయ్య రామయ్య అన్నదమ్ములు. వారి తాతగారు పెరిశేపల్లి నుంచి పెదపారుపూడి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. బంధువులంటే రామోజీరావుకు చాలా అభిమానం. ఎప్పుడు కలిసినా చాలా ప్రేమ, ఆప్యాయత చూపేవారు.


ఆయన వల్లే గ్రామం రూపురేఖలు మారిపోయాయి

- పి. శివప్రసాద్, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, పెదపారుపూడి

రామోజీరావు లాంటి వ్యక్తి పెదపారుపూడిలో జన్మించడం మా గ్రామం చేసుకున్న అదృష్టం. ఆయన వల్లే మా ఊరి రూపురేఖలు మారాయి. ఆయనను ఎప్పుడు కలిసినా.. గ్రామానికి ఏమేం కావాలో అన్నీ రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేయించుకోమని చెప్పేవారు. ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా మాలో ఒకరిగా మసులుకోవడం చాలా గొప్ప విషయం. ఆయనను ఒకసారి కలిసినప్పుడు ఎంతో సమయం మా కోసం వెచ్చించారు. మాతోనే కలిసి భోజనం చేశారు.


సొంత డబ్బుతో గ్రామానికి సేవ చేశారు

వర్ల కుమార్‌రాజా, పామర్రు ఎమ్మెల్యే

ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసింది. రామోజీరావు తెలుగు రాష్ట్రాలు, దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన ఆయన.. తెలుగు ప్రజల ఆస్తి. సొంత డబ్బుతో పెదపారుపూడి గ్రామానికి ఎన్నో సేవలందించారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు