Ramoji Rao: రామోజీ లాంటి లెజెండ్‌లకు మరణం ఉండదు

రామోజీరావు మరణం అసలు ఊహించలేదు. ఆయన గొప్ప విజనరీ. బాలనటుడిగా, కథానాయకుడిగా ఆయన మార్గదర్శకత్వంలో పరిచయం కావడం నా అదృష్టం. వారికి జీవితాంతం రుణపడి ఉంటా.

Published : 09 Jun 2024 07:04 IST

నివాళులు అర్పిస్తున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు. చిత్రంలో ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌లు డి.ఎన్‌.ప్రసాద్, ఎం.నాగేశ్వరరావు


రామోజీరావు మరణం అసలు ఊహించలేదు. ఆయన గొప్ప విజనరీ. బాలనటుడిగా, కథానాయకుడిగా ఆయన మార్గదర్శకత్వంలో పరిచయం కావడం నా అదృష్టం. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. రామోజీ లాంటి లెజెండ్‌లకు మరణం ఉండదు. మన హృదయాల్లో నిలిచి ఉంటారు.

నటుడు తరుణ్‌


ఎంతో మందికి నీడగా.. అండగా ఉన్న రామోజీరావు అనే మహావృక్షం పడిపోయిందంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. దాదాపు 25ఏళ్లు ఈటీవీ ఛానల్లో నాన్నగారితో ‘పాడుతా తీయగా’ అనే ఒక గొప్ప కార్యక్రమం పట్టుదలతో జరిపించారు రామోజీ. నాన్న తర్వాత కూడా ఆ కార్యక్రమం అలా కొనసాగాలని నాకు ఆ మైక్‌ అందజేశారు.

గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ.చరణ్‌ 


క్రమశిక్షణతో ఎలా బతకాలో రామోజీ నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోం. మేమే కాదు, భావితరాలు కూడా మీ పేరును గుర్తుంచుకుంటాయి.

నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌


రామోజీరావు మరణం మన దేశానికి తీరని నష్టం. ఒకప్పుడు కోట్ల మందిలో సామాన్యుడు. ఇప్పుడు అదే కోట్ల మందికి మార్గదర్శకుడు. సినిమాల్లో నాకు ఎంత పేరు వచ్చిందో.. ‘వావ్‌’ ద్వారా అంతే పేరొచ్చింది.

నటుడు సాయికుమార్‌


సమాజంలో మానవ ధర్మాలు, నీతీ నిజాయితీలు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపిన మహానుభావుడు రామోజీరావు. తాను నమ్మిన నీతి నిజాయితీలను జీవితాంతం కొనసాగించారు. ఈనాడులో వార్త వచ్చిందంటే అది నిజమని నమ్మకం కలిగించిన గొప్ప వ్యక్తి.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 


కీర్తిని మాత్రమే వదిలేసి రామోజీరావు స్వర్గస్తులయ్యారు. ఆయన కారణజన్ముడు. మన వల్ల.. మనం స్థాపించిన సంస్థల వల్ల పది మందికి ఉపాధి కల్పించడమన్నది సామాన్యమైన విషయం కాదు. లక్షల కుటుంబాలకు ఆయన అన్నం పెట్టారు. ఆ కీర్తిని మించింది లేదు. ఆయన మేరు పర్వతం. కారణజన్ముడు. వారు చూపిన బాటలో నడుస్తూ పది మందికి సాయపడటమే మనం చేయాల్సింది.

నటుడు శివాజీ


రామోజీరావు ఇక లేరన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నా. నాకు మా నాన్న, రామోజీ మార్గదర్శకులు. వీళ్లంతా కష్టాన్ని నమ్ముకొని జీవించారు. అందరూ వీరి మార్గాల్లో నడవాలని ఆకాంక్షిస్తున్నా.

నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌


నేనెప్పుడూ చెబుతూ ఉంటా. అలెగ్జాండర్‌ ది గ్రేట్‌.. రామోజీ ది గ్రేట్‌. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. నేను, రాజ్‌ ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్లో చిత్రాలకు పనిచేశాం. ‘నువ్వే కావాలి’ చిత్రానికి సోలోగా అవకాశం ఇచ్చారు. సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ రోజున నన్ను ఎంతో మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

సంగీత దర్శకుడు కోటి


‘రామోజీరావు ఒక లెజెండ్‌. ఆయన్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది. నా జీవితానికి ఆయనే స్ఫూర్తి. ఒక వ్యక్తిగా వారి నుంచి చాలా నేర్చుకున్నా. ఇప్పుడాయన భౌతికంగా లేకున్నా ఈనాడు పత్రిక.. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఉన్నన్ని రోజులూ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటారు.

దర్శకుడు గోపీచంద్‌ మలినేని 


రామోజీరావు ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తులకు చావుండదు.

నటుడు మంచు మనోజ్‌


రామోజీరావు ఒక అద్భుతం. స్వయం కృషితో తెలుగు జాతి గర్వించదగ్గ ఎన్నో సామ్రాజ్యాలను స్థాపించారాయన. ఆయన ఏది స్థాపించినా అది నం.1 గా ఉండాలన్న లక్ష్యంతో, తపనతో ఉండేవారు.

నిర్మాత అచ్చిరెడ్డి


ఎవరి ఊహలకూ అందని విధంగా ఒక ఫిల్మ్‌ సిటీని నిర్మించి.. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఏ రంగంలోకి అడుగు పెట్టినా అసాధ్యమైన విజయాలు అందుకున్నారు. కానీ, ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవారు. వారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

నటి ఇంద్రజ


రామోజీరావు మా కళాకారులందరికీ దేవుడు. తెలుగు భాష కోసం పంచ ప్రాణాలు పెట్టి.. తెలుగుకు ఎంతో వెలుగు తెచ్చిన మా తెలుగువాడు. 

నటి అన్నపూర్ణమ్మ


రామోజీరావు చాలా గొప్ప వ్యక్తి. మహానుభావుడు. ఆ మహావృక్షం నీడలో కొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందాయి. ఒక స్వచ్ఛమైన సమాజం కోసం జీవితాంతం కష్టపడ్డారు. పోరాటం చేశారు. నా దృష్టిలో ఆయనొక నిఘంటువు. నన్ను వారెంతో ప్రభావితం చేశారు. నేను ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయన కలల్ని.. ఆశయాల్ని కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళతారని నమ్ముతున్నా.

నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి


ప్రతి పదంలో సత్యం, ప్రతి పుటలో నైతికత నింపిన ఆయన జీవితం తెలుగు జాతికి ఒక అనంత కాలపు బహుమతి. సమాజపు విలువల్ని కాపాడిన ఆ నిరంతర రక్షకుడు, తెలుగు భాషా ప్రేమికుడు, మీడియా మహారాజు, గొప్ప మార్గదర్శి రామోజీరావు ఆత్మకు పరిపూర్ణ శాంతి కలగాలి.

దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి


రామోజీరావు అంటే ఒక అక్షరాకాశం.. ఒక స్ఫూర్తి శిఖరం. విలువల జలపాతం. ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ విలువలు కోల్పోలేదు. ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వారి సంస్థలోని ఓ కార్యక్రమంలో నేను భాగస్వామినైనందుకు ఎంతో గర్వపడుతున్నా.

రచయిత చంద్రబోస్‌


అక్షరాన్ని ఆయుధంగా మార్చి.. నిరంతరం పోరాడి.. ప్రజలను కాపాడిన తృప్తితో రామోజీరావు దివికేగారు. ప్రతిఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచిన పద్మవిభూషణుడు, కృషీవలుడు. ఆయన మృతి రామోజీ గ్రూప్‌ సంస్థలకు చెందిన వారితోపాటు దేశవ్యాప్తంగా కోట్ల మందిని బాధకు గురిచేసింది.

నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌


రామోజీరావు మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన వారసత్వం చాలా మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

నటి కాజల్‌ అగర్వాల్‌


ఒక లెజెండ్, సినీ ప్రపంచంలో అగ్రగామి, రామోజీ ఫిల్మ్‌ స్టూడియో వ్యవస్థాపకులు రామోజీరావు మృతికి ప్రగాఢ సానుభూతి.

నటి ఖుష్బు


రామోజీరావు మరణం జర్నలిజంతో పాటు చిత్ర పరిశ్రమలో ఒక శూన్యతను మిగిల్చింది.

నటుడు వరుణ్‌ తేజ్‌


రామోజీరావును కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. 2012 నుంచి 2016 వరకు సింఫనీ రికార్డింగ్‌ స్టూడియోలో మా సంగీత కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన మాకు ఉత్తమ రికార్డింగ్, సాంకేతిక సహాయాన్ని అందించారు.

సంగీత దర్శకుడు తమన్‌


‘‘నా జీవితంలో నేను అందుకున్న తొలి చెక్‌ రామోజీరావుదే. ఆయన కారణజన్ముడు. ఎన్టీఆర్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకొనే వ్యక్తి రామోజీ. వారిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. తెలుగు పత్రికా రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఆయన చేసిన సాహసం గురించి ఎంత చెప్పినా తక్కువే. రామోజీ ఫిల్మ్‌ సిటీ కన్నా ఉత్తమ స్టూడియో దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా లేదు’’.

సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్‌ 


పత్రికా రంగ లెజెండ్, రామోజీరావు పాత్రికేయ విలువలకు గొప్ప అర్థం చెప్పిన వ్యక్తి. ప్రధాని ఇందిరా గాంధీ అత్యయిక పరిస్థితిని విధించిన సమయంలో సామాన్యుడు తన భావ ప్రకటనా స్వేచ్ఛను వెల్లడించడానికి భయపడే తరుణంలోనూ నిజాలు నిర్భయంగా బయటపెట్టిన ఏకైక పత్రికగా ఈనాడును చూశాను. ఆయనను కోల్పోవడం తెలుగు జాతికి, పత్రికా ప్రపంచానికి తీరని లోటు.

నటుడు, నిర్మాత నాగబాబు


తెలుగు వారందరికీ గర్వకారణం.. స్ఫూర్తిదాయకం రామోజీరావు. నాలాంటి గాయకులు ఎంతో మందికి ‘పాడుతా తీయగా’ ద్వారా ఓ వేదిక కల్పించారు.

గాయని ఉష


ఓ చిన్నస్థాయి నుంచి శిఖరాగ్రానికి చేరుకున్న గొప్ప దార్శనికుడు రామోజీరావు. ఆయన ఎదగడమే కాకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. నాకు సినీ జీవితాన్నిచ్చింది ఆయనే.

దర్శకుడు శ్రీను వైట్ల


రామోజీరావును ఇష్టపడే కోట్ల మందిలో నేనూ ఒకణ్ని. ఆయనొక నిండు కుండ. ఎన్నో లక్షల మందికి భోజనం పెడుతున్నారు. వారిలాంటి వ్యక్తులు అరుదుగా పుడతారు. నిజంగా ఆయన కారణజన్ముడు. ఒక యుగ పురుషుడు.

నటుడు బాబు మోహన్‌ 


రామోజీరావు మరణం నన్నెంతో బాధించింది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

నటి జయప్రద


భారతీయ ఐకాన్‌.. రామోజీ. జర్నలిజం, సినిమాలు, వినోదంపై ఆయన ప్రభావం శాశ్వతంగా ఉండిపోతుంది. దేశ అభివృద్ధికి రామోజీ గారు చేసిన కృషి ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

నటి కంగనా రనౌత్‌


సినిమా పరిశ్రమకే కాదు.. మీడియాకూ రామోజీరావు మరణం తీరని లోటు. వార్తలు, సినిమాల రూపురేఖల్ని మార్చిన దార్శనికుడు. ఆయన సంపాదించుకున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి


మీడియా ప్రపంచం ఈరోజు ఒక లెజెండ్‌ను కోల్పోయింది. రామోజీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూరినిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌


ఐకాన్, లెంజెడ్‌ రామోజీ రావు ఇక లేరనే వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఈరోజు జెనీలియా, నేను నటులుగా చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్నామంటే ఆయనే కారణం. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే గొప్ప వ్యక్తి ఆయన.

నటుడు రితేష్‌ దేశ్‌ ముఖ్‌


రామోజీరావు ఈనాడు పత్రిక స్థాపించి అటు ప్రజల్లో ఇటు రాజకీయాల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చారు. ‘‘ఈ ఉషాకిరణాలు’’ అంటూ ఎన్నో సందేశాత్మక చిత్రాలు నిర్మించి సమాజాన్ని ప్రభావితం చేశారు. రామోజీ ఫిల్మ్‌ సిటీతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక బ్రాండ్‌ను తీసుకొచ్చారు. అలాంటి గొప్ప మనిషి దూరమవ్వడం చాలా బాధాకరం.

దర్శకుడు అనిల్‌ రావిపూడి


ఎవ్వరూ ఊహించలేని, నమ్మలేని, అర్థం కూడా చేసుకోలేని భవిష్యత్తును చూసిన నిజమైన దార్శనికుడు రామోజీరావు. తన ఒట్టి చేతులతో అన్నింటినీ నిర్మించి లక్షల మంది జీవితాలపై ఆయన చూపిన ప్రభావం తనని చాలా కాలం పాటు అందరి హృదయాల్లో సజీవంగా ఉంచుతుంది.

నటుడు రామ్‌ పోతినేని


రామోజీరావు ఇక లేరనే వార్త విని చాలా బాధపడ్డా. ఇతరులకు భిన్నంగా ఉండే దార్శనికుడాయన.

నటుడు అల్లరి నరేశ్‌


బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ మీడియా.. చిత్ర రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దార్శనికుడు, ఎంతో మందికి ఆదర్శప్రాయుడు రామోజీరావు.

దర్శకుడు బాబీ 


రామోజీరావు మృతి దేశానికి.. పత్రికా రంగానికి, చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. 

నిర్మాత కె.ఎస్‌.రామారావు


నా సినీ ప్రస్థానం ‘‘తొలి చూపులోనే’ సినిమాతోనే  మొదలైంది. నాలాగే ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. టెలివిజన్‌లోనూ రచయితలు, నటులను పరిచయం చేశారు. ఈనాడు, ఈటీవీల ద్వారా నమ్మకమైన వార్తలను అందించిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి రామోజీ ఫిల్మ్‌ సిటీ గొప్ప ఆస్తి. ఆయన మరణం కలచివేస్తోంది.

నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌


రామోజీరావుతో ‘‘శ్రీవారికి ప్రేమలేఖ’’ చిత్రం నుంచి నాకు అనుబంధం ప్రారంభమైంది. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే ఎక్కడలేని శక్తీ వచ్చేది. ప్రపంచ సినిమాను ఇక్కడకు తీసుకురావాలని రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మించారు. ఇండియాలో యూనివర్సల్‌ స్టూడియో నిర్మించిన గొప్ప వ్యక్తి. 

నటుడు, నిర్మాత వి.కె.నరేశ్‌


రామోజీరావు మరణం చాలా బాధాకరం. ఆయనను కలిసిన ప్రతిసారి ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను. ఆయన తెలివి, ధైర్యం, నాపై చెరగని ముద్ర వేశాయి. సినీ పరిశ్రమకు ఆయనెప్పుడూ అండగా నిలిచారు. జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎంతో మందికి స్ఫూర్తి.

నటుడు మంచు విష్ణు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ 

విలపిస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు