Andhra Pradesh: జలాశయాలు ఖాళీ

రాష్ట్రంలో జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన జలాశయాల్లో కనీస నీటిమట్టాలు కూడా లేవు.

Published : 30 May 2024 04:55 IST

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పరిస్థితీ అంతే
పులిచింతల కూడా..
నైరుతి కోసం ఆశతో ఎదురుచూపులు

చుక్కనీరు లేని సోమశిల ముంపు ప్రాంతం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన జలాశయాల్లో కనీస నీటిమట్టాలు కూడా లేవు. తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఉమ్మడి జలాశయాలు కనీస నీటి నిల్వలు కూడా లేనంత స్థాయికి అడుగంటాయి. శ్రీశైలం జలాశయం డెడ్‌ స్టోరేజి నీటిమట్టం 834 అడుగులు. అంటే ఆ స్థాయికి మట్టాలు చేరితే నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటిది ప్రస్తుతం శ్రీశైలం జలాశయం మట్టం 806.20 అడుగులకు పడిపోయింది. నాగార్జున సాగర్‌ ఉమ్మడి జలాశయం పరిస్థితీ ఇంతే. 510 అడుగుల కనీస నీటిమట్టం ఉండాలి. అలాంటిది అంత కన్నా దిగువకు పడిపోయింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ మట్టం 504.70 అడుగుల స్థాయికి పడిపోయింది. కిందటి ఏడాది పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉంది. కిందటి సంవత్సరం మే 29న నాగార్జునసాగర్‌ జలాశయంలో  520 అడుగులు, శ్రీశైలంలో 809.90 అడుగుల నీటిమట్టాలు ఉన్నాయి. 

డెడ్‌స్టోరేజి కన్నా దిగువకు:  శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు 806.20 అడుగులుగా ఉన్న నీటిమట్టం

రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న ఇతర భారీ, మధ్యతరహా జలాశయాలు అన్నింటిలో కలిపి 26 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఆ జలాశయాలన్నింటిలోనూ 441.66 టీఎంసీల నీళ్ల నిల్వలకు అవకాశం ఉంది. అలాంటిది 69.77 టీఎంసీలే ఉన్నాయి. అందులో కనీస నీటిమట్టాల వద్ద నీళ్లు వినియోగించుకోవాలంటే 43.57 టీఎంసీలకు పైగా ఉంటేనే సాధ్యమవుతుంది. కొన్ని జలాశయాల్లో నీళ్లున్నా వాటికింద కాలువలు, పిల్ల కాలువల వంటి వెసులుబాటు లేకపోవడంతో ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితులు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉన్నాయి.

కృష్ణమ్మ ఎండిపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజికి ఎగువన ఉన్న కృష్ణా బ్యాలెన్సింగ్‌ జలాశయం పులిచింతల సైతం ఖాళీ అయింది. కృష్ణమ్మ పై ఉన్న ఎగువ జలాశయాలన్నీ నీళ్లు లేకుండా వెలవెలబోవడంతో రాబోయే రోజుల్లో తాగునీటికీ ఇబ్బందులు తప్పవు. కృష్ణాలో ఎగువన ఆలమట్టి నుంచి నారాయణపూర్‌ వరకు అనేక జలాశయాలు నిండితే తప్ప దిగువకు నీటిని వదిలే పరిస్థితులు లేవు. జూన్‌లో వర్షాలు కురిసినా శ్రీశైలం జలాశయంలోకి జులై నెలాఖరు వరకు నీటి ప్రవాహాలు వస్తాయన్న ఆశలూ లేవు. ఎగువ జలాశయాలు నిండితే తప్ప దిగువకు నీటిని వదలరు. సాధారణంగా శ్రీశైలం జలాశయానికి ఆగస్టులో ప్రవాహాలు వచ్చిన సందర్భాలే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.  ప్రకాశం బ్యారేజిలోనూ కేవలం 1.6 టీఎంసీలే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గోదావరికి వరదలు వచ్చి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీళ్లు మళ్లించగలిగితే కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటికి కొంతవరకు సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆ ఎగువన కృష్ణా జలాధారిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. జలాశయాలన్నీ వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని