Chandragiri: చంద్రగిరి డీఎస్పీపై వేటు

చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్‌ రాజ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Updated : 30 May 2024 07:31 IST

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్‌ రాజ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగే ఘటనలను ముందస్తుగా పసిగట్టి నిలువరించడం.. ఆ తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా నిలువరించే చర్యలు చేపట్టనందుకు పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. యశ్వంత్‌ రాజ్‌కుమార్‌ మూడు నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ రీపోలింగ్‌ జరిగిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంపై ఆయన ప్రత్యేకశ్రద్ధ కనబరచలేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. తెదేపా అభ్యర్థి పులివర్తి నాని మధ్య కొంతకాలంగా వివాదాలు తారస్థాయికి చేరినా పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. గడిచిన మూడు నెలల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పినట్లుగానే డీఎస్పీ చేశారన్నది తెదేపా వర్గీయుల ఆరోపణ. ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారు. కనీసం ఆ తర్వాతైనా ఎమ్మెల్యే చెవిరెడ్డికి.. తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించి, వారి ఉనికిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే హత్యాయత్నం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని