Ramoji Rao: మీ స్ఫూర్తి.. అజరామరం!

చెమ్మగిల్లిన కళ్లతో.. బరువెక్కిన గుండెలతో.. బాధాతప్త హృదయాలతో మహామనిషికి జనం కన్నీటి వీడ్కోలు పలికారు. అక్షరయోధుడు..  అనితర సాధ్యుడు రామోజీ గ్రూపు సంస్థల  అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో జరిగాయి.

Updated : 10 Jun 2024 08:55 IST

వేల మంది అశ్రునయనాల మధ్య రామోజీరావు అంత్యక్రియలు
అంతిమ సంస్కారాలు నిర్వర్తించిన తనయుడు కిరణ్‌
పార్థివదేహాన్ని మోసి.. నివాళులు అర్పించిన చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఏపీ నుంచి ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల హాజరు
ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో కుటుంబ సభ్యులు, సిబ్బంది, అభిమానుల శ్రద్ధాంజలి
ఈనాడు - హైదరాబాద్‌

ఆత్మ సఖుడా.. సెలవిక!

ప్రతి రోజుటికి మల్లే...
ఉషోదయంతో సత్యం ఉదయించింది...
చూట్టానికి మాత్రం
ఆయన లేరు!

నిత్యం ఉషాకిరణాలకు ముందే...
అక్షర కిరణాలు పొడిచాయ్‌
కానీ చదివేందుకు
ఆయన లేరు....!

రామోజీరావు అమర్‌రహే..!
జోహార్‌ రామోజీ..!
అంటూ... ఆప్తజనమంతా
ఆవేదనను దిగమింగుకుంటూ
నినదిస్తుంటే... పూలవర్షం కురిపిస్తుంటే...

తానిన్నాళ్లూ ఆప్యాయంగా
చెక్కిళ్లు ముద్దాడుతూ ఆడుకున్న
మనవడు, మనవరాళ్లు....

ఇప్పుడు ఆఖరిసారిగా...
తన బుగ్గలు నిమురుతుంటే
కుటుంబ సభ్యులంతా బరువెక్కిన గుండెలతో రోదిస్తుంటే...

ఫిల్మ్‌సిటీలోని తన అపురూప గిరివాసం నుంచి...
తెలుగువారి ఆత్మ సఖుడు... ఆఖరి ప్రస్తానానికి కదిలాడు!

చినుకులారాలి... వరదలా పొంగి
అభిమానులు... ముందూ వెనకా పోటెత్తి... 
అమర్‌ రహే అంటుంటే...
తనకిష్టమైన ఈటీవీ, ఈనాడు... కార్యాలయాలను
చివరిసారిగా స్పృశిస్తూ.... సాగిన ఆ అంతిమ యాత్రలో ఆయనొక్కడే మౌనముని!

వినువీధి నుంచి...
వీక్షించారో
కనిపించని గాలిలా అల్లుకున్నారో...
యోగిలా... నిశ్చలమై... నిశ్శబ్దమై భౌతిక ప్రపంచాన్ని వీడిన ఆయన... అక్కడున్న వేలమందిలోనే కాదు...
ఎక్కడెక్కడి నుంచో బుల్లితెరపై
వీక్షిస్తున్న లక్షలమంది మదిమదిలో నిండారు!

ఆప్తజనం... ఆభిమాన సంద్రం
కన్నీటిలో తడుస్తూంటే...
ఆత్మీయ సహచరులు
ఆఖరిసారిగా...
చేతులపై పైకెత్తి
ఆయనే నిర్మించుకున్న స్మృతివనంలో
అంతిమ క్షణాలకు సిద్ధం చేసిన వేళ...

చిన్నప్పుడు గుండెలపై ఆడించుకున్న వారసుడు... బరువెక్కిన గుండెతో
శాస్త్రోక్తంగా... అంతిమ సంస్కారాన్ని నిర్వర్తించగా...

ధవళవస్త్రాల్లోంచి....
ధగధగలాడుతూ
ప్రజ్వరిల్లిన
ఆ అగ్నిశిఖ...
అనంతవాయువుల్లో లీనమై
వాయుగానమై...
పంచభూతాల సాక్షిగా...
ప్రకృతిలో మమేకమైంది!

మీరు లేని మీ తలపు ఉంది...
వేనవేల మనసుల్లో!
మీరు లేని మీ స్ఫూర్తి ఉంది
తెలుగు జాతి గుండెల్లో!

ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో రామోజీరావుకు తుది నివాళులు

చెమ్మగిల్లిన కళ్లతో.. బరువెక్కిన గుండెలతో.. బాధాతప్త హృదయాలతో మహామనిషికి జనం కన్నీటి వీడ్కోలు పలికారు. అక్షరయోధుడు..  అనితర సాధ్యుడు రామోజీ గ్రూపు సంస్థల  అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో జరిగాయి. ఐదు దశాబ్దాలుగా తెలుగు పత్రికారంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన అక్షర సూరీడు.. రామోజీరావుకు  కడసారి నివాళి అర్పించేందుకు అతిరథ మహారథులు, ఆత్మీయులు, మిత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు తరలి వచ్చారు. రామోజీరావు అమర్‌రహే.. జోహార్‌ రామోజీరావు.. నినాదాల నడుమ 4 కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్ర అనంతరం రామోజీరావు అంత్యక్రియలను కుమారుడు, ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ నిర్వహించారు.

అంతిమ సంస్కారం నిర్వహిస్తున్న రామోజీరావు కుమారుడు కిరణ్‌. పక్కన మనవడు సుజయ్‌

తెలుగు పత్రికారంగ చరిత్రలో ఒక మహోన్నతుడి శకం ముగిసింది. అయిదు దశాబ్దాలపాటు అక్షరాస్త్రాలు సంధించడంలో తనదైన ధీరోధాత్తతను ప్రదర్శించిన మీడియా మొఘల్‌ రామోజీరావుకు కుటుంబసభ్యులు, అభిమానులు, ఉద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు.. కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ఆ మహామనిషి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రామోజీరావు పార్థివదేహాన్ని.. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు స్వయంగా మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సహా పలువురు నివాళి అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రజత్‌ భార్గవ, సాయిప్రసాద్, ఆర్పీ సిసోదియాలు నివాళి అర్పించారు. శనివారం తెల్లవారుజామున రామోజీరావు అస్తమించగా.. పార్థివదేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ కార్యాలయంలో ఉంచారు. ఒకరోజు అనంతరం ఆదివారం ఉదయం పార్థివ దేహాన్ని కార్పొరేట్‌ కార్యాలయం నుంచి రామోజీరావు నివాసానికి తీసుకెళ్లారు. ఉదయం 9.30 గంటల సమయంలో పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమయాత్ర ఆరంభమైంది. పూలతో అలంకరించిన వాహనంలో ఆయన పార్థివదేహాన్ని తరలించారు. రామోజీరావు నివాసం నుంచి దారిపొడవునా అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఉద్యోగుల అశ్రునయనాల మధ్య ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు, ప్రియా ఫుడ్స్‌ కార్యాలయాల మీదుగా అంతిమయాత్ర సాగింది.

 రామోజీరావు పార్థివదేహాన్ని మోస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, 

రామోజీగ్రూప్‌ ఉన్నతోద్యోగులు ఐ.వెంకట్, కె.ఎస్‌.ఎన్‌.మూర్తి, కె.బాపినీడు, ఎం.నాగేశ్వరరావు తదితరులు

దారి పొడవునా  ‘జోహార్‌ రామోజీరావు’ నినాదాలు

రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానులు దారిపొడవునా ‘జోహర్‌ రామోజీరావు’ అంటూ నినదించారు. నివాసం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరమున్న స్మృతివనం వరకు సాగిన యాత్రలో అడుగడుగునా ఆయన అభిమానులు, ఉద్యోగులు నీరాజనాలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఇష్టమైన ఛైర్మన్‌కి వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దారిపొడవునా వాహనం వెంట పరుగెడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. మార్గం మధ్యలో అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కి అంతిమయాత్రలో పాల్గొన్నారు. రామోజీరావును కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

నివాళులు అర్పిస్తున్న భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. చిత్రంలో రామోజీరావు కుటుంబ సభ్యులు

అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు

ఆదివారం ఉదయం స్మృతివనం వద్దకు పలువురు ప్రముఖులు భారీగా తరలివచ్చి నివాళులు అర్పించారు. భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, భారాస ఎంపీలు కేఆర్‌ సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు హాజరయ్యారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కొలుసు పార్థసారథి, కాలవ శ్రీనివాసులు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, సుజనా చౌదరి, ఆరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, కొల్లు రవీంద్ర, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ్, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, మర్రి శశిధర్‌రెడ్డి, పువ్వాడ అజయ్, మండవ వెంకటేశ్వరరావు, దేవినేని ఉమాతోపాటు మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, లగడపాటి రాజగోపాల్, వి.హనుమంతరావు, కనుమూరి బాపిరాజు, కంభంపాటి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సినీ ప్రముఖులు మురళీమోహన్, డి.సురేశ్‌బాబు, బోయపాటి శ్రీను, శ్యాంప్రసాద్‌రెడ్డి, నటులు వేణు, బండ్ల గణేష్‌ పాల్గొన్నారు.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఈనాడు ఎండీ కిరణ్‌. చిత్రంలో రామోజీరావు మనవడు సుజయ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల తదితరులు

రాజస్థాన్‌ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ గులాబ్‌ కొఠారి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ కొఠారి రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు. ఏపీ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గౌతం సవాంగ్, ఏపీ మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి సిద్ధార్థ జైన్, రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అంజనా సిన్హా నివాళి అర్పించారు. తెదేపా నేతలు పట్టాభి, కోటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు బొల్లినేని భాస్కరరావు, గూడపాటి రమేశ్, నరేంద్రనాథ్, గురవారెడ్డి, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ వరప్రసాద్‌ రెడ్డి, బిల్డర్స్‌ అసోసియేషన్‌ మాజీ ఛైర్మన్‌ బొల్లినేని శీనయ్య సహా నివాళి అర్పించారు. 

 రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలు..


దేశం గొప్ప దార్శనికుణ్ని కోల్పోయింది

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతితో భారతదేశం, తెలుగు మీడియా ఓ గొప్ప దార్శనికుడిని కోల్పోయింది. ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, చేసిన సేవలు మన మనసులపై చెరగని ముద్ర వేశాయి. రామోజీరావు కుమారుడు కిరణ్‌ చెరుకూరి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 

 హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌  జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ 


ఎవరన్నారు మీరు లేరని?

తెలుగువారి ప్రతి జీవితంలో మీ స్ఫూర్తి ఉంది. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. భౌతికంగా లేకపోవచ్చు కానీ.. ప్రజా జీవితాల్లో మీరు నింపిన వెలుగులు ఎప్పటికీ జ్వలిస్తూనే ఉంటాయి. అందుకే మీకు మరణం లేదు. 

 డి.ఎన్‌.ప్రసాద్, ఈనాడు తెలంగాణ ఎడిటర్‌  


కోట్ల మంది జీవితాలను స్పృశించిన రామోజీరావు: సర్వోదయ ట్రస్టు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు విలువలతో కూడిన జీవన సూత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగువారి జీవితాలను స్పృశించారని సర్వోదయ ట్రస్టు (విజయవాడ) అధ్యక్షులు జి.వి.మోహన్‌ ప్రసాద్‌ అన్నారు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని, ఆయన స్మృతి తరతరాలుగా నిలిచిపోతుందన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం ట్రస్ట్‌ అధ్యక్షుడు మోహన్‌ ప్రసాద్, సభ్యులు మట్టా జయకర్, యూకేకు చెందిన వైద్యులు నగేష్‌ చెన్నుపాటి తదితరులు రామోజీరావుకు నివాళి అర్పించారు. 


ఆయన దార్శనికత  ఎందరికో స్ఫూర్తి: ఐఆర్‌ఈఏ

రామోజీరావు దార్శనికత, అంకితభావం అనేకమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ఐకార్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఐఆర్‌ఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది. రామోజీరావు మృతిపై అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు పీఎస్‌పీవీ విద్యాసాగర్, ఎ.మల్లారెడ్డి సంతాపం తెలిపారు. వివిధ రంగాల్లో విశేషమైన విజయాలు సాధించి.. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్తగా రామోజీరావు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. 


అవిశ్రాంత శ్రామికుడు రామోజీరావు: అరసం

సాధారణ కుటుంబంలో పుట్టి బహుముఖ ప్రజ్ఞతో అసాధ్యాలను సుసాధ్యం చేసి పట్టుదలకు మారుపేరుగా నిలిచిన రామోజీరావు తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేశారని తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కొనియాడింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పల్లేరు వీరస్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాపోలు సుదర్శన్, నేతలు బొమ్మగాని నాగభూషణం తదితరులు ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఈనాడుతో పాటు అన్నదాత, చతుర, విపుల, తెలుగువెలుగు పత్రికలు ఆయావర్గాల ఆదరణ పొందాయని గుర్తుచేశారు. 


పాత్రికేయులకు రామోజీరావు దారి దీపం: ఏపీజేఏసీ అమరావతి

రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని, పాత్రికేయులకు ఆయన దారి దీపమని ఏపీజేఏసీ అమరావతి నాయకులు కొనియాడారు. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తదితరులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమాజానికి ఆయన నిరుపమాన సేవలు చేశారని పేర్కొన్నారు. వైఫల్యాల్ని విజయాలుగా మార్చుకున్న గొప్పధీరుడని కొనియాడారు.


భవిష్యత్తు తరాలకు మార్గదర్శి: ఏపీఎస్‌వీఆర్‌వో గ్రేడ్‌-2 అసోసియేషన్‌ 

భవిష్యత్తు తరాలకు రామోజీరావు మార్గదర్శి అని ఏపీఎస్‌వీఆర్‌వో గ్రేడ్‌-2 అసోసియేషన్‌ కొనియాడింది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిమ్మలపూడి సుధాకర్‌చౌదరి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మారుమూల కుగ్రామాల్లోని సమస్యల్ని సైతం ‘ఈనాడు’ ద్వారా ప్రభుత్వాల దృష్టికి ఆయన తీసుకువెళ్లి పరిష్కరించారని పేర్కొన్నారు.


నా హృదయం బాధతో నిండిపోయింది 

తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం
పార్థివదేహాన్ని మోసిన చంద్రబాబునాయుడు 

రామోజీ అంతిమయాత్రలో  తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబునాయుడు..  సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణితో కలిసి పాల్గొన్నారు. రామోజీరావు  పార్థివదేహాన్ని స్మృతివనానికి తరలించే సమయానికి చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. స్మృతివనం ప్రధాన ద్వారం నుంచి స్మారక కట్టడం వరకు పార్థివదేహాన్ని మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న ఆయన.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీరావు పార్థివదేహానికి  పూలతో నివాళులు అర్పించారు.

ఈనాడు డిజిటల్, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆ మహనీయుడి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శిగా నిలుస్తూ ముందుకు నడిపిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ‘‘అక్షర యోధుడి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావుకు కడసారి వీడ్కోలు పలికాను. నా హృదయం బాధతో నిండిపోయింది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు. రామోజీరావు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న వీడియోను ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 


అధికార లాంఛనాలతో  అంత్యక్రియలు

స్మృతివనంలో రామోజీరావు పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, ఎల్‌బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్‌లు.. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామోజీరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీ నుంచి స్మృతివనానికి తరలించిన అనంతరం శ్రాద్ధకర్మలు పూర్తయ్యాక పోలీస్‌ సిబ్బంది గౌరవవందనం సమర్పించారు. పోలీస్‌బృందం మూడు రౌండ్లు గాల్లోకి తుపాకులు పేల్చి అధికార లాంఛనాలను నిర్వహించింది. 


రామోజీరావుకు ప్రవాసాంధ్రుల నివాళి

వాషింగ్టన్‌ డీసీలో సంతాప కార్యక్రమం

రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సుబ్బారావు, సురేఖ, కృష్ణ తదితరులు 

ఈనాడు డిజిటల్, అమరావతి: పత్రికా, సినీ, వ్యాపార రంగాల్లో విలువలకు ప్రాధాన్యమిస్తూ.. క్రమశిక్షణ, నిబద్ధతలే ఆస్తిగా నిలిచిన అక్షరకృషీవలుడు రామోజీరావు అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఆదివారం సంతాప కార్యక్రమం నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి కీర్తిని దేశవిదేశాల్లో ఆయన నిలబెట్టారని.. ఈనాడు, తెలుగు వెలుగు, చతుర, విపుల, బాలభారతం పత్రికల ద్వారా తెలుగుభాషకు కొత్త సొబగులు అద్దారని కొనియాడారు. ‘‘తెలుగుజాతి ముద్దుబిడ్డలైన ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలి. ప్రజారాజధానికి అమరావతి పేరు పెట్టడంలో రామోజీరావు ప్రేరణ ఉంది. అమరావతి రైతుల ఉద్యమానికి తన కలం, గళంతో ఆయన బాసటగా నిలిచారు. అందుకే అమరావతిలో ఓ ప్రాంతానికి రామోజీరావు పేరు పెట్టాలి. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి’’ అని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణ లాం, తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్‌ చింతా, భాను మూగులూరి, సురేఖ చనుమోలు, శ్రీనివాస్‌ చావలి, రమాకాంత్‌ కోయ, సుధీర్‌ కొమ్మి, రవి అడుసుమిల్లి, సుశాంత్‌ మన్నె, ఉమాకాంత్, చక్రవర్తి పయ్యావుల, రమేశ్‌ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు.

 ఫిల్మ్‌సిటీలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ప్రజానీకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని