Tadepalli: తాడేపల్లిలో తోడేళ్ల డెన్‌!

‘రౌడీలంతా గుంపులుగా ఊరి మీద పడి.. సామాన్యుల్ని, వ్యాపారుల్ని భయపెట్టి, వేధించి వసూలు చేసిన సొమ్మంతా ఏ రోజుకు ఆ రోజు విలన్‌ అడ్డాకు చేరుస్తారు.

Updated : 10 Jun 2024 06:52 IST

ఐదేళ్లుగా.. అనుమానాస్పద లావాదేవీలన్నీ అక్కడే!
ప్యాలెస్‌ పక్కనే కొన్ని విల్లాలు, ఫ్లాట్లలో వ్యవహారాలు
ఇసుక, మద్యం సహా ఎన్నో అక్రమాలు అక్కణ్నుంచే!
కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే.. వాస్తవాలు వెలుగులోకి..

ఈనాడు-అమరావతి: ‘రౌడీలంతా గుంపులుగా ఊరి మీద పడి.. సామాన్యుల్ని, వ్యాపారుల్ని భయపెట్టి, వేధించి వసూలు చేసిన సొమ్మంతా ఏ రోజుకు ఆ రోజు విలన్‌ అడ్డాకు చేరుస్తారు. కుప్పలుగా పోసి యంత్రాలతో లెక్క పెడుతుంటారు..’ 17 ఏళ్ల కిందట వచ్చిన ‘ఢీ’ సినిమాలో ఇదొక సన్నివేశం.. గత ఐదేళ్లపాటు తాడేపల్లి ప్యాలెస్, పక్కనున్న కొన్ని విల్లాలు, అపార్ట్‌మెంట్లలోని కొన్ని ఫ్లాట్లలో ఈ సినిమా సన్నివేశాలను తలదన్నేంత వ్యవహారాలు సాగాయి. అక్కడి అవినీతి సొమ్ము లెక్కలు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. అందులో పెద్దలకు చేరేది వందల కోట్లలోనే ఉంటుంది మరి! వారి సామంతుడిగా పనిచేసే సలహాదారు, మరో ముఖ్య అధికారి వాటాలూ పెద్దమొత్తంలోనే ఉన్నాయి. ఎవరి లెక్కలు వారివే. మద్యం అమ్మకాల్లో వచ్చిన నగదైనా.. ఇసుక నుంచి తీసిన సొమ్మైనా.. కాంట్రాక్టుల్లో వాటాలైనా.. అన్నీ అక్కడ నుంచే నడిచాయి. అనుమానాస్పద లావాదేవీలకు నిలయంగా మారిన కొన్ని అపార్ట్‌మెంట్లలోని కొన్ని ఫ్లాట్లు, విల్లాలను తనిఖీ చేస్తే.. అక్రమ వ్యవహారాలెన్నో వెలుగులోకి వస్తాయి. వాటన్నిటిని తరలించకముందే.. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొన్ని రాజకీయపక్షాలు డిమాండు చేస్తున్నాయి. 

గత ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో దోపిడీని కేంద్రీకృతం చేశారు. కీలకమైన మద్యం, ఇసుక సహా బిల్లుల చెల్లింపులో కమీషన్ల వసూలు వరకు.. అక్రమ లావాదేవీలన్నీ తాడేపల్లి కేంద్రంగానే నడిపించారు. శాఖలవారీ బాగా నమ్మకస్తులైన కొందరు అధికారులను నియమించుకుని.. వారి కనుసన్నల్లోనే కార్యక్రమాలు నడిపించారు. అదనంగా వచ్చిన మొత్తాన్ని లెక్క చూసి తరలించే విషయాన్ని అధినేతకు బాగా దగ్గరి వారు చూశారు. అచ్చంగా ఇలాంటి వ్యవహారాల కోసమే కొందరు విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. మరికొన్ని అద్దెకు తీసుకున్నారు. వీటి కోసమే రూ.కోట్లలో ఖర్చు చేశారంటే.. అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ప్రభుత్వం తరపున అద్దె కట్టే ఫ్లాట్లు కూడా కొన్ని ఉండడం గమనార్హం. 

బిల్లు రావాలంటే.. పది శాతం సమర్పించుకోవాల్సిందే 

కాంట్రాక్టు పనులకు బిల్లులు రావాలంటే.. పెద్దమొత్తంలో సమర్పించుకోవాల్సిందే. రూ. 2 కోట్లకు మించి బిల్లు చెల్లించాలంటే ప్యాలెస్‌ నుంచి అనుమతి రావాల్సిందే. దీనికి 10% కమీషన్‌ తప్పనిసరి. పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించిన ఇలాంటి వసూళ్లన్నీ ముఖ్యనేతలకు అతి సన్నిహితులైన ఒకరిద్దరి కనుసన్నల్లోనే నడిచాయి. మరికొన్ని బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ.. ఒక ముఖ్య అధికారితోపాటు గత ప్రభుత్వంలో నంబర్‌ 2 అనేలా అధికారం చెలాయించిన ఒక నాయకుడి కనుసన్నల్లో సాగాయి. వీరి కింద పదులకొద్దీ దళారులు ఉండేవారు. ఒక్కో దళారీ నాలుగైదు ఖరీదైన కార్లతో రాజసం వెలగబెట్టారు. అంటే ఎంత భారీ స్థాయిలో వసూళ్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వైకాపా అధికారాన్ని కోల్పోవడంతో.. తాడేపల్లి కేంద్రంగా సాగిస్తున్న అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడింది.  

పక్కా లెక్క.. అధికారికంగా దొరక్కుండా? 

తాడేపల్లి ప్రాంతంలోని పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్ల నుంచే ఐదేళ్లపాటు అక్రమ వసూళ్ల వ్యవహారం సాగింది. ఎవరి పని వారిదే. పదుల సంఖ్యలో వ్యక్తులు ఈ వ్యవహారాల్లో నిమగ్నమైనా.. ఒకరు చేసేది మరొకరికి తెలియనంత పకడ్బందీగా జరిగేది. ఉదాహరణకు ఇసుక అక్రమాలనే తీసుకుంటే.. ఎక్కడెక్కడ ఎంతెంత తరలించారు? వాటి ద్వారా వచ్చిన మొత్తమెంత.. అనే లెక్కల్ని రేవులవారీగా నిర్వహించే అధికార పార్టీ నేతలు సాయంత్రానికి పంపేవారు. ఈ కథ మొత్తం ఫోన్లు, ఆన్‌లైన్‌లోనే నడిపేవారు. మద్యం వ్యవహారాలు చూసేందుకు మరో భవనం ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటిని క్రోడీకరించి పెద్దలకు లెక్కలు అప్పజెప్పేవారని కొందరు వైకాపా నేతలు పేర్కొంటున్నారు. 

సమగ్ర విచారణ చేయిస్తే..: ఇసుక, మద్యం సహా వివిధ రంగాల్లో భారీ ఎత్తున జరిగిన దోపిడీపై కొత్త ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ పక్షాలు డిమాండు చేస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌ సమీపంలోని అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన ప్లాట్లు, విల్లాల్లో అధికారులు తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గతంలో అక్కడ విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది ఎవరో విచారిస్తే.. రూ.వేల కోట్ల దోపిడీలో నిజాలు బయటపడతాయి. ఇక్కడ జరిగే వ్యవహారాలు శాఖలవారీ కొందరు ఉన్నతాధికారులకూ తెలుసని, వారి పాత్రపైనా విచారణ చేయించాలని కోరుతున్నారు. ఈ దోపిడీలన్నిటి వెనక అంతిమ లబ్ధిదారులెవరో తేల్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని