Ikkurru: గొడవలకు స్వస్తి.. అభివృద్ధికి నాంది

రాజకీయ మారణహోమంతో అట్టుడికిన ఆ గ్రామం ఇప్పుడు నవోదయంతో తొణికిసలాడుతోంది.

Updated : 26 May 2024 08:05 IST

కలిసిమెలిసి జీవిస్తున్న గ్రామస్థులు
విదేశాల్లో ఉద్యోగాలతో నవతరం పురోగతి 
పల్నాడు జిల్లా ఇక్కుర్రు ప్రస్తుత స్థితి ఇదీ

ఇక్కుర్రులోని దేవాలయం

ఈనాడు డిజిటల్, నరసరావుపేట- న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌: రాజకీయ మారణహోమంతో అట్టుడికిన ఆ గ్రామం ఇప్పుడు నవోదయంతో తొణికిసలాడుతోంది. కక్షలు, కార్పణ్యాలతో నష్టపోయిన ఓ తరం.. తమ భావితరాల బాగుకోసం చేసిన కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రత్యర్థులు అనే మాటే లేదు. క్షణికావేశంలో చోటుచేసుకున్న విషాద ఘటనలను మర్చిపోయి అన్నివర్గాల వారూ కలిసిమెలిసి జీవిస్తూ.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామస్థులు రాసిన ‘మరో చరిత్ర’ ఇది.


ప్రస్తుతం విదేశాల్లో ఉన్నతస్థాయిలో

రెండువర్గాల వారు కేసుల వాయిదాల కోసం కోర్టు చుట్టూ ఐదేళ్ల పాటు తిరిగారు. 1996లో కేసులకు కోర్టు ముగింపు పలికింది. ప్రతీకార దాడులు.. కేసులతో రూ.లక్షలు పోగొట్టుకున్నామని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు. అప్పట్లో చదువులేక రాజకీయ కక్షల్లో ఇరుక్కుపోయామని బాధపడుతున్నారు. సుమారు ఆరువేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 2004 నుంచి ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదంటూ సంతోషంగా చెబుతున్నారు. అప్పట్లో రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడ్డ కుటుంబాలన్నీ నేడు పరస్పరం శుభకార్యాలకు హాజరవుతున్నారని, పాత గొడవలను ఎవరూ మనసులో పెట్టుకోలేదని, అందుకే ఎటువంటి అల్లర్లు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఊరి నుంచి ఇంటికొకరు ఉన్నతస్థాయిలో ఉన్నారు. సుమారు 100 మంది వరకూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.


అప్పుడేం జరిగింది?

1989 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున నరసరావుపేట మండలం ఇక్కుర్రులో కాంగ్రెస్, తెదేపా వర్గీయుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రెండువర్గాల వారు నాటుబాంబులు విసురుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ వ్యక్తి గోడ ఎక్కి నాటుబాంబు విసరడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు సైరన్‌ మోగడంతో కాలుజారి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తెదేపా వర్గీయులపై కాంగ్రెస్‌ వర్గీయులు కక్ష పెంచుకున్నారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. పాత ఘటనను మనసులో పెట్టుకుని దాడులు చేయాలని కాంగ్రెస్‌ వర్గీయులు ప్రణాళిక వేసుకున్నారు. పోలింగ్‌ రోజు జరిగిన దాడుల్లో నిందితులుగా ఉన్న తెదేపా వర్గీయులు 40మంది నరసరావుపేట కోర్టుకు వెళ్లారు. ఇదే అదునుగా భావించి ఎవరు వచ్చినా దాడులు చేయాలని కాంగ్రెస్‌ వర్గీయులు గ్రామంలోని ఓ ఆలయం వద్ద మారణాయుధాలతో సిద్ధంగా ఉన్నారు. పొలంలో నారుపోసి ఎడ్లబండిపై కనుమూరి వెంకటేశ్వర్లు(60), ఓ మహిళ(40), ఓ యువకుడు(30) ఊరులోకి వస్తున్నారు. కాపుకాస్తున్న అల్లరిమూకలు రోడ్డుపైకి వచ్చి ఎడ్లబండిపై నుంచి వారిని కిందకు లాగి మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ముగ్గురినీ కొన ఊపిరితో ఉండగానే గడ్డివాములో వేసి          తగలబెట్టారు. ఈ ఘటన 1990 జులై 19న జరిగింది. సజీవదహనం కేసులో ఏడుగురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడింది. 


మా తరంతోనే ముగింపు
- కనుమూరి రమేశ్, ఇక్కుర్రు

రాజకీయాలకు సంబంధం లేని మా నాన్నను చంపేశారు. ఆయుధాలతో దాడిచేయడమే కాకుండా బతికుండగానే దహనం చేశారు. నేను చదువుకోవడంతో ఈ గొడవలకు దూరంగా ఉంటున్నా. నా పిల్లలనూ అలానే పెంచాను. వారంతా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. నాన్నను చంపినంత మాత్రాన ప్రత్యర్థులుగా నేను ఎవరినీ భావించడం లేదు. అలా అనుకుంటే సంతోషంగా ఉండలేం. పగ, ప్రతీకారాలతో రగిలిపోతే జీవితం నరకం. కేసుల్లో ఇరుక్కుంటూ జీవితాలను పాడుచేసుకోవడం మంచిది కాదు. మా తరంతోనే గొడవలకు ముగింపు పలికాం.


కేసులతోనే సగం జీవితం వృథా
- జి.పేరయ్య, ఇక్కుర్రు

మా నాన్న గ్రామపెద్దగా వ్యవహరించేవారు. కాలక్రమేణా పార్టీలు వచ్చి ప్రజల్లో చిచ్చుపెట్టాయి. గొడవల్లో కేసుల్లో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరిగాం. సగం జీవితం వృథా అయిపోయింది. కొంత ఆస్తి కూడా హరించుకుపోయింది. మేం పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదని గొడవలకు దూరంగా పెంచాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని