Andhra Pradesh News: నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

సాంకేతిక సమస్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు నిలిచిపోయాయి.

Published : 24 May 2024 04:07 IST

సాంకేతిక సమస్యలతో క్రయవిక్రయదారుల అవస్థలు
మధ్యాహ్నం 3.15 తర్వాత సేవల పునరుద్ధరణ

సర్వర్‌ మొరాయించడంతో విజయవాడ పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో క్రయవిక్రేతల పడిగాపులు 

ఈనాడు, అమరావతి: సాంకేతిక సమస్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు నిలిచిపోయాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చిన వారు గంటలకొద్దీ వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నూతన సాఫ్ట్‌వేర్‌ (కార్డ్‌-0.2) అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడపాదడపా రిజిస్ట్రేషన్ల పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. జాతీయ విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ) ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ ఇస్తామన్నా కాదని.. రూ.30 కోట్లు చెల్లించి మరీ వైకాపా పెద్దలకు చెందిన ‘క్రిటికల్‌ రివర్‌’ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ తయారుచేయించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి అడపాదడపా ఏదో ఒక సాంకేతిక సమస్యతో దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గంటలకొద్దీ నిలిచిపోతున్నాయి. గురువారం నాడు దస్తావేజు రెండో పేజీపై క్రయ, విక్రయదారులు, సబ్‌రిజిస్ట్రార్‌ సంతకాలు (ఈ-సైన్‌) పడలేదు. దీనివల్ల ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రయవిక్రయదారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది సతమతమయ్యారు. 3.15 గంటల తరువాత క్రమంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దూరప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి రావడంతో తమ తిరుగు ప్రయాణాల ప్రణాళిక అంతా తారుమారయిందని పలువురు వాపోయారు. రిజిస్ట్రేషన్‌ శాఖ పనితీరుపై మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని