Palnadu: పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్‌ రాజును నియమించింది.

Published : 19 May 2024 05:14 IST

ఎస్పీగా మలికా గార్గ్‌
అనంతపురం, తిరుపతి ఎస్పీలుగా గౌతమి శాలి, హర్షవర్ధన్‌ రాజు
నియమిస్తూ ఆదేశాలిచ్చిన ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్‌ రాజును నియమించింది. ఎన్నికల పరిశీలకుల విధుల్లో లేని అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని, ఆ విధుల్లో ఉన్నవారు ఆదివారం బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ... పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందుమాధవ్‌ గరికపాటి, అమిత్‌ బర్దర్‌లను సస్పెండ్‌ చేసి, పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో ఈ కొత్త అధికారులను నియమించింది. 

  • 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీకేష్‌ బాలాజీరావు లఠ్కర్‌ ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి వరకూ ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌గా, విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • అనంతపురం ఎస్పీగా నియమితులైన గౌతమి శాలి 2015 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం విజయనగరం, విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్లకు కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరకూ అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు. గతంలో విశాఖపట్నం శాంతిభద్రతల విభాగం డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 
  • పల్నాడు ఎస్పీగా నియమితురాలైన మలికా గార్గ్‌... 2015 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. రెండున్నరేళ్ల పాటు ప్రకాశం ఎస్పీగా పనిచేశారు. ఎన్నికలకు ముందు నెల రోజులు తిరుపతి ఎస్పీగా ఉన్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో ఆమె బదిలీ అయ్యారు. ప్రస్తుతం సీఐడీలో ఎస్పీగా ఉన్నారు.
  • ప్రస్తుతం సీఐడీ సైబర్‌ నేరాల విభాగం ఎస్పీగా ఉన్న వి.హర్షవర్ధన్‌ రాజు 2013 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయన్ను తిరుపతి ఎస్పీగా నియమించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని