Andhra Pradesh News: ఆగిన రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు!

ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ ద్వారా.. తన పేరిట రిజిస్ట్రేషన్‌ మార్పించుకుంటున్నారు.

Published : 24 May 2024 06:14 IST

రూ.18 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం
క్లౌడ్‌ యాక్సెస్‌ను నిలిపివేసిన సర్వీస్‌ ప్రొవైడర్‌
ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ పనిచేయక వాహనదారులకు ఇక్కట్లు

ఈనాడు, అమరావతి: ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ ద్వారా.. తన పేరిట రిజిస్ట్రేషన్‌ మార్పించుకుంటున్నారు. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్‌సైట్‌ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే.. సాంకేతిక సమస్య వచ్చిందని, నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు. కానీ.. అసలు విషయం అదికాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్‌ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్‌లో స్టోర్‌ అవుతుంది. అందుకు ఓటీఎస్‌ఐకి రవాణా శాఖ ఏటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ఏడాదిన్నరగా ఆ సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్‌ స్టోరేజ్‌తో యాక్సెస్‌ను నిలిపేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్‌సైట్‌ నిర్వహణ కూడా ఆ సంస్థే చూస్తోంది. రెండింటికీ కలిపి ఏడాదిన్నరగా దాదాపు రూ.18 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపేసింది. దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌ల జారీ మినహా.. మిగిలిన అన్ని సేవలూ బంద్‌ అయ్యాయి. వాహనాల ట్రాన్స్‌ఫర్, రెన్యువల్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ఎన్‌వోసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ-చలాన్ల చెల్లింపు, ఈ-పర్మిట్ల జారీ.. తదితర సేవలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో ఈ సమస్య వచ్చింది. 

అసలు ఏం జరిగింది..?

రవాణా శాఖ పరిధిలో వాహనాల సమాచారాన్ని 2016 నుంచి క్లౌడ్‌లో స్టోర్‌ చేస్తున్నారు. దానికి ఓటీఎస్‌ఐ సంస్థ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉంది. ఓ వాహనం ఎంతమంది చేతుల మారింది, దానికి ఎప్పుడెప్పుడు పన్నులు చెల్లించారు, జారీ అయిన పర్మిట్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తదితరాలన్నీ స్టోర్‌ చేస్తారు. ఈ డేటాను క్లౌడ్‌లో ఉంచినందుకు ఏటా రూ.5 కోట్ల వరకు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దీంతోపాటు రవాణా శాఖ చాలా కాలంగా ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలందిస్తోంది. ఆ వెబ్‌సైట్‌ కూడా సదరు సంస్థే నిర్వహిస్తోంది. ఇందుకు ఏటా రూ.3 కోట్ల వరకు చెల్లించాలి. మరోవైపు రవాణా శాఖకు సంబంధించి సేవలు అందించేందుకు కేంద్రం ఎన్‌ఐసీ రూపొందించిన వాహన్‌ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2021లో ఏపీ రవాణా శాఖ వాహన్‌లో చేరింది. రాష్ట్ర రవాణా శాఖకు చెందిన డేటా మొత్తం ఎన్‌ఐసీలోకి బదలాయింపు (మైగ్రేట్‌) కావాల్సి ఉంది. ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌ నెమ్మదిగా ఉండటం.. ఈ-ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్‌ అందులో లేకపోవడంతో ఆ ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో అటు వాహన్, ఇటు ఈ-ప్రగతి సేవలను కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వాహన్‌ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాహన్‌లో భాగమైన సారథి పోర్టల్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ-ప్రగతిలోనే అందుతున్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యమే: క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్, ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ను నిర్వహించే ఓటీఎస్‌ఐ సేవలను కొనసాగించడంపై గత ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అందుకు అవసరమైన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామని చెప్పి.. ఇంతకాలం సేవలు కొనసాగేలా చూశారు. బకాయి రూ.18 కోట్లకు పెరిగినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ఆ సంస్థ అర్ధాంతరంగా సేవలను ఆపేసింది. వాహన్‌లోకి రాష్ట్ర రవాణా శాఖ డేటా బదలాయింపు పూర్తవ్వకుండానే.. పాత సంస్థ సేవలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని