Water crisis: గొంతెండుతోంది మహాప్రభో!

ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది.

Updated : 25 May 2024 05:44 IST

45 పుర, నగరపాలక సంస్థల్లో తీవ్రంగా తాగునీటి ఎద్దడి
ఐదారు రోజులకోసారి అరకొరగా సరఫరా
ప్రైవేట్‌ ఆర్వో ప్లాంట్లలో నీళ్లు కొంటున్న ప్రజలు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్దయాచవరంలో ట్యాంకర్‌ వద్ద నీటి కోసం గ్రామస్థులు

  • ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. నగర శివారు నేతాజీకాలనీ, ఇందిరాకాలనీ, తీర్లమాన్యం... ఇలా అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి. 
  • చిత్తూరు జిల్లా పలమనేరులో తాగునీరు ఎన్ని రోజులకోసారి సరఫరా చేస్తున్నారో తెలుసా? ఆరు రోజులకోసారి. సమస్యపై అరిచి గీపెట్టినా ఎవరికీ పట్టదు. అత్యవసరం అనుకుంటే ప్రైవేట్‌ ఆర్వో ప్ల్లాంట్లకు వెళ్లి నీరు కొనుక్కోవాలని ఉచిత సలహాలిస్తారు. పలమనేరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

ఈనాడు, అమరావతి: బిందెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ పలు పట్టణాల ప్రజలు ఆక్రందనలు చేస్తున్నారు. ఐదారు రోజులకోసారి అరకొరగా సరఫరా చేస్తుండటంతో తాగునీరు సరిపోక అవస్థలు పడుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రణాళికల అమలుకు నిధుల లేమి ప్రతిబంధకమవుతోంది. 45 పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నా.. తప్పుడు నివేదికలు, కాకిలెక్కలతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. 32 పట్టణాల్లోనే నీటి కొరత ఉందని చెబుతున్నారు. అదీ చెప్పుకోదగ్గ సమస్య కాదంటున్నారు. బిందెడు నీటి కోసం రోడ్లపైకి వచ్చి మహిళలు చేస్తున్న ఆందోళనలు అధికారులకు కనిపించడం లేదు. వేసవిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఉద్దేశించిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల గ్రాంట్లు నిలిపివేశారు. 

ప్రకాశం జిల్లా పొదిలిలో వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే తాగునీరు సరఫరా అవుతుండటంతో ఎన్‌ఏపీ కుళాయి వద్దకు వచ్చి నీరు పట్టి తీసుకెళ్తున్న పట్టణ వాసులు

కాకి లెక్కలు.. ప్రజలకు చుక్కలు

ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాల్లో పట్టణ ప్రజలకు ఐదారు రోజులకోసారి తాగునీరు అందించడమూ కష్టమవుతోంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి పట్టణాల్లో సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆరు రోజులకోసారి తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా ఉన్నా.. సమస్య తీవ్రంగా ఉన్న పట్టణాల సంఖ్య ఏడుకు మించి లేవంటూ తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. బద్వేల్, బొబ్బిలి, మాచర్ల, మదనపల్లె, నందిగామ, నంద్యాల, రాయచోటి, విజయనగరం పుర, నగరపాలక సంస్థల్లో నాలుగైదు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నా.. ప్రభుత్వం దృష్టిలో అక్కడ రెండు రోజులకోసారి నీరు ప్రజలకు పుష్కలంగా అందుతోందంటూ చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో 45 చోట్ల తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది. ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రజలు తాగునీటి కోసం రోజూ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ప్రైవేట్‌ ఆర్వో ప్లాంట్లలో 20 లీటర్ల నీటిని రూ.20కి కొంటున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోనూ ఇదే పరిస్థితి. 

నివేదికలే.. ఐదేళ్లుగా నిధుల్లేవు 

వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఐదేళ్లుగా పట్టణ స్థానిక సంస్థలకు నిధులివ్వడం లేదు. ఏటా వేసవికి ముందు పుర, నగరపాలక సంస్థలకు అవసరమైన నిధులకోసం కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందుతాయి. వీటిపై సమీక్షించి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కింద నిధులు కేటాయిస్తుంటారు. గత ఐదేళ్లలో రూ. 350 కోట్లకుపైగా నిధుల కోసం స్థానిక సంస్థల నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పక్కన పెట్టారు. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేక పోతున్నారు. ఇతర అత్యవసర సమయాల్లో చేపట్టిన పనులకు సంబంధించి రూ. 25 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కొరతతో ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిపివేశారు. మార్కాపురం, కనిగిరిలోనూ అరకొరగా సరఫరా చేస్తున్నారు.

  • పట్టణ స్థానిక సంస్థలు: 123
  • వీటిలో తలసరి రోజూ 135 లీటర్ల చొప్పున సరఫరా చేయాల్సి నీరు: 2,700 మిలియన్‌ లీటర్లు
  • ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు : 1,790 మిలియన్‌ లీటర్లు 
  • లోటు: 910 మిలియన్‌ లీటర్లు 

నీరు సేకరిస్తున్నదిలా...

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల నుంచి అందిస్తున్న పట్టణాలు: 38
రిజర్వాయర్లు, నదులు, కాలువల నుంచి నీరు సేకరిస్తున్నవి: 26
బోర్లు, ఇన్‌ఫిల్ట్రేషన్‌ బావుల్లో నీరు తీసుకుంటున్నవి: 59

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని