Andhra Pradesh: ‘నాడు-నేడు’ అదే గోడు!

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు.

Published : 22 May 2024 05:20 IST

రూ.280 కోట్లకు పైగా బిల్లుల పెండింగ్‌
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నిలిచిన పనులు
తరగతులు పునఃప్రారంభమైతే విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
ఈనాడు - అమరావతి

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణం

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు. దీంతో కొన్నిచోట్ల వచ్చిన సామగ్రిని బిగించకుండా పాఠశాలల ఆవరణల్లో ఉంచారు. తరగతి గదుల్లో వస్తువుల్ని నిల్వచేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈలోపు పనులు పూర్తికాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్పవు. విద్యాలయాల్లో రెండోదశ నాడు-నేడు పనులను 2021 ఆగస్టు 16న చేపట్టగా.. ఇప్పటికీ పూర్తికాలేదు. మూడేళ్లు కావొస్తున్నా.. నిధుల సమస్య కారణంగా సాగుతూనే ఉన్నాయి. గుత్తేదార్లకు సుమారు రూ.280 కోట్లు, తల్లిదండ్రుల కమిటీలకు రూ.500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేస్తేనే పనులు ముందుకెళ్తాయి.

తలుపులు, కిటికీల సరఫరా నిలిపివేసిన గుత్తేదార్లు

  • రాష్ట్రవ్యాప్తంగా 14,089 మరుగుదొడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టారు. చాలాచోట్ల ఈ నిర్మాణాలు పూర్తయినా.. వాటికి తలుపులు బిగించలేదు. గుత్తేదార్లకు బిల్లులు చెల్లించకపోవడంతో తలుపులు సరఫరా చేయలేదు. 
  • 8,617 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. సిమెంటు కొరత కారణంగా చాలాచోట్ల పనులు సాగడం లేదు. మరికొన్నిచోట్ల తలుపులు, కిటికీలు సరఫరా చేయలేదు. పలుచోట్ల తరగతి గదుల నిర్మాణం పునాదుల దశల్లోనే ఉంది. దీంతో ఈ ఏడాదీ తరగతి గదుల కొరత తప్పదు.
  • గుత్తేదార్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో రెండో విడత ‘నాడు-నేడు’ పనులు చేపట్టిన చాలా బడులకు ఆర్వో ప్లాంట్లు సరఫరా చేయలేదు. కొన్నిచోట్ల సరఫరా చేసినా, వాటిని బిగించలేదు. మొదటి విడతలో ఏర్పాటుచేసిన వాటిల్లోనూ కొన్ని పని చేయట్లేదు.
  • బకాయిల కారణంగా పాఠశాలలకు రంగులు వేసే పనులు నిలిచిపోయాయి. శ్లాబ్‌లకు మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో పెచ్చులు ఊడుతున్నాయి.

ఇదీ పనుల స్వరూపం

  • ప్రభుత్వంలోని అన్ని యాజమాన్యాలు, అంగన్‌వాడీలతో కలిపి 22,344 విద్యాసంస్థల్లో రెండోవిడత నాడు-నేడు పనులు చేపట్టారు.
  • రాష్ట్రంలో 44,478 పాఠశాలలుంటే మొదటి విడతలో 15,713 బడుల్లోనే పనులు పూర్తిచేశారు. ఇందులోనూ 3,615 చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణాలను రెండోదశలో చేపట్టారు. కొత్తగా రెండోదశలో 16,493 పనులు చేస్తున్నారు. ఇంకా 12,272 బడుల్లో పనులు మొదలుకాలేదు. 
  • అంచనా వ్యయం రూ.8 వేల కోట్లు
  • పనులు ప్రారంభం: 2021 ఆగస్టు 16

కర్నూలు నగరంలోని కింగ్‌మార్కెట్‌ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిల్వ చేసిన భవన వ్యర్థాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు