Rare disease: పంజాబ్‌లో వచ్చే అరుదైన వ్యాధి ఏపీలో..

పంజాబ్‌లో మాత్రమే కనిపించే ఓ వ్యాధి ఉనికి రాష్ట్రంలో కనిపించడం కలకలం రేపుతోంది. సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 28 May 2024 06:50 IST

ఇద్దరు చిన్నారుల్లో ‘సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌’ గుర్తింపు 

వివరాలు తెలుపుతున్న గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు 

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: పంజాబ్‌లో మాత్రమే కనిపించే ఓ వ్యాధి ఉనికి రాష్ట్రంలో కనిపించడం కలకలం రేపుతోంది. సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ విభాగం వైద్యులు ప్రయోగశాలలో రక్తపరీక్ష చేయగా.. వారు సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. చాలా అరుదైన ఈ సమస్యకు ఎముక మజ్జ (మూలకణ) మార్పిడి చికిత్స ఒక్కటే సరైన పరిష్కారం. ఈ చికిత్స ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదు. తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుంది’ అని కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ వ్యాధి గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పెథాలజీ విభాగం అధిపతి అపర్ణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని