AP Poll violence: అంతా మెతక వైఖరే

వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు.

Updated : 21 May 2024 08:55 IST

మారణాయుధాలతో దాడికి తెగబడినా కఠినంగా లేని పోలీసులు
హింస చెలరేగినా హత్యాయత్నం సెక్షన్లే పెట్టని వైనం
అధికార పార్టీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి
ఈవీఎంలు ధ్వంసం చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లు వర్తింపజేయలేదు
దళితులను కొట్టినా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు
33 కేసుల్లో 1,370 మంది నిందితులు.. అరెస్టు చేసింది 124 మందినే
మాచర్ల, నరసరావుపేట ఘటనల్లో ఒక్కర్నీ అరెస్టు చేయలేదు
డీజీపీకి ఇచ్చిన 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్‌ వెల్లడి

మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు
నివేదిక అందిస్తున్న సిట్‌ అధిపతి వినీత్‌ బ్రిజ్‌లాల్‌. పక్కన ఎస్పీ రమాదేవి

ఈనాడు, అమరావతి: వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. ఊళ్లలో దళితులపై దమనకాండకు పాల్పడితే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు. పోలింగ్‌ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. పలుచోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. దర్యాప్తు కూడా లోపభూయిష్ఠంగా కొనసాగించారు. ఇప్పటివరకూ నిందితుల్నే పూర్తిస్థాయిలో గుర్తించలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఒక్కరినీ అరెస్టుచేయలేదు. పైగా వారికి సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41ఏ నోటీసులిచ్చి సరిపెట్టేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ వెలుగుచూశాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో రెండు రోజులుగా విస్తృతంగా పర్యటించిన సిట్‌ బృందాలు 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. వీటికి సంబంధించిన 150 పేజీల సమగ్ర నివేదికను సిట్‌ అధిపతి వినీత్‌ బ్రిజ్‌లాల్, ఎస్పీ రమాదేవి సోమవారం సాయంత్రం డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు అందజేశారు. ఆయన ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు. నివేదికలో ప్రధానాంశాలివి...

అవసరమైన సెక్షన్లు వర్తింపజేసి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని ఆదేశం

తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన నాలుగు కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన ఏడు కేసులను సిట్‌ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి. ఘటనా స్థలాన్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు, బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలనూ పరిశీలించాయి. హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు వర్తింపజేశారా? లేదా? నిందితులందర్నీ గుర్తించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిపాయి. పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్లు పెట్టారని గుర్తించాయి. సంబంధిత సెక్షన్లు వర్తింపజేస్తూ వెంటనే కోర్టుల్లో మెమోలు దాఖలుచేయాలని ఆదేశించాయి. ఇలా ప్రతి కేసు వివరాలు, వాటిలో వర్తింపజేయాల్సిన సెక్షన్లు, ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు, అందులోని లోపాలు తదితర వివరాలన్నింటినీ సిట్‌ తన నివేదికలో పొందుపరిచింది. 

639 మంది నిందితుల్ని గుర్తించనేలేదు

ఈ 33 కేసుల్లో 1,370 మంది నిందితులు కాగా వారిలో ఇప్పటివరకు 731 మందినే గుర్తించారు. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. ఆయా కేసుల్లో 124 మందినే అరెస్టు చేశారు. 94 మందిని అరెస్టు చేయకుండా సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద నోటీసులిచ్చారు. నిందితుల్ని గుర్తించేందుకు, అరెస్టు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిట్‌ డీజీపీకి నివేదించింది. సీసీ ఫుటేజ్‌లు, వీడియోలు వంటి డిజిటల్‌ ఆధారాలు సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. నిర్దేశిత సమయంలోగా ఆయా కేసులన్నింటిలోనూ అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్దేశించింది. ఈ కేసుల దర్యాప్తుపై సిట్‌ పర్యవేక్షణ కొనసాగుతుంది. 

మాచర్ల, నరసరావుపేట ఘటనల్లో ఒక్కర్నీ అరెస్టు చేయలేదు

  • మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో మారణాయుధాలతో దాడులు, వాహనాల దహనాలు, రాళ్లు విసురుకోవటం వంటి ఘటనలతో హింస పెచ్చరిల్లింది. వాటిలో తీవ్రమైన 18 కేసుల్లో 474 మందిని నిందితులుగా గుర్తించగా.. ఇప్పటి వరకూ ఒక్కర్ని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు. 67 మందికి మాత్రం సీఆర్‌పీసీ 41ఏ నోటీసులిచ్చి మమ అనిపించేశారు. గురజాల నియోజకవర్గంలో హింసకు సంబంధించి నమోదైన 4 కేసుల్లో 107 మందిని నిందితులుగా గుర్తించినప్పటికీ కేవలం 19 మందినే అరెస్టు చేశారు.
  • తాడిపత్రిలో చెలరేగిన హింసకు సంబంధించి 7 కేసుల్లో 728 మంది నిందితులున్నారు. వీరిలో 91 మందినే అరెస్టు చేశారు.
  • చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో చెలరేగిన హింసకు సంబంధించి 4 కేసుల్లో 61 మందిని నిందితులుగా గుర్తించగా.. వారిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు.

బాధితులపై ఫిర్యాదులపై పరిశీలించి చర్యలు

సిట్‌ బృందాలకు క్షేత్రస్థాయి పర్యటనలో పలువురు బాధితులు ఫిర్యాదులిచ్చారు. వినతిపత్రాలు సమర్పించారు. వాటన్నింటినీ సిట్‌ పరిశీలిస్తోంది. ఏదైనా ఘటనల్లో కేసులు నమోదు కాకపోతే వాటి ఆధారంగా కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయనున్నారు. సిట్‌ నివేదిక పట్ల డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సంతృప్తి వ్యక్తం చేశారు. సిట్‌ బృందంతో సమన్వయం చేసుకుని ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలు, రేంజి డీఐజీలతో పాటు గుంటూరు ఐజీని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని