Duvvuri Subbarao: ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి

మనది వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అభివృద్ధి రేటు 7 శాతం అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు.

Updated : 15 May 2024 09:44 IST

అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు
కేంద్రం, రాష్ట్రాలు పేద ప్రజలు, పేదరికం స్వభావాన్ని గమనించాలి
ఆ దృక్కోణంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి  
ఐఏఎస్‌లకు ప్రజా ప్రయోజనాలే గీటురాయి కావాలి
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రాలు, కేంద్రం సంక్షేమ కార్యక్రమాలు, తక్షణ సాయానికి నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నా... ఆరోగ్యం, విద్య మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టడం లేదు. వాటిపైన దృష్టి కూడా లేదు. పేద ప్రజలు, పేదరికం స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఈరోజు గడిచిపోతే చాలనుకొనే విధంగా వ్యవహరిస్తే విద్య, ఆరోగ్యం ఎప్పటికీ వారికి తగినంతగా అందవు’ అని రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ 50 ఏళ్లలో సివిల్‌ సర్వీసులో అనేక మార్పులు వచ్చాయని, అన్ని రకాల నేపథ్యాల నుంచి వస్తున్నారని, మహిళల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు. ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి సివిల్‌ సర్వీసుకు ఎక్కువ మంది రావడం మంచి పరిణామం అని తెలిపారు. గోదావరి ఒడ్డున కొవ్వూరులో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ఐఏఎస్‌కు ఎంపికై.. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకులో ఆర్థికవేత్తగా, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా పని చేసిన దువ్వూరి సుబ్బారావు ఆయన జీవిత అనుభవాలతో ‘జస్ట్‌ ఎ మెర్సెనరీ?’ పేరుతో పుస్తకం రాశారు. ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థిగా ఉంటూ సివిల్‌ సర్వీసుకు ఎంపిక కావడం, శిక్షణ పూర్తి చేసుకొని పార్వతీపురంలో సబ్‌ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ పొందడం నుంచి రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా పదవీ విరమణ చేసినంత వరకు ఆయన తన అనుభవాలను అందులో వివరించారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

మీరు సర్వీసులో చేరినప్పటికి, ఇప్పటికి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులో వచ్చిన మార్పులేంటి ?

ఐఏఎస్‌లో చేరి సుమారు యాభై సంవత్సరాలు దాటింది. ఈ యాభై ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. నియామకం, శిక్షణ, కెరీర్‌ మేనేజ్‌మెంట్‌, స్పెషలైజేషన్‌ ఇలా అన్నింటిలోనూ. సర్వీసులోకి వచ్చే అధికారుల సామాజిక-ఆర్థిక బ్యాక్‌గ్రౌండ్‌ మారింది. మేము చేరినప్పుడు 20 నుంచి 25 శాతం మంది అప్పటికే సర్వీసులో ఉన్న వారి పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అన్ని నేపథ్యాల నుంచి వస్తున్నారు. రెండోది మహిళల సంఖ్య అప్పుడు బాగా తక్కువ, ఇటీవల కాలంలో బాగా పెరిగింది. పరీక్ష విధానంతో సహా అనేక అంశాల్లో మార్పులు వచ్చాయి. మేము శిక్షణ పూర్తి చేసుకొని బయటకు వచ్చినపుడు పేదరిక నిర్మూలన ప్రధాన కేంద్రీకరణగా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యం, విద్యా రంగాలపై ఎక్కువ కేంద్రీకరణ ఉంది. జవాబుదారీతనం పెరిగింది. అప్పుడింత ఉండేది కాదు. అప్పుడు నీళ్లు, కరెంటు, రోడ్ల వంటి వాటి విషయంలో ఏం చేసినా ఏం చేయకపోయినా మా బతుకింతే అనుకొనేవారు. ఇప్పుడలా కాదు, డిమాండ్‌ చేసే పరిస్థితి పెరిగింది. సబ్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పని చేసినపుడు స్థానిక సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించినప్పుడు వారు సివిల్‌ సర్వీసు అధికారుల కంటే తక్కువ చదువుకొని ఉండేవారు. వారి కంటే సివిల్‌ సర్వీసు అధికారులు సుపీరియర్‌ అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు పరిస్థితి వేరు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పీహెచ్‌డీలు చేసినవారున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా మేము సమానం అనే అభిప్రాయంతో ఉంటారు. అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. అయితే మారనివి మాత్రం కొన్ని ఉన్నాయి. అంకితభావం, నిజాయతీ, వృత్తినైపుణ్యం అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే. సివిల్‌ సర్వీసు అధికారికి ప్రజల ప్రయోజనాలు ప్రధానంగా ఉండాలి.


మనది వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అభివృద్ధి రేటు 7 శాతం అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే వృద్ధి అవసరం. దానిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు


దీర్ఘకాలిక వృద్ధి కోసం మన దేశం అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలు ఏంటి? మనం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏంటి ?

ఆర్థిక సవాళ్లు అంటే ముఖ్యంగా పెద్ద సమస్య ఉద్యోగాలు. వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. అభివృద్ధి రేటు 7 శాతం అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకు ఉందన్నది ఓ ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే వృద్ధి అవసరం. దానిపై దృష్టి సారించాలి. అభివృద్ధి పెరుగుతోంది కానీ అందరికీ లబ్ధి చేకూరడం లేదు. అసమానతలు పెరుగుతున్నాయి... తగ్గించాలి. కింది స్థాయిలో ఆదాయ వనరులను ఎలా పెంచాలన్నది చూడాలి. అమెరికా ఎందుకు ముందుందంటే అది వినూత్నమైన సమాజం కాబట్టే. అక్కడ ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి గొప్ప కంపెనీలున్నాయి. అలాంటి వినూత్న సమాజం ఏర్పడాలంటే పరిశోధన, ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి.

ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఆర్‌బీఐ గవర్నర్‌ వంటి ఉన్నత స్థానానికి చేరుకోగలగడం ఎలా సాధ్యమైంది? ఈ క్రమంలో మీకు కలిసి వచ్చిన అంశాలేమిటి ?

ఇది దేశం గొప్ప, ఘనత అని చెప్పాలి. పుస్తకంలో ఈ విషయం కూడా రాశా. సమాజం ఈ అవకాశం నాకు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతంలో, మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇలా పైకి వచ్చాను అంటే వ్యవస్థ ఇచ్చిన అవకాశాల వల్లే సాధ్యమైంది. సైనిక్‌ స్కూలులో స్కాలర్‌షిప్‌తో చదివాను. స్కాలర్‌షిప్‌ లేకుంటే నన్ను అక్కడ చదివించే ఆర్థిక స్తోమత మా నాన్నకు లేదు. ఐ.ఐ.టి.లోనూ స్కాలర్‌షిప్‌తో చదివాను. తర్వాత ఐఏఎస్‌లో కూడా. మెరిట్‌ ఆధారంగా, సర్వీసులో నా ట్రాక్‌ రికారు,్డ అనుభవం ఆధారంగా రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా అవకాశం లభించింది. ఏం చదివాము అన్నదాని కంటే ఎంత బాగా దాన్ని ఆకళింపు చేసుకొన్నాం, ఎంత పరిపక్వత వచ్చిందన్నది ముఖ్యం. నాకు వ్యక్తిగతంగా ఈ దేశం, ఈ సమాజం చాలా ఇచ్చాయి.

దేశాన్ని ఐఏఎస్‌ అధికారులే  నడుపుతారనే అభిప్రాయాలను మీరు ఎలా చూస్తారు ?

దేశాన్ని ఐఏఎస్‌ అధికారులే నడుపుతారనడం కొంచెం అతిశయోక్తి. ఒకప్పుడు అది నిజమేనేమో... ఇప్పుడు నేతల్లో కూడా చాలామంది చదువుకున్న వారే ఉంటున్నారు. ఐఏఎస్‌ అధికారులు విధాన పరమైన అంశాలపై వాటి మంచి, చెడులను రాజకీయ నాయకులకు చెప్పాలి. దానిప్రకారం రాజకీయ యంత్రాంగ నిర్ణయాలుంటాయి.

రాష్ట్రంలో పాలనకు, కేంద్రంలో పాలనకు మధ్య తేడాలు ఎలా ఉంటాయి? వాటిల్లో నేర్చుకోదగ్గవి, విస్మరించదగినవి ఏమి ఉంటాయి ?

కొన్ని తేడాలున్న మాట వాస్తవమే. రాష్ట్రంలో సీఎం కేంద్రంగా పరిపాలన సాగుతుంది. సీఎం ఏం చెబితే అదే జరుగుతుంది. అయితే కేంద్రంలో కొన్ని వ్యవస్థలున్నాయి. ప్రధాన మంత్రి తలచుకున్నా.. దానికి కేబినెట్‌ కమిటీ, కార్యదర్శులతో కూడిన వ్యవస్థలు అందులో మంచి చెడులను పరిశీలిస్తాయి. ఆ వ్యవస్థ రాష్ట్రంలో లేదు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడికో వెళ్లి రూ.30 కోట్లు పెట్టి ఆసుపత్రి కట్టిస్తానని హామీ ఇస్తే.. దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని తరువాత ఆలోచిస్తారు. కేంద్రంలో ఇలా చేయడం తక్కువే. రాష్ట్రంలో అధికారుల, రాజకీయ నాయకుల పరిధి పరిమితం. కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి, సర్వీసుల నుంచి వచ్చిన అధికారులుంటారు. వారి నుంచి నేర్చుకునే, నేర్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పనిచేస్తూ కేంద్రానికి వెళ్తే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుని వాటిని తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు అమలు చేయవచ్చు. ఒక రాష్ట్రంలో పని చేసి ఆలిండియా సర్వీసు అంటే సరికాదు. కేంద్రంలో, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేయడం ముఖ్యం. రెండేళ్ల కిందట ఐఏఎస్‌లు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌ మీద వెళ్లాలన్న నిబంధన పెడితే రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాజకీయాల వల్ల అమలు కాలేదు.

ఇటీవల కాలంలో ఐఐటీల నుంచి సివిల్‌ సర్వీసుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరగడానికి కారణమేంటి? దీని వల్ల సర్వీసులో ఎలాంటి మార్పులు సంభవించాయి ?

ఐఏఎస్‌ పరీక్ష రాయడానికి ఎవరికైనా డిగ్రీ ఉంటే చాలు. ఏ సబ్జెక్టు చదివామన్నది ముఖ్యం కాదు. ఐఏఎస్‌ అంటే చదువుకొన్న సబ్జెక్ట్‌లో ఉద్యోగం చేయడం కాదు.. అన్ని అంశాలపైన సమగ్రమైన, లోతైన అవగాహన కావాలి. నాకు ఫిజిక్స్‌ ఆసక్తి కాబట్టి చదివా. సర్వీసులో చేరి నాలుగేళ్లయ్యాక ఇంకా చదివితే బాగుంటుంది అనిపించింది. ముందు ముందు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక శాస్త్రం చదివా. మొదట ఐఐటీల్లో చేరడం అంటే ఇంజినీర్‌ కావాలనే కోరికతో. అప్పుడు ఐఏఎస్‌ అంటే పొలిటికల్‌ సైన్స్‌, లిటరేచర్‌ లాంటివి చదివే వారికి అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఐఐటీలకు వచ్చేది ప్రతిభావంతులు. దేశంలో చదువులో బాగా రాణించగలిగిన వారు అక్కడికి వెళ్తారు. ఐఐటీల్లో చదివే వారు ఇంజినీర్లుగానే కాదు, బాగా రాయగలరు, బాలీవుడ్‌లో నటించగలరు. అన్నిరకాలుగా ప్రతిభ ఉన్న వారు దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. సర్వీసులోకి ఐఐటీల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామం.

ఐఏఎస్‌ అధికారులు నిబంధనలకు లోబడి సర్వస్వతంత్రంగా వ్యవహరించే అవకాశం మీ హయాంలో ఉండేది. ఇప్పుడు అటువంటి స్వేచ్ఛ, స్వతంత్రత ఉందా? రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువైందని, వారు చెప్పినట్లు చేయకపోతే ఐఏఎస్‌లైనా మనుగడ కష్టమనే పరిస్థితులు నెలకొన్నాయి.. ఇది విలువల పతనానికి చిహ్నమే కదా? మీరేమంటారు?

నేను ఆర్‌బీఐ వదిలి పది సంవత్సరాలైంది. ఐఏఎస్‌ వదిలి 15 సంవత్సరాలు. అప్పటికి.. ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఎప్పుడూ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు, రాజకీయ నాయకులకు భిన్నాభిప్రాయాలుండటం సహజం. ఎందుకంటే రాజకీయ నాయకులకు రాజకీయంగా కొన్ని తప్పనివి ఉంటాయి. సివిల్‌ సర్వీసు అధికారులు విధానాలను బట్టి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో బిన్నాభిప్రాయాలు, విభేదాలు తప్పవు. సివిల్‌ సర్వీసు అధికారులు నిష్పాక్షికంగా సలహాలు, సూచనలు ఇవ్వడం ముఖ్యం. అది సివిల్‌ సర్వీసు మౌలిక సూత్రం. రాజకీయ ప్రయోజనాల కోసం ఒత్తిడి చేస్తారు, కానీ సివిల్‌ సర్వీసు అధికారులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా మేనేజ్‌ చేయాలనేది. ప్రతి ఒక్కటీ తిరస్కరించడం సరికాదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేయగలిగింది చేయడం, చేయలేనివి నిరాకరించడం. మనం తీసుకొనే నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు తగ్గట్లుగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అన్నది బేరీజు వేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు కలెక్టర్‌ వ్యాక్సినేషన్‌కు ఓ ప్రణాళిక తయారు చేసుకొని ఉంటారు... ఓ ఎమ్మెల్యే వచ్చి నా నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఇవ్వాలంటారు... దానికి అభ్యంతరం చెప్తామా? సర్దుబాటు చేస్తామా? ఎందుకంటే ఎమ్మెల్యే అడిగింది కూడా ప్రజలకోసమే.

సివిల్‌ సర్వీసు అధికారులు శిక్షణ సమయంలో క్షేత్ర స్థాయికి వెళ్లడంపై అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఏమిటి?

సివిల్‌ సర్వీసు అధికారుల శిక్షణలో అప్పట్లో ఇంత సాంకేతికత లేదు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు వచ్చాయి. అప్పట్లో క్షేత్ర స్థాయికి వెళ్తేగానీ ఏ సంగతీ తెలిసేది కాదు. ఇప్పుడు వెళ్లకుండా ఉన్నచోట నుంచే గమనించవచ్చు. అలాగని సివిల్‌ సర్వెంట్స్‌ క్షేత్ర స్థాయికి వెళ్లకపోతే వాళ్లు సమర్థంగా, ప్రభావవంతంగా పనిచేయలేరు. నేరుగా వెళ్లి ప్రజలతో మాట్లాడటం వల్ల సరికొత్త అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయి పర్యటనలు పనితీరులో మరింత రాణించేందుకు దోహదపడతాయి.

కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీపై ఇప్పటికే విభేదాలు, వివాదాలు ఉన్నాయి. దీనికి సరైన పరిష్కారం ఏమిటి?

మొదట గమనించాల్సింది ఏంటంటే ప్రతి దేశంలోనూ రాష్ట్రాలు, కేంద్రం మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పన్నుల్లో వాటా బదిలీ అయినా, పెట్టుబడులైనా నిష్పాక్షికంగా చేస్తే దేశానికి మంచిది. దేశమంతా ముందుకు వెళ్తుంటే బాగుంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తాము అభివృద్ది చెందాలనే ఆదుర్దా కూడా అర్థం చేసుకోదగినదే. రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడితే దేశానికి కూడా మంచిదే. కేంద్రం తల్లి, తండ్రిలాంటిది. కాబట్టి నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తున్నామనే అభిప్రాయం ప్రజల్లో ఉండేలా చూడాలి. ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, ఎక్కువ డబ్బు ఇస్తున్నారు, పెట్టుబడులు, మౌలిక వసతులు అక్కడికే వెళ్తున్నాయి, ప్రైవేటు పెట్టుబడులను అక్కడికే పంపిస్తున్నారు అనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలి. అది దేశానికి, రాష్ట్రాలకు మంచిది.

మీరు ఉమ్మడి ఏపీలో, కేంద్రంలో, ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌,  ఆర్‌బీఐ తదితర చోట్ల పనిచేశారు.  ఎక్కడ మీకు ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయి?

మూడున్నర దశాబ్దాలు ఐఏఎస్‌ అధికారిగా పని చేశా. ఆ సమయంలోనే బయటకెళ్లి 6 సంవత్సరాలు ప్రపంచ బ్యాంకులో పని చేశా. కెరీర్‌ చివర్లో రిజర్వ్‌ బ్యాంకులో చేశా. ప్రతి ఉద్యోగంలో సవాళ్లు ఉన్నాయి.. ఆకర్షణా ఉంది. సివిల్‌ సర్వీసుకు ఉన్న పెద్ద ఆకర్షణ ఏంటంటే భిన్నమైన పనులు, అనుభవాలు. ప్రైవేటు కంపెనీలో చేరితే అందులోనే పైకి ఎదుగుతారు. కెరీర్‌ ఏ ఫీల్డ్‌లో ప్రారంభించారో అందులోనే ఎదుగుదల ఉంటుంది. ఐఏఎస్‌కు అలా కాదు.. ఈ రోజు డైరెక్టర్‌ ఆఫ్‌ సెరికల్చర్‌, రేపు కలెక్టర్‌, తర్వాత సీఎం సలహాదారు, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాల్లో పని చేస్తారు. అది సంతృప్తినిచ్చే అంశం. ఐఏఎస్‌గా మన నిర్ణయమే ఫైనల్‌ అనడానికి లేదు. కేబినేట్‌ సెక్రటేరియట్‌, ప్రభుత్వం చాలా ఉంటాయి. ఆర్‌బీఐ గవర్నర్‌గా నేనే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ తీసుకొనే నిర్ణయం దేశంలో ప్రజలపై ప్రభావం చూపుతుంది. దీంతో బాధ్యతగా అనిపిస్తుంది, సవాల్‌గాను ఉంటుంది. కానీ ప్రతి ఉద్యోగానికి దాని సొంత ఆకర్షణ, సవాళ్లు ఉన్నాయి.

ఐఏఎస్‌ అధికారులు.. కార్పొరేట్‌ కంపెనీలు, రాజకీయ నాయకులతో సంబంధాల్లో రేఖ గీయాల్సిన అవసరం గురించి గతంలో ఉదహరించారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ గీతను పూర్తిగా తుడిచేసిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది కదా! రాజీ పడడం, నాకిది నీకిది వంటివి పెరిగాయి, ఏమంటారు?

ప్రజా ప్రయోజనం అనే అంశం చుట్టూ గీత గీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వ్యక్తిగతమైంది కూడా. కొంతమంది ఏం తినను, ముట్టను, ఆఫీసు, ఇల్లు అనుకొంటారు.. ఇదో రకం. నేను మర్యాద కోసం కొన్నింటికి వెళ్తాను అనే వాళ్లు ఇంకో రకం. కానీ వృత్తిలో తేడా ఏమీ ఉండదు. అసలు వెళ్లడం సరికాదనుకొనేవారుంటారు. అందువల్ల ఎక్కడ గీత గీసుకోవాలనేది వ్యక్తిగత అంశం. తమ హోదాకు తగినట్లుగా గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం.


ఐఏఎస్‌ అధికారులపై ఒత్తిడులు ఎక్కువయ్యాయని నేనూ వింటున్నాను. అయితే ఐఏఎస్‌లు ప్రజా ప్రయోజనాలకు భిన్నమైన విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదు. చీపురుకట్టలో ఓ పుల్లనైతే విరచగలరు. కట్ట మొత్తం విరగొట్టలేరు కదా! అందరూ కలిసి ఉంటే ఏమీ చేయలేరు.

 ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని